పీఈటీ ఫలితాలు ఇంకెప్పుడు?

పీఈటీ ఫలితాలు ఇంకెప్పుడు?

రెండేండ్లయినా ప్రకటించరా?
ప్రగతిభవన్‌‌‌‌ ముట్టడికి
అభ్యర్థుల యత్నం

హైదరాబాద్‌‌‌‌, వెలుగుటీఆర్టీ పీఈటీ ఫలితాల జాప్యాన్ని నిరసిస్తూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. బుధవారం ప్రగతిభవన్‌‌‌‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు రోడ్డుపైనే అడ్డుకున్నారు. దీంతో అభ్యర్థులు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులకు, పీఈటీ అభ్యర్థులకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీసింది. అభ్యర్థులు విజిల్స్‌‌‌‌ ఊదుతూ నిరసన తెలిపారు. పోలీసులు బలవంతంగా అరెస్ట్‌‌‌‌ చేసి, గోషామహల్‌‌‌‌ పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌కు తరలించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ… టీఆర్టీ పీఈటీ నోటిఫికేషన్‌‌‌‌ వచ్చి రెండేండ్లు దాటినా ఫలితాలు ఇప్పటికీ విడుదల చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు.

పీఈటీ నియామకాలు చివరిసారిగా 2012లో జరిగాయని తెలిపారు. కన్న తల్లుల మంగళ సూత్రాలు తాకట్టు పెట్టి కోచింగ్‌‌‌‌ తీసుకొని చదివి పరీక్షలు రాస్తే.. ఇప్పటికీ ఫలితాలు ఇవ్వకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పాత కేసులను సాకుగా చూపించి, టీఎస్‌‌‌‌పీఎస్సీ ఫలితాలు ప్రకటించడం లేదని వాళ్లు మండిపడ్డారు. వందల కేసులున్నా ఎస్జీటీ ఫలితాలు ప్రకటించినప్పుడు ఎలాంటి కేసులు లేని పీఈటీ ఫలితాలను ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. వెంటనే  1:1 జాబితాను ప్రకటించాలని డిమాండ్‌‌‌‌ చేశారు. ఫలితాలిచ్చేంత వరకూ ప్రగతిభవన్‌‌‌‌ను ముట్టడిస్తూనే ఉంటామని వాళ్లు హెచ్చరించారు.

టీచర్స్‌‌‌‌ నేతలను అడ్డుకున్న పోలీసులు

అరెస్టయి గోషామహల్‌‌‌‌ పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌లో ఉన్న పీఈటీ అభ్యర్థులను పరామర్శించేందుకు వెళ్లిన యూఎస్‌‌‌‌పీసీ, జాక్టో నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని లోపలికి అనుమతించలేదు. ఈ సందర్భంగా యూఎస్‌‌‌‌పీసీ స్టీరింగ్‌‌‌‌ కమిటీ సభ్యుడు సీహెచ్‌‌‌‌ రవి, జాక్టో సెక్రటరీ జనరల్‌‌‌‌ ఈ. రఘునందన్‌‌‌‌ మాట్లాడుతూ.. విద్యాశాఖ మంత్రి వెంటనే జోక్యం చేసుకుని, ఫలితాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. అభ్యర్థుల అరెస్ట్‌‌‌‌ను ఖండిస్తున్నామని, వెంటనే వారిని విడుదల చేయాలన్నారు.