పరీక్షలు దగ్గరపడ్తున్న టైంలో ముగ్గురు పెద్దాఫీసర్లు లేక అయోమయం

పరీక్షలు దగ్గరపడ్తున్న టైంలో ముగ్గురు పెద్దాఫీసర్లు లేక అయోమయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియెట్ బోర్డును గాలికి వదిలేసింది. గతంలో పరీక్షా ఫలితాల్లో తప్పులొచ్చి 27 మంది స్టూడెంట్లు చనిపోయినా.. ఆ ఘటన నుంచి కనీసం గుణపాఠం నేర్చుకోలేదు. వచ్చే ఏడాది మార్చిలో పబ్లిక్‌‌ పరీక్షలున్నా, వాటి ఏర్పాట్లపైనా పెద్దగా దృష్టిపెట్టలేదు. ఎగ్జామ్ ఫీజు గడువును కూడా పెంచకుండా, ఫైన్లతో కట్టుకోవాలంటూ ఆదేశాలిచ్చింది. మరోపక్క మిక్స్​డ్​ ఆక్యుపెన్సీ బిల్డింగ్​లలోని కాలేజీల్లో చదువుతున్న వేలాది మంది విద్యార్థుల భవిష్యత్ పైనా అయోమయం నెలకొన్నది. ఇలాంటి సమయంలో బోర్డులో ఉండి వ్యవహారాలు చూడాల్సిన కీలకమైన అధికారులు లేకపోవడంతో కిందిస్థాయి అధికారుల్లోనూ ఆందోళన మొదలైంది. కాగా గురువారం రూ. 100 ఫైన్​తో ఈ నెల 12 వరకూ ఫీజు చెల్లింపు గడువు పెంచారు.

గుజరాత్ ఎన్నికల డ్యూటీకి నవీన్ మిట్టల్ 

ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ అక్టోబర్30న రిటైర్ కావడంతో ఇన్ చార్జ్ బాధ్యతలను కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ కు అప్పగించారు. ఆయన గత నెల రెండోవారంలో గుజరాత్ ఎన్నికల విధులకు వెళ్లారు. ఆ తర్వాతి మూడు రోజులకే ఇంటర్ ఎగ్జామ్స్ కంట్రోలర్ అబ్దుల్ ఖలీక్ చనిపోయారు. ఇలాంటి టైమ్​లో సెక్రటరీగా వేరే ఐఏఎస్​కు ఇన్​చార్జిగానో లేక పూర్తిస్థాయిలోనో బాధ్యతలు సర్కారు అప్పగించాలి. కానీ ఆ పని చేయలేదు. మరోపక్క ఎగ్జామినేషన్ కంట్రోలర్ బాధ్యతలనూ ఎవ్వరికీ ఇవ్వలేదు. దీంతో ఎగ్జామినేషన్స్ వర్క్ పై ప్రభావం పడుతోందని అధికారులు చెప్తున్నారు. కీలకమైన ఆఫీసర్లు లేకపోవడంతో పరీక్ష ఫీజు గడువు పెంచాలనే ఆలోచన కూడా ఎవ్వరూ చేయలేదని, దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని లెక్చరర్లు అంటున్నారు. మరోపక్క అడ్మిషన్లలో కీలకమైన ఓ అధికారిని సైతం రీపాట్రియేట్ చేసి, కొత్త వారిని నియమించారు.