కొడుకు అస్థికలు ఏం చేసుకోవాలి?

కొడుకు అస్థికలు ఏం చేసుకోవాలి?
  • లాక్ డౌన్ తో ఢిల్లీలో చిక్కుకున్న బీహార్ వృద్ధ దంపతుల ఆవేదన
  • క్యాన్సర్ తో ట్రీట్ మెంట్ తీసుకుంటూ చనిపోయిన కొడుకు
  • ఎయిమ్స్ ఎదురుగా ఉన్న సబ్ వేలో తలదాచుకున్న వృద్ధులు

 

న్యూఢిల్లీ: ‘లాక్ డౌన్ లో చిక్కుకున్నాం. కొడుకు అస్థికలు తీసుకుని ఏం చేసుకోవాలి?’ అని ఢిల్లీలో వృద్ధ దంపతుల ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్ లోని బాంకా జిల్లాకు చెందిన గొర్రెల కాపరి సర్జూ దాస్ (70), క్యాన్సర్ తో బాధపడుతున్న కొడుకు సంజీవ్ (30) ట్రీట్ మెంట్ కోసం భార్య మీనా దేవి (65)తో కలిసి ఢిల్లీలోని ఎయిమ్స్ కు వచ్చారు. కొన్నాళ్ల ట్రీట్ మెంట్ తర్వాత కొడుకు చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. ఇంతలో లాక్ డౌన్ అనౌన్స్ అయ్యింది. సొంత ఊరికి వెళ్లేందుకు అంబులెన్స్ మాట్లాడితే రూ.50 వేలు అవుతుందని చెప్పడంతో అన్ని డబ్బులు లేక డెడ్ బాడీతో ఎయిమ్స్ ఎదురుగా ఉన్న సబ్ వేలోనే ఉండిపోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి డెడ్ బాడీకి అంత్యక్రియలు నిర్వహించారు. అస్థికలు తీసుకోవాలని పోలీసులు చెబితే.. తమకు ఉండడానికే ప్లేస్ లేదని, అస్థికలు తీసుకుని ఏం చేసుకోవాలని సర్జూ దాస్ వాపోయారు. “మాకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు సంజీవ్ ఎక్కువగా పొగాకు తినేవాడు. దవడకు ఎడమవైపు ట్యూమర్ ఏర్పడింది. దీంతో సంజీవ్ ను భార్య వదిలేసింది. పాట్నా, బెంగళూరులో ట్రీట్ మెంట్ చేయించాం. చివరకు ఢిల్లీ తీసుకొచ్చాం. చిన్న కొడుకు చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు. కొన్నిరోజులుగా సంజీవ్ కండీషన్ సీరియస్ గా ఉంది. భోజనం కూడా మానేశాడు. ఆపరేషన్ చేయాలని డాక్టర్లను అడిగాం. ఇంతలో చనిపోయాడని, బాడీ తీసుకెళ్లాలని డాక్టర్లు చెప్పారు” అని మీనాదేవి అన్నారు. “ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇప్పుడు లేడు. ఏం చేయాలో తెలియడం లేదు. ఊరికి వెళ్లే అవకాశం లేక సబ్ వేలో తలదాచుకున్నాం. దేవుడిపైనే భారం. లాక్ డౌన్ ఎన్నాళ్లయినా కొనసాగని, మాకు తొందరేం లేదు. నా కొడుకు డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలని మాత్రమే అధికారులను అడుగుతున్నా” అని సర్జూ ఆవేదన వ్యక్తం చేశారు.