
- రోజువారీ నివేదికలు కోరుతున్న రాష్ట్ర ఇన్చార్జ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్పార్టీ సంస్థాగత బలోపేతం కోసం ఇటీవల నియమించిన పీసీసీ అబ్జర్వర్ల పనితీరుపై రాష్ట్ర ఇన్చార్జ్మీనాక్షి నటరాజన్ దృష్టి సారించారు. ఈ మేరకు ఆమె రోజువారీ నివేదికలు అడుగుతున్నారు. ఎవరు పనిచేస్తున్నారు? ఎవరు పనిచేయడం లేదు? అనే దానిపై ఫోకస్ పెట్టి.. సరిగ్గా పనిచేయని వారికి నేరుగా ఫోన్ చేసి వివరాలు అడుగుతున్నారు. దీంతో అబ్జర్వర్లు తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్తూ పార్టీ క్యాడర్ ను కలిసే పనిలో పడ్డారు.
తెలంగాణలో కాంగ్రెస్ ను గుజరాత్ మోడల్ లో బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న హైకమాండ్.. అందులో భాగంగా గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. పీసీసీ తరఫున ప్రతి జిల్లాకు ఇద్దరు అబ్జర్వర్లను నియమించిన హైకమాండ్.. వారు అందించే నివేదిక ఆధారంగానే గ్రామ, మండల, జిల్లా కమిటీలను పీసీసీ నియమించనుంది.
గత నెల 23 నుంచి ఈ నెల 30 వరకు అబ్జర్వర్లు తమకు కేటాయించిన జిల్లాల్లో పర్యటించి.. గ్రామ, మండల, జిల్లా కమిటీల నియామకానికి సంబంధించి అధ్యక్ష పదవికి ఐదేసి పేర్ల చొప్పున పీసీసీకి పంపించాల్సి ఉంటుంది. 2017 నుంచి పార్టీలో ఉన్న వారిని మాత్రమే ఈ పదవులకు పరిగణనలోకి తీసుకోనుండడంతో.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల అనుచరులకు కొత్త చిక్కువచ్చి పడింది. ఈ నెల 30 లోగా గ్రామ, మండల, జిల్లా కమిటీల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండడంతో.. ఆ దిశగా మీనాక్షి నటరాజన్ అబ్జర్వర్ల పనితీరులో వేగాన్ని పెంచుతున్నారు.
మరో 20 రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో ఈలోపు గ్రామ, మండల, జిల్లా కమిటీల నియామకం పూర్తయ్యేలా ఆమె సీరియస్ గా దృష్టి సారించారు. అయితే, పార్టీని వదిలి మళ్లీ తిరిగి వచ్చి ప్రస్తుతం కాంగ్రెస్ లో చురుగ్గా ఉన్నవారి కోసం ముఖ్య నేతలు సిఫారసు చేస్తున్నారు. దీంతో 2017 నిబంధన ఏ స్థాయిలో అమలుకానుందోననే చర్చ ఇప్పుడు కాంగ్రెస్ లో జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో ఈ నెల 30 లోపు ఈ నియామకాల పూర్తిపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.