టెలికం లైసెన్స్ తప్పనిసరి

టెలికం లైసెన్స్ తప్పనిసరి

న్యూఢిల్లీ: ఇప్పటి వరకు ఎటువంటి లైసెన్స్‌‌ పొందకుండానే  మెసేజింగ్‌‌, వీడియో, ఆడియో కాలింగ్ సర్వీస్‌‌లను అందిస్తున్న వాట్సాప్‌‌, జూమ్‌‌, గూగుల్ డుయో వంటి సంస్థలు ఇక నుంచి ఈ సర్వీస్‌‌లు అందించడానికి టెలికం లైసెన్స్‌‌ పొందడం తప్పనిసరి కానుంది. ‘టెలికమ్యూనికేషన్ సర్వీస్‌‌లు, టెలికమ్యూనికేషన్ నెట్‌‌వర్క్‌‌లు అందించాలంటే సంస్థలు లైసెన్స్‌‌లు పొందడం తప్పనిసరి’ అని  టెలికమ్యూనికేషన్ బిల్లు 2022 డ్రాఫ్ట్‌‌ పేపర్లలో ప్రభుత్వం పేర్కొంది. 

ఓటీటీలను కూడా ఈ బిల్లు కిందకు తీసుకురానుంది. టెలికం, ఇంటర్నెట్ ప్రొవైడర్లపై పెనాల్టీ, ఫీజులు తొలగించే ప్రొవిజన్‌‌ను కూడా ఈ బిల్లులో పొందుపరిచింది. అంతేకాకుండా టెలికం కంపెనీలు లేదా ఇంటర్నెట్ సర్వీస్‌‌ ప్రొవైడర్లు తమ లైసెన్స్‌‌ను సరెండర్ చేయాలనుకుంటే రీఫండ్‌‌ పొందే ప్రొవిజన్‌‌ను కూడా ఈ బిల్లులో చేర్చింది. ‘టెలికం బిల్లు 2022 డ్రాఫ్ట్‌‌పై మీ అభిప్రాయాల కోసం చూస్తున్నాం’ అని సోషల్ మీడియాలో ఈ బిల్లు లింక్‌‌ను పోస్ట్ చేస్తూ టెలికం మినిస్టర్ అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. వచ్చే నెల 20 లోపు పబ్లిక్ ఈ బిల్లుపై కామెంట్స్‌‌ చేయొచ్చు.