తాజా శ్వాస కోసం ఏం చేయాలంటే...

తాజా శ్వాస కోసం ఏం చేయాలంటే...

తిన్న తర్వాత సరిగా పుక్కిలించకపోడం, నోటిని శుభ్రంగా ఉంచుకోకపోడం, బ్యాక్టీరియా కారణంగా నోటి దుర్వాసన వస్తుంది. దాంతో నలుగురితో మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంటుంది.  నోటి నుంచి చెడు వాసన రావడం అనేది నోటి సమస్యల లక్షణం కూడా కావొచ్చు. అందుకని నోటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. తాజా శ్వాస కోసం ఏం చేయాలో  చెప్తున్నారు న్యూట్రిషనిస్ట్​లు. 

  • గ్రీన్​ టీలోని క్యాటెచిన్ పవర్​ఫుల్ యాంటీ ఆక్సిడెంట్​. ఇది దుర్వాసనకు కారణమయ్యే సల్ఫర్​ కాంపౌండ్స్​ని తగ్గిస్తుంది. అంతేకాదు నోటిలోని బ్యాక్టీరియాను పోగొడుతుంది. 
  • నోటి దుర్వాసన వస్తుంటే నాలుగైదు తులసి ఆకులు నమలాలి. వీటిలోని పాలీఫినాల్స్ చెడు వాసన పోగొట్టి, తాజా శ్వాస వచ్చేలా చేస్తాయి.   
  • అల్లంలో 6‌‌‌‌–జింజరాల్ అనే  ఫినాల్​ ఫైటోకెమికల్ ఉంటుంది. ఇది లాలాజలం ఎంజైమ్​ల ఉత్పత్తిని పెంచుతుంది.  నోటిలోని సల్ఫర్​ అణువుల్ని ముక్కలు చేస్తుంది. నిమ్మరసం కలిపిన వేడినీళ్లలో చిన్న అల్లం ముక్క వేసుకొని తాగితే నోరు శుభ్రంగా ఉంటుంది. 
  • నిమ్మకాయ, ఉసిరి, కమలా పండు వంటి  నిమ్మజాతి పండ్లలో విటమిన్​–సి ఎక్కువ. ఇది నోటిలోని బ్యాక్టీరియాను తొలగిస్తుంది. అలాగే చిగుళ్ల సమస్యల్ని తగ్గిస్తుంది. దాంతో నోరు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
  • పెరుగు తింటే ప్రోబయాటిక్స్​ అందుతాయి. ఇవి నోటిలోని చెడు బ్యాక్టీరియాని తొలగిస్తాయి. అంతేకాకుండా శరీరంలోకి హానికర క్రిములు చేరకుండా చూస్తాయి.