రాజకీయ అవినీతికి  చెక్​ పెట్టే అస్త్రమేది?

రాజకీయ అవినీతికి  చెక్​ పెట్టే అస్త్రమేది?

‘చట్టసభకు ఎన్నికయ్యే ప్రతి ప్రజాప్రతినిధి ఒక అబద్దంతో ప్రజాజీవితాన్ని ప్రారంభిస్తున్నారు, అది తన ఎన్నికల ఖర్చు ప్రమాణపత్రం వెల్లడి ద్వారా’ అని దివంగత ప్రధాని వాజ్‌‌‌‌‌‌‌‌పేయి అన్నారు. నిజాయితీ, నిర్బీతిగల అరుదైన నేత కాబట్టి ఆయన ఆ మాటలన్నారు. నిజాన్ని పచ్చిగా ఒప్పుకోగలిగారు. ఎన్నికల వ్యయం దేశ రాజకీయాల్ని ఎంతటి అధ్వాన స్థితికి దిగజార్చిందో చూపే ఓ బహిరంగ ప్రదర్శన ఇటీవల తెలంగాణలో జరిగిన ‘మునుగోడు’ అసెంబ్లీ ఉపఎన్నిక! నిజాయితీ లోపించిన రాజకీయ వ్యవస్థ నిర్వాకంలో, కోరలుండీ కొరకని ఎన్నికల సంఘం నిఘాలో.. రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల స్వరూపం ఎలా ఉంటుందో ఊహించడానికే గగుర్పాటు కలుగుతోంది. అంతటి ఎన్నికల్లో విపక్షం కలిసికట్టుగా తన నేతృత్వంలోకి వస్తే ప్రచార వ్యయమంతా తాను చూసుకుంటానని తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అధినేత కె.చంద్రశేఖరరావు సన్నిహితుల వద్ద అన్నట్టు ప్రముఖ జర్నలిస్టు రాజ్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ సర్దేశాయ్‌‌‌‌‌‌‌‌ వెల్లడించడం సంచలనం సృష్టించింది. అంత సంపద ఆయన దగ్గర పోగయిందా? అన్నది తొలి సందేహమైతే, తమ ఈగోలు వీడి విపక్షాలన్నీ ఒక తాటిపైకి రాగలవా? అన్నది మరో సందేహం! అసలు సందేహం మాత్రం, విచ్ఛలవిడి ‘రాజకీయ అవినీతి’ కట్టడి సాధ్యమా? అన్నది. తెలుగునాట, దేశమంతా ఇప్పుడిదే చర్చనీయాంశం!

చక్రీయ ప్రక్రియగా..

దేశంలో రాజకీయ అవినీతి పట్టపగ్గాల్లేకుండా సాగుతోంది. రాజకీయ పక్షాలు పెద్ద మొత్తాల్లో డబ్బు సమకూర్చుకొని, ఎన్నికల్లో ఖర్చు చే సి అధికారం పొందే తీరు ప్రజాక్షేత్రంలో తరచూ చర్చనీయాంశమౌతోంది. ఇబ్బడి ముబ్బడిగా డబ్బు ఖర్చు చేసి, ఆధిపత్యంతో ఎన్నికలు గెలిచి అధికారం చేజిక్కించుకుంటున్నారు. వ్యక్తులుగా, పార్టీలుగా ఖర్చు చేసినదానికి ఎన్నో రెట్లు తిరిగి సంపాదించుకుంటున్నారు. అధికారం నీడలో కార్పొరేట్లకు అనుచిత ప్రయోజనాలు కలిగించి పెద్ద మొత్తంలో ప్రత్యక్ష, పరోక్ష విరాళాలు, ప్రభుత్వ నిధుల్లో వాటాలు పొందడం, డబ్బు వెదజల్లి అధికారం కాపాడుకోవడం... ఇదొక చక్రీయ ప్రక్రియగా మారింది. రాజకీయాల అర్థం, నిర్వహణ నమూనాయే మారిపోయింది. ప్రజాసేవ పోయి, రాజకీయాలంటేనే ‘వ్యూహాత్మక పెట్టుబడి, వ్యవహారదక్షత, అసాధారణ అబ్ది’ అనే ఫార్ములాగా మారిపోయింది. పౌరసమాజం ఇదంతా గ్రహిస్తూ, జటిల సమస్యగా అంగీకరిస్తోంది. కానీ, సమస్యకు పరిష్కారం లభించడం లేదు.

కొరవడిన చిత్తశుద్ధి

మలి విడత ఎన్నికల సంస్కరణలు తక్షణావసరం. దానికి ముందు, ఇప్పుడున్న ఎన్నికల నియమావళి అమలుకు చిత్తశుద్ధి కావాలి. ఇప్పుడు ఈ రెండూ లేవు. దాంతో ఎన్నికల ప్రక్రియ దారితప్పి, ఖర్చుకు లెక్కలేకుండా పోతోంది. ఎన్నికల్లో పరిమితిని మించి వ్యయం, ఓటర్లను ప్రలోభపెట్టడం వంటివి నిర్ధారించే ఫొటోలు, ఆడియో టేపులు, వీడియో క్లిప్పింగులు ఉన్నా, ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్న దాఖలాలే లేవు. నిబద్దతతో వ్యవహరించే ఉన్నతాధికారులుగా టీ.ఎన్‌‌‌‌‌‌‌‌.శేషన్‌‌‌‌‌‌‌‌, కె.జె.రావు.. అని ఒకటో, రెండో పేర్లు మాత్రమే ఎందుకు వినిపిస్తాయనే ప్రశ్నకు జవాబుండదు. ఉన్న అధికారం నిలుపుకోవడానికో, చేజారిన అధికారం తిరిగి దక్కించుకోవడానికో పార్టీలు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నాయి. పలు వనరుల నుంచి డబ్బు రాబడుతున్నాయి. ఇందుకోసం ఏ గడ్డి అయినా తిని, అడ్డదారులు తొక్కి.. ఎన్నికల ఫలితాలను తమ వైపు తిప్పుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నాయి. దక్షిణాదిలో ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చుల కోసం ఓ ప్రాంతీయ పార్టీకి, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి 450 కోట్ల రూపాయలు చేబదులుగా, 150 కోట్ల రూపాయలు తన వంతు విరాళంగా ఇచ్చారనే చర్చ రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టించింది. ఇంకా ఆశ్చర్యం కలిగించేది.. సాయం అందుకున్న పార్టీ ఎన్నికల్లో గెలిచి, గద్దెనెక్కి ఆరు మాసాలు తిరక్కుండానే చేబదులుతో పాటు విరాళంగా ఇచ్చిన మొత్తాన్ని (అంటే, రూ 600 కోట్లు) సదరు సీఎంకు తిరిగి చెల్లించినట్టు ప్రచారం. ఇలాంటి సహాయాలు ఇరుగుపొరుగు రాష్ట్రాల మధ్య, భావసారూప్యత- రాజకీయ సాన్నిహిత్యం ఉన్న పార్టీల, నేతల మధ్య తరచూ జరుగుతున్నట్టు ప్రచారంలోకి వస్తుంది. ఇలాంటివి ఖండించేవారు లేనట్టే, నిర్ధారించేవారూ ఉండరు! ‘మద్యపానం’, ‘వ్యభిచారం’ లాగే ‘రాజకీయ అవినీతి’ని కూడా ఓ సామాజిక రుగ్మతగా ప్రజలు తేలిక భావనతో చూస్తున్నారు. మొదటి రెంటి లాగా వ్యక్తిగత, కుటుంబ పరమైన నష్టాల్ని కలిగించేది కాకుండా రాజకీయ అవినీతి మొత్తం వ్యవస్థను నాశనం చేస్తుందనే గ్రహింపు పౌరసమాజంలో బలంగా రావటం లేదు.

ప్రజల తీర్పే అంతిమం

అధికారం, అర్థ బలం ఉన్నవారికి ఇక్కడ చట్టం ఎప్పుడూ చుట్టమే! అధ్యక్ష ఎన్నికల సమయంలో అప్రదిష్టపాలు కాకుండా ఉండేందుకు, మాజీ ప్రియురాలు స్టోర్మీ డేనియల్స్‌‌‌‌‌‌‌‌ నోరు మూయించడానికి ఇచ్చిన డబ్బును ఎన్నికల ఖర్చులో చూపెట్టకపోవడం చట్టాన్ని ఉల్లంఘించడమే అని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ట్‌‌‌‌‌‌‌‌ ట్రంప్‌‌‌‌‌‌‌‌ను అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఇలాంటిది మన దేశంలో ఊహించగలమా? ఎన్నికల్లో ఓట్లకోసం ఇచ్చే లంచాన్ని ‘గుర్తించదగ్గ నేరం’ (కాగ్నిజబుల్‌‌‌‌‌‌‌‌ అఫెన్స్‌‌‌‌‌‌‌‌) గా పరిగణించాలన్న ఎన్నికల సంఘం సిఫారసుకు మోక్షం దొరకదు. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాల్లో పారదర్శకత కోసం ‘లా కమిషన్‌‌‌‌‌‌‌‌’ చేసిన సిఫారసులు అమలుకు నోచుకోవు. ‘రాజకీయ అవినీతి’ కట్టడి చేసేలా ఎన్నికల సంస్కరణలు  ప్రతిపాదిస్తే  అడ్డుకోవడంలో ముందుండే మన రాజకీయ పార్టీల్లో తేడాలే ఉండవు. అప్పుడు మాత్రం, అన్నీ ఆ తాను ముక్కలే! రాజకీయ అవినీతిని ఆటకట్టించే వజ్రాయుధం ఓటే! దాన్ని వాడే ఓటర్ పై ఆధారపడి ఉంటుంది. బెంగళూరు శివార్లలోని హస్కోటే నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పు దేశమంతా ఎందుకు ఇవ్వలేదు? 2018 ఎన్నికల తర్వాత ఏర్పడిన జేడీఎస్– కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం నుంచి రాజీనామా చేసి బీజేపీ క్యాంపులో చేరిన15 మంది తిరుగుబాటుదారుల్లో  ఓ కోటీశ్వరుడూ ఉన్నాడు. ఆయన సంపదని నమ్ముకున్న బీజేపీ అప్పటివరకు ఆ నియోజకవర్గంలో ఉన్న వ్యక్తిని కాదని, ఉప ఎన్నికల్లో అతనికి టికెట్ ఇచ్చింది. ఎన్నికల్లో కోట్లు కుమ్మరించిన ఆ కుబేరుడు ఎంటీబీ నాగరాజు, అఫిడవిట్ లో11 వందల కోట్ల ఆస్తులు చూపించాడు. బీజేపీ వెళ్లగొడితే, స్వతంత్ర అభ్యర్థి అయిన శరత్ బాచే గౌడ 11 వేల ఓట్ల మెజారిటీతో నాగరాజును ఓడించాడు. తెలివైన ఈ ప్రజా తీర్పు సంపదతో అన్ని సాధించగలమనుకునే అవినీతి రాజకీయాలకు ఓ పెద్ద చెంపపెట్టు. 

ఆర్థిక అంతరాలకు ఇదే మూలం

ఒకవైపు, మన స్వాతంత్య్రానికి 75 ఏండ్లయిందని ‘ఆజాదీకా అమృత్‌‌‌‌‌‌‌‌ మహోత్సవ్‌‌‌‌‌‌‌‌’ జరుపుకుంటున్నాం. ఇంకో పక్క, సమాజంలో మితిమీరుతున్న ఆర్థిక అసమానతలు, అశాంతికి రాజకీయ అవినీతే కారణమని గ్రహించలేకపోతున్నాం. ఒకింత గ్రహించినా.. విరుగుడుకు గట్టిగా యత్నించడం లేదు. ఎన్నికలప్పుడు తమకు అనుకూలంగా పౌరులు తీర్పు ఇచ్చేట్టు ఖర్చు చేసే మొత్తాలతో అధికారాన్ని చెరబట్టే రాజకీయ వ్యవస్థ దీన్ని స్థిరీకరించే పనిలో పడింది. ఈ క్రమంలో పట్టపగ్గాల్లేని రాజకీయ అవినీతి వల్ల సంపన్నులు మరింత సంపన్నులవుతుంటే, పేదలు కటిక పేదరికంలోకి జారిపోతున్నారు. ఇటీవలి ‘ఆక్స్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌’ నివేదిక ఈ కఠోర సత్యాన్ని కళ్ల ముందుంచింది. 40 శాతం దేశ సంపద అతి సంపన్నులైన1శాతం జనాభా చేతిలో ఉంటే, అడుగునున్న 50 శాతం జనాభా కేవలం 3 శాతం దేశ సంపదతో సరిపెట్టుకుంటోంది. ఇంకో అధ్యయనం ప్రకారం ఈ అడుగునున్న 50 శాతం జనాభాయే 65 శాతం జీఎస్టీ పన్నులు(ప్రతి నెలా సగటున రూ.1.5 లక్షల కోట్లుగా వసూలయ్యే మొత్తంలో) చెల్లిస్తుంటే, 40 శాతం దేశసంపదను అనుభవిస్తున్న ఒక శాతం అతి సంపన్నులు చెల్లించే జీఎస్టీ వాటా 3 శాతమే! విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడం, వ్యాపారాన్ని సరళతరం చేయడం పేరిట, మునుపు 30 శాతంగా ఉన్న కార్పొరేట్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ను 22 శాతానికి తగ్గించారు. దీనివల్ల వచ్చిన నికర తరుగుదల దాదాపు రూ.2 లక్షల కోట్లు! పెద్ద పెద్ద కార్పొరేట్లు, కంపెనీలకు మేలు కలిగేలా సర్కారు రద్దు చేసిన బ్యాంకు రుణ బకాయిలు(నిరర్థక ఆస్తులు-ఎన్పీయే) సుమారు రూ.11 లక్షల కోట్లు. నిరంతర అధికారం- వ్యాపార అధిపత్యం కోసం రాజకీయాలు-కార్పొరేట్లు చేతులు కలిపి అంటకాగుతున్న తీరు, సంపదను పంచుకుంటూ వ్యవస్థను దోచుకుంటున్న వైనం ప్రజాస్వామ్యానికి 
ప్రమాదకరం.

ఈసీ నిరంతర వైఫల్యం

భారత ఎన్నికల సంఘం మహారాష్ట్ర దివంగత మాజీ మంత్రి గోపీనాథ్‌‌‌‌‌‌‌‌ ముండేకు 2013లో నోటీసు ఇచ్చింది. 2009 ఎన్నికల్లో తనకు రూ.8 కోట్లు (రూ.40 లక్షలు పరిమితి) ఖర్చయిందని ఆయనే స్వయంగా వెల్లడించారన్నది అభియోగం. ‘మీడియా తప్పు రాసింది, నేనలా అనలేదు’ అని ఆయన బదులిస్తే ఎన్నికల సంఘం మిన్నకుంది. అదే 2009 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌ ఎంపీ ఒకరు, తాను 54 కోట్లు ఖర్చు పెట్టానని, అది అత్యధికమేమీ కాదని, రాష్ట్రంలోనే మరో ఎంపీ రూ.72 కోట్లు ఖర్చు చేశారు అంటే కూడా ఎన్నికల సంఘం ఏమీ చేయలేకపోయింది. దేశవ్యాప్తంగా 2009 ఎన్నికల వ్యయంతో పోల్చి చూస్తే 2014 ఎన్నికల్లో మూడింతల డబ్బు ఎక్కువ వ్యయమైనట్టు తెలుగువాడైన ఎన్‌‌‌‌‌‌‌‌.భాస్కరరావు నేతృత్వంలో పనిచేసే ‘సెంటర్‌‌‌‌‌‌‌‌ ఫర్‌‌‌‌‌‌‌‌ మీడియా స్టడీస్‌‌‌‌‌‌‌‌- సీఎమ్మెస్‌‌‌‌‌‌‌‌ అధ్యయన నివేదిక తెలిపింది. ‘పక్క మండలంలో ఓటుకు ఆరు వేలు ఇచ్చి, మాకు మాత్రం మూడు వేలే ఇస్తున్నార’ని ఓటర్లు పార్టీ నాయకుల సమక్షంలో, కార్యాలయాల ముందు నిరసన తెలిపినా చర్యలుండటం లేదు.

- దిలీప్‌‌ రెడ్డి, పొలిటికల్‌‌ ఎనలిస్ట్‌‌, 
పీపుల్స్‌‌పల్స్‌‌ రీసెర్చ్‌‌ సంస్థ,