ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు
  • స్థానికుల ఎదురుచూపులు.. గూడ్స్ సేవలపైనే ఆఫీసర్ల దృష్టి

సిద్దిపేట, వెలుగు : ప్యాసింజర్ రైల్వే సేవల కోసం గజ్వేల్ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత జూన్ లో  గజ్వేల్​లో ఏర్పాటు చేసిన రేక్ పాయింట్ కు ఎరువుల తరలించేందుకు గూడ్స్​ రైళ్లు ప్రారంభించినా రైల్వే అధికారులు ప్యాసింజర్ రైళ్లను నడపడంలో జాప్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు తొందరగానే అందుబాటులోకి వస్తాయని స్థానికులు భావించారు. కానీ గజ్వేల్ రైల్వే స్టేషన్ తరువాత ప్రారంభమైన మెదక్ లో ప్యాసింజర్ రైలు సేవలు స్టార్ట్​ అయినా ఇక్కడ రైళ్లు ప్రారంభం కాలేదు.  రైల్వే శాఖకు ఆదాయాన్నిచ్చే  గూడ్స్ సేవలపైనే రైల్వే అధికారులు దృష్టి సారించారని అంటున్నారు.  ప్యాసింజర్ రైళ్లు నడపడానికి కమిషన్ ఆఫ్  రైల్వే సేఫ్టీ  ఆధ్వర్యంలో ఇప్పటికే  రెండు సార్లు తనిఖీలు నిర్వహించడమే కాకుండా ఆమోదాన్ని తెలిపి నెలలు గడుస్తున్నా ప్యాసింజర్ రైళ్ల సేవలు అందుబాటులోకి రాలేదు.

పనులు ఇలా.. 

మనోహరాబాద్–కొత్త పల్లి రైల్వే లైన్ ప్రాజెక్టులో భాగంగా తొలి దశ పనులు పూర్తయ్యాయి.  మొత్తం 150 కిలో మీటర్ల మేర సాగే ఈ ప్రాజెక్టు పనులను రూ.1160 కోట్లతో బ్రాడ్ గేజ్ పనులను నాలుగు దశల్లో పూర్తి చేయడానికి ప్రణాళికను రూపొందించారు. 2017 లో గజ్వేల్ మండలం గిరిపల్లి వద్ద మనోహరాబాద్–కొండకండ్ల వరకు 43 కిలో మీటర్ల మేర రైల్వే లైన్ పనులను ప్రారంభించారు. మనోహరాబాద్ నుంచి ప్రారంభమైన రైల్వే లైన్ లో భాగంగా సిద్దిపేట జిల్లాలోని నాచారం, అప్పాయిపల్లి, గజ్వేల్ లో  రైల్వే స్టేషన్లు పూర్తి చేయడమే కాకుండా కొడకండ్ల వరకు రైల్వే ట్రాక్  పనులను పూర్తి చేసి ట్రయల్ రన్ ను నిర్వహించారు. రెండో దశలో కొడకండ్ల నుంచి సిద్దిపేట వరకు రైల్వే లైన్ పనులు సాగుతుండగా కుకునూరు పల్లి వద్ద కొంత మేర మినహా  దుద్దెడ వరకు ట్రాక్ పనులు పూర్తయ్యాయి. ఈ రైల్వే లైన్ కంప్లీట్​అయితే ఉత్తర తెలంగాణకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఈ నేపథ్యంలో త్వరగా అందుబాటులోకి తెచ్చేలా చూడాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. 

త్వరలోనే ప్యాసింజర్ రైలు

గజ్వేల్ కు త్వరలోనే ప్యాసింజర్ రైలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పంపిన ప్రతిపాదనలను ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. కాచిగూడ, సికింద్రాబాద్  మీదుగా గజ్వేల్, కొడకండ్ల వరకు ప్యాసింజర్ రైలు నడిచే అవకాశం ఉంది. కొత్త రైల్వే స్టేషన్ కావడంతో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ప్యాసింజర్ సేవలు ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం.  - జనార్దన్​, రైల్వే ఇంజనీర్

ఉచితాలు వద్దంటున్న బీజేపీ మనకెందుకు? 

మంత్రి హరీశ్ రావు

జహీరాబాద్, వెలుగు : ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ టీఆర్​ఎస్​ ప్రభుత్వం పేద ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని,  అలాంటప్పుడు ఉచితాలు వద్దంటున్న డబుల్​ ఇంజిన్​ బీజేపీ సర్కారు మనకెందుకని మంత్రి హరీశ్​రావు అన్నారు. శనివారం ఆయన జహీరాబాద్ లో మైనార్టీ జూనియర్ కళాశాల భవనాన్ని, మొగుడంపల్లిలోఎస్పీ కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్డు , రైతు వేదిక, గిరిజన బాలికల రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్, తదితర పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మొగుడం పల్లి లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. రైతు రుణ మాఫీ, రైతు బంధు, ఉచిత బీమా, ఉచిత రేషన్, విద్యార్థులకు స్కాలర్ షిప్పులు ఇవ్వకుండా బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో ఇస్తున్న సంక్షేమ పథకాలను బీజేపీ అధికారంలో ఉన్న కర్నాటకలో ఇస్తున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న గీతారెడ్డి జహీరాబాద్​ నియోజకవర్గ ప్రజలకు తాగేందుకు నీరు కూడా ఇవ్వలేకపోయారన్నారు. సభలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు, కలెక్టర్ శరత్, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్ పాల్గొన్నారు.
‘డబుల్’ ఇండ్లను పంపిణీకి రెడీ చేయండి
సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

సిద్దిపేట రూరల్, వెలుగు : చింతమడక, మాచాపూర్, సీతారాంపల్లి గ్రామాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి పంపిణీకి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్  అధికారులకు సూచించారు. శనివారం కలెక్టర్ ఆఫీస్ లో సిద్దిపేట రూరల్ మండలంలోని మూడు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టూబీహెచ్ కే నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులు, ఈడబ్ల్యూఐడీసీ, పంచాయతీ రాజ్ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందించేందుకు కావాల్సిన మౌలిక వసతులు త్వరగా కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో అనంతరెడ్డి, ఎమ్మార్వో శ్రీనివాసరావు, నిర్మాణ ఏజెన్సీ అధికారి బాపినీడు, ఈడబ్ల్యూఐడీసీ ఇంజనీర్లు పాల్గొన్నారు.

బతుకమ్మ చీరలు పంపిణీ

మెదక్​ టౌన్, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరూ బతుకమ్మ పండగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మహిళలకు చీరలను పంపిణీ చేస్తోందని సీఎం కేసీఆర్​ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్​రెడ్డి అన్నారు. శనివారం హవేలీఘనపూర్​ మండలంలోని ఫరీద్​పూర్​లో సర్పంచ్​ సౌందర్య ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రాజు, సర్పంచ్​లు దేవాగౌడ్, మహిపాల్​రెడ్డి, శ్రీనునాయక్​, నాయకులు వినోద్ కుమార్,  బ్రహ్మం, వెంకటి, డేవిడ్​ పాల్గొన్నారు. 

కంది, వెలుగు :  సంగారెడ్డి జిల్లా కేంద్రం మున్సిపాలిటీలో వివిధ వార్డుల్లో తెలంగాణా హ్యాండ్లూమ్​ డెవలప్​మెంట్​ చైర్మన్​, సంగారెడ్డి టీఆర్​ఎస్​ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్​ బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.  కార్యక్రమంలో మున్సిపల్​ చైర్​ పర్సన్​ విజయలక్ష్మి, వైస్​ చైర్​ పర్సన్​ లతా విజయేందర్​రెడ్డి, కమిషనర్​ చంద్రశేఖర్, వార్డు కౌన్సిలర్లు రామప్ప, శ్రీకాంత్​పాల్గొన్నారు. 

పోషకాహారంతో రక్తహీనత దూరం 

రాష్ట్ర మహిళ కమిషన్ చైర్​ పర్సన్ సునీతారెడ్డి 

మెదక్​(చిలప్ చెడ్), వెలుగు :  మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటోందని, పోషకాహారం తీసుకుంటే ఈ సమస్యను అధిగమించవచ్చని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతారెడ్డి సూచించారు. శనివారం చిలప్​చెడ్​ మండలం జగ్గంపేట్, గంగారం, అజ్జమర్రి, బండ పోతుగల్, ఫైజాబాద్, చిట్కుల్, చిలప్ చెడ్ గ్రామాలలో ఆసరా పింఛన్​ స్మార్ట్ కార్డులు, బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోషకాహార మహోత్సవాల సందర్భంగా ఫైజాబాద్, చిట్కుల్, చిలప్ చెడ్ లో ఆకుకూరలు, పప్పులు, వివిధ రకాల ఆకుకూరలతో ఏర్పాటు చేసిన బతుకమ్మను తిలకించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 65 శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారన్నారు. గర్భిణులలో 51 శాతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని చెప్పారు. మహిళలు ఆకుకూరలు తినాలని సూచించారు. పుట్టిన పిల్లలకు వెంటనే  ముర్రుపాలు తాగిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ వినోద దుర్గారెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు లక్ష్మీ దుర్గారెడ్డి, నర్సాపూర్ ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అశోక్ రెడ్డి  పాల్గొన్నారు.

స్కూల్​ గ్రౌండ్​లో క్రీడా ప్రాంగణమేంటి?

కోహెడ, వెలుగు:  క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ర్ట ప్రభుత్వం ప్రతి గ్రామంలో రెండు ఎకరాల స్థలంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని ఆదేశిస్తే స్కూల్​లో ఉన్న కొద్దిపాటి స్థలంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని బీజేపీ మండల అధ్యక్షుడు ఖమ్మం వెంకటేశం, ఎంపీటీసీ ఖమ్మం స్వరూప  ప్రశ్నించారు. శనివారం కోహెడలో వారు మీడియాతో మాట్లాడారు. మండల కేంద్రంలో ప్రభుత్వ స్థలం ఉన్నా అక్కడ క్రీడా ప్రాంగణం ఎందుకు ఏర్పాటు చేయడం లేదని నిలదీశారు. అక్కడ ప్రభుత్వ భూమి ఉందా? లేక కబ్జాకు గురైందా అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు.

అధికారుల నిర్లక్ష్యం వల్లనే కరెంట్​ ప్రమాదాలు

విద్యుత్​ ఆఫీసర్ల తీరుపై సర్పంచుల ఆగ్రహం

మెదక్​ (శివ్వంపేట), వెలుగు : విద్యుత్​ ప్రమాదాలు జరుగుతున్న సంబంధిత ఆఫీసర్లు పట్టించుకోడం లేదని, వారి నిర్లక్ష్యంతోనే ఎక్కువ ఘటనలు జరుగుతున్నాయని ఆయా గ్రామాల సర్పంచులు అసహనం వ్యక్తం చేశారు. శనివారం ఎంపీపీ హరికృష్ణ అధ్యక్షతన శివ్వంపేట మండల జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తిమ్మాపూర్ సర్పంచి అనూష మాట్లాడుతూ గ్రామంలో కరెంట్ షాక్ తగిలి రైతు గాయాలపాలయ్యాడని విద్యుత్ ఏఈకి  ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని మండిపడ్డారు. గ్రామంలో ప్రభుత్వ భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని కొంతనపల్లి సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.

క్రీడాప్రాంగణం కోసం సొంత డబ్బులు పెట్టి మెటీరియల్ తీసుకొస్తే బిల్లు రికార్డు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్లాపూర్, తుక్యా తండాలకు నాలుగేళ్లుగా మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదని ఆయా గ్రామాల సర్పంచ్​లు మండిపడ్డారు. అగ్రికల్చర్ ఏవో మీటింగ్ కు హాజరు కాకపోవడంతో వెంటనే షోకాజ్ నోటీసు జారీచేసి కలెక్టర్ కు ఫిర్యాదు చేయాలని ఎంపీపీ ఆదేశించారు. ఏ శాఖ ఆఫీసర్లు మీటింగ్​ కు రాకున్నా వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. లింగోజిగూడ సర్పంచ్ శ్మశాన వాటిక నిధులు ఉన్నా నిర్మించడం లేదని, అభివృద్ధి పనులకు సహకరించడం లేదని, ఇక్కడి నుంచి వెళ్లిపోతానని పీఆర్​ ఏఈ  భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు.

వసతుల కల్పనలో అలసత్వం వద్దు 

స్కూళ్లను తనిఖీ చేసిన ఎమ్మెల్యే రఘునందన్​రావు

దుబ్బాక, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంలో అలసత్వం వహించొద్దని టీచర్లకు, అధికారులకు ఎమ్మెల్యే రఘునందన్​రావు సూచించారు. శనివారం దుబ్బాక మండలం గంభీర్​పూర్​, దుబ్బాక పట్టణ పరిధిలోని చెల్లాపూర్​ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు.

విద్యార్థుల సమస్యలపై ఆరా తీశారు. పాఠశాలకొచ్చే ప్రతి విద్యార్థిపై దృష్టి పెట్టాలని టీచర్లకు సూచించారు. క్రమశిక్షణ, పట్టుదల, ఇష్టంతో చదవితేనే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని విద్యార్థులకు  చెప్పారు. కార్యక్రమంలో కౌన్సిలర్​ మట్ట మల్లారెడ్డి, బీజేపీ నాయకులు అంబటి బాలేశ్​గౌడ్, సుంకోజి ప్రవీణ్, దూలం వెంకటేశ్, కొండి ఎల్లారెడ్డి, మరాటి బాబు తదితరులు పాల్గొన్నారు. 

బతుకమ్మ ఉత్సవాలు విజయవంతం చేయాలి

మెదక్​ కలెక్టర్​ హరీశ్​

మెదక్​ టౌన్, వెలుగు :   ఈనెల 25 వ నుంచి అక్టోబర్ 3 వరకు కలెక్టరేట్ ఆవరణలో  నిర్వహించే బతుకమ్మ ఉత్సవాల్లో  అధికారులు, మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని  కలెక్టర్ హరీశ్​ శనివారం ఒక ప్రకటనలో కోరారు. రోజుకో కార్యక్రమం చొప్పున నిర్వహించేందుకు అధికారులకు విధులు కేటాయించామని తెలిపారు. అధికారులు సమన్వయం చేసుకుంటూ ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు.
గ్రామాల్లో జోరుగా అభివృద్ధి 

ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి 

నారాయణ్ ఖేడ్, వెలుగు : నారాయణఖేడ్ మండల పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు అద్భుతంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని రుద్రారం, పైడిపల్లి, అంత్వార్, పంచగామ, సత్య గామ, మైలారం, జూకల్ గ్రామాలలో రూ.20 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. పలు గ్రామాల్లో మన ఊరు మన బడి పనులు ప్రారంభించారు. ఆసరా పెన్షన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఆయన వెంట మండల అధ్యక్షుడు పరమేశ్, జడ్పీటీసీ లక్ష్మీ బాయి రవీందర్, ఎంపీడీవో వెంకటేశ్వర రెడ్డి,  నాయకులు ఉన్నారు. 

కొనసాగుతున్న నవోదయ అథ్లెటిక్​ మీట్​ 

గజ్వేల్, వెలుగు : సిద్దిపేట జిల్లా మండల కేంద్రం వర్గల్​లో జరుగుతున్న దక్షిణ భారత స్థాయి నవోదయ విద్యాలయ సమితి రీజనల్​అథ్లెటిక్​ మీట్​శనివారం కూడా కొనసాగింది.  రెండవ రోజు బాలికలకు మూడు కిలోమీటర్ల ఓపెన్ కాగ్రెస్ కంట్రీ రన్నింగ్ ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి హర్డిల్స్, షాట్ పుట్, డిస్కస్, ట్రిపుల్ జంప్, హైజంప్, లాంగ్ జంప్, హామర్ తో, జావెలిన్ తో పోటీలు అండర్-14, 17, 19 క్యాటగిరీలలో పోటీలో జరిగాయి. ఆదివారం ముగింపు సంబురాలకు స్థానిక విద్యాలయ ప్రిన్సిపాల్​ రమేశ్​రావు, పీఈటీ మోహన్​రావు  ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని  వెలికి తీసేందుకే ప్రాంగణాలు

కోహెడ, వెలుగు:  గ్రామీణ ప్రాంత యువతీ, యువకుల్లో క్రీడా నైపున్యాన్ని వెలికి తీసేందుకే ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తోందని సింగిల్​విండో చైర్మన్​ పేర్యాల దేవేందర్​రావు తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని హైస్కూల్​లో క్రీడా ప్రాంగణం కోసం సర్పంచ్​ పేర్యాల నవ్యతో కలిసి ఆయన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడా ప్రాంగణం పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అనంతరం ఎన్టీఆర్​ కాలనీలోని ప్రైమరీ స్కూల్​లో బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు. ఆయన వెంట సీనియర్​ ఫాకల్టీ మొయినొద్దీన్, మండల పరిషత్​ సూపరింటెండెంట్​రాఘవేందర్​ రెడ్డి, ప్రిన్సిపాల్ ​రవీందర్​రెడ్డి, హెడ్మాస్టర్​ ప్రభాకర్​రెడ్డి ఉన్నారు. 

కలెక్టరేట్ల ఎదుట సీపీఎం ధర్నా

మెదక్​ టౌన్/సంగారెడ్డి టౌన్, వెలుగు :  కేంద్రంలోని బీజేపీ  ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ నిరుపేదలపై భారాన్ని మోపుతోందని  సీపీఎం మెదక్​ జిల్లా సెక్రెటరీ మల్లేశం, సంగారెడ్డి జిల్లా కార్యదర్శి జయరాజ్​ అన్నారు. ఈ విషయమై వారు పార్టీ నాయకులు, కార్యకర్తలో కలిసి శనివారం ఆయా కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వమించారు. ఆఫీసర్లకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలను కేంద్ర ప్రభుత్వం అదుపు చేయాలని, పేదలపై జీఎస్టీ భారాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.