బీజేపీ అధికారంలోకి రాగానే.. బీఆర్ఎస్ అవినీతిపై విచారణ : దేవేంద్ర ఫడ్నవీస్​

బీజేపీ అధికారంలోకి రాగానే.. బీఆర్ఎస్ అవినీతిపై విచారణ :  దేవేంద్ర ఫడ్నవీస్​
  • తెలంగాణకు గోదావరి జలాల కోసం సహకరించాం
  • కేసీఆర్​ జైలుకు పోవుడు పక్కా
  • మహారాష్ట్ర డిప్యూటి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​

తొర్రూరు/నర్సంపేట, వెలుగు :  రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ ​అవినీతిపై విచారణ జరిపిస్తామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​ తెలిపారు. మంగళవారం మహబూబాబాద్ ​జిల్లా తొర్రూరులో పాలకుర్తి బీజేపీ అభ్యర్థి లేగా రామ్మోహన్​రెడ్డికి మద్దతుగా నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో మాట్లాడారు. పేరుకు బీఆర్ఎస్​అయినా ఫ్యామిలీ రాష్ట్ర సమితిగా మారిందన్నారు. 2015లో సీఎం కేసీఆర్​.. జలవివాదాల పరిష్కారం కోసం తాను సీఎంగా ఉన్న సమయంలో మహారాష్ట్రకు రాగా ఇక్కడి ప్రజల కోసం సహకరించినట్టు తెలిపారు. కాళేశ్వరం,మేడిగడ్డ ప్రాజెక్టులు నిర్మించినప్పటికీ బీఆర్ఎస్ అవినీతి మూలంగా అవి కూలిపోయే దశకు చేరుకున్నాయన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, నాయకులు చింత సాంబమూర్తి, యాప సీతయ్య, పూసల శ్రీమాన్ పాల్గొన్నారు. వరంగల్ ​జిల్లా నర్సంపేటలో జరిగిన కార్నర్​ మీటింగ్​లో మాట్లాడుతూ ఏనాటికైనా కేసీఆర్​ జైలుకెళ్లడం ఖాయమన్నారు. నర్సంపేటలో కంభంపాటి పుల్లారావు (ప్రతాప్​) ను గెలిపించాల్సిందిగా కోరారు.  ఎడ్ల అశోక్​రెడ్డి, గూడూరు సందీప్​, జూలూరి మనీష్​, నర్సింహారావు, జగన్​ పాల్గొన్నారు.

సకల జనుల సమ్మెతోనే తెలంగాణ వచ్చింది

దేవరకొండ : కాంగ్రెస్, బీఆర్ఎస్​లతో తెలంగాణ ఏర్పాటు కాలేదని, సకల జనుల సమ్మెతోనే వచ్చిందని దేవేంద్ర ఫడ్నవీస్​ అన్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతామని, పెట్రోలు, డీజిల్​పై వ్యాట్​ట్యాక్స్​తగ్గించడంతో పాటు రూ.15 వరకు తక్కువ చేస్తామన్నారు. ఏడాదికి నాలుగు సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్నారు. ఆడపిల్ల పుట్టిన వెంటనే రూ.2 లక్షలు అందజేస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ లీడర్​ చీకోటి ప్రవీణ్, బీజేపీ అభ్యర్ధి కేతావత్​లాలూనాయక్​, ప్రేమేందర్​రెడ్డి, జిల్లా ఇన్​చార్జ్​ ఆర్.ప్రదీప్​కుమార్​, కర్నాటిసురేశ్​, ఏటీ కృష్ణ, అంకూరి నర్సింహ, చెనమోని రాములు, వికాస్​ రాథోడ్, దానం శ్రీనివాస్​, సినీ హీరో సర్ధార్​నాయక్, నక్క వెంకటేశ్​యాదవ్​ పాల్గొన్నారు.