
ఎల్బీ నగర్, వెలుగు: సీసీ రోడ్డు నిర్మాణంలో తన ఇల్లు కొంత భాగం పోయిందని ఓ మహిళ తన బాధను మంత్రి సబితకు చెప్పగా.. ఆమె వెటకారంగా సమాధానమిచ్చారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని ఉప్పుగడ్డ తండా, మహేశ్వరం గ్రామాల్లో రూ.7 కోట్ల 72 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనుల శంకుస్థాపనతోపాటు, పూర్తయిన రోడ్లను మంత్రి సబిత బుధవారం ప్రారంభించారు. ఉప్పుగడ్డ తండాలో సీసీ రోడ్డును ప్రారంభిస్తుండగా.. మంత్రి దగ్గరికి ఓ మహిళ వచ్చి రోడ్డు నిర్మాణంలో తన ఇల్లు కొంత భాగం పోయిందని, ఆదుకోవాలని కోరింది. మంత్రి స్పందిస్తూ ‘ఈమె పేరు కూడా శిలాఫలకంపై వేసేదుండె’ అంటూ వెటకారంగా మాట్లాడారు. అనంతరం అక్కడున్న మహిళలతో మాట్లాడుతూ ‘మీకు పెన్షన్ ఎవరు ఇస్తున్నారు’ అడగగా.. ‘తెలుగుదేశం పార్టీ’ అని ఓ మహిళ జవాబిచ్చింది. టీఆర్ఎస్ గుర్తు ఏంటని అడిగితే.. చీర గుర్తు అని ఇంకో మహిళ చెప్పింది. పెన్షన్లు కేసీఆర్ ఇస్తున్నారని, టీఆర్ఎస్ది ‘కారు’ గుర్తు అని ఆ మహిళలకు మంత్రి వివరించారు.