వీడియో: బేబీ సినిమాలో డ్రగ్స్ సీన్స్ ఏంటి? పోలీసుల అభ్యంతరం ఆ ఒక్కటేనా?

వీడియో: బేబీ సినిమాలో డ్రగ్స్ సీన్స్ ఏంటి? పోలీసుల అభ్యంతరం ఆ ఒక్కటేనా?

చిన్న సినిమాగా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్న బేబి మూవీకి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. డ్రగ్స్‌ను ప్రోత్సహించేలా ఈ మూవీలో కొన్ని సీన్లు ఉన్నాయని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్ చెప్పటం సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. 

కొద్దిరోజుల క్రితం మాదాపూర్‌లోని ఫ్రెష్‌లివింగ్‌ అపార్ట్‌మెంట్‌ పై దాడిచేసిన పోలీసులు.. అక్కడ డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అక్కడ కనిపించిన దృశ్యాలు.. ‘బేబి’ సినిమాలో యథాతథంగా పొందుపరిచారని సీపీ తెలిపారు. అంటే.. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న వారు.. బేబీ సినిమా చూసే డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేసినట్లా! సీపీ మాటలను బట్టి ప్రేక్షకులపై ఈ మూవీ ఏ స్థాయిలో ప్రభావం చూపిందో ఆలోచించాలి.

బేబీ సినిమా మంచి విజయాన్ని అందుకోవడానికి ప్రధాన కారణం.. నిజ జీవితానికి దగ్గరగా ఉందని నలుగురు మాట్లాడమే. సామాన్యుల పిల్లలు స్థాయిని మించిన కాలేజీల్లో చేరినప్పుడు వారి మార్పులు ఎలా ఉంటాయి? అన్నది ఈ సినిమా. విలాసవంతంగా జీవించాలనుకున్న ఒక అమ్మాయి జీవితం చివరకు ఏమైందన్నదే కథనం. అందరూ ఈ సినిమాలో చూపిన విధంగా ఉంటారని కాదు.. ఉంటారని అనుకోవడమే విజయానికి కారణం. 

బేబీ సినిమాలో డ్రగ్స్ సీన్స్ ఏంటి?

ఈ సినిమాలో హీరోయిన్ ఒక సీన్ లో స్నేహితులతో కలిసి డ్రగ్స్ తీసుకున్నట్లు ఉంటుంది. ప్రెస్ మీట్ లో పోలీసులు చూపించిన దృశ్యాలు కూడా అవే. ఇలాంటి దుశ్యాలు చూసి కొందరు యువత ఆ దిశగా నడుస్తున్నారన్నది అంగీకరించాల్సిందే. అప్పుడప్పుడు నగరం చుట్టుపక్కల ఉన్న కాలేజీ విద్యార్థులు రేవ్ పార్టీల్లో పట్టుబడటం కూడా కొన్ని ఉదాహరణలే.

అలా అని బేబీ సినిమా చూసి ప్రేక్షకులు ఆ దిశగా నడవాలని సినీ బృందం ఎక్కడా కూడా చూపించలేదనేది కూడా ఆలోచించాలి. సినిమా రంగం ముఖ్య ఉద్దేశం.. వినోదాన్ని పంచడమే. మంచి.. చెడు రెండు ఉంటాయి. చూసేవారి కోణాన్ని బట్టి మార్పు ఉంటుంది. అలాగే, ఇలాంటి కథనాల వల్ల సమాజానికి ఉపయోగమా! అనేది కూడా సినిమా ఇండస్ట్రీ ఆలోచించాలి. మొత్తంగా మాదాపూర్ డ్రగ్స్ కేసులో బేబీ సినిమా పేరు కూడా తెరపైకి రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.