బూస్టర్ డోసు వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవ్ : వైద్యులు

బూస్టర్ డోసు వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవ్ : వైద్యులు

ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నాలుగు బీఎఫ్.7 వేరియంట్ కేసులు నమోదయ్యాయి. జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్, డెన్మార్క్, యూఎస్, యూకే వంటి అనేక దేశాల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. టీకా వేసుకోవడం వల్ల కోవిడ్ సమస్యలను నివారించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

ముఖ్యంగా ఫ్రంట్ లైన్ కార్మికులు, ఆరోగ్య కార్యకర్తలు కోవిడ్ బారిన పడే ప్రమాదం ఉంది. అయితే.. వృద్ధులు, ఊరితిత్తులు సమస్య ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలు లేకున్నా.. అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటివరకు చాలా మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరంతా మరింత సురక్షితంగా ఉండటానికి బూస్టర్ డోసు వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే బూస్టర్ డోసు వేసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని చెబుతున్నారు. 

ముందు జాగ్రత్త కోసమే ఈ డోసు తీసుకోవాలని.. అలాగే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారు కోవిడ్ బారిన పడే అవకాశం తక్కువ అని వైద్యులు వెల్లడించారు. అయితే ప్రతి ఒక్కరూ మాస్క్ ని ఉపయోగించడం, పరిశుభ్రత పాటించడం, సామాజిక సమావేశాలకు దూరంగా ఉండటం, అంతర్జాతీయ ప్రయాణాలకు దూరంగా ఉండటం వంటివి పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక బిఎఫ్.7 వేరియంట్ సోకిన వారిలో జ్వరం, దగ్గు, ముక్కు కారడం, గొంతు చికాకు వంటి లక్షణాలు గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు.