మారుతి మళ్లీ పరిగెత్తేదెప్పుడు..?

మారుతి మళ్లీ పరిగెత్తేదెప్పుడు..?

మరోసారి అమ్మకాలు 34 శాతం క్రాష్

ఈ బాటలోనే.. మెజారిటీ ఆటో కంపెనీలు

ముంబై : దేశంలోనే అతిపెద్ద కారు తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా(ఎంఎస్‌‌‌‌ఐ)కి గత కొన్ని నెలలుగా తీవ్ర నిరాశ ఎదురవుతోంది. విక్రయాలు విపరీతంగా తగ్గిపోతున్నాయి. జూలై నెలలో కూడా మారుతీ అమ్మకాలు ఏకంగా 33.5 శాతం తగ్గి 1,09,264 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇలా అమ్మకాలు భారీగా పడటం గత 20 ఏళ్లలో ఇదే తొలిసారి. ఆర్థిక మందగమనం, వెనువెంటనే రుణాలు లభించకుండా ఆర్థిక సంస్థలు నిబంధనలను కఠినతరం చేయడం వంటివి ఈ కారు తయారీ కంపెనీని భారీగా దెబ్బకొడుతున్నాయి. గతేడాది ఇదే నెలలో  మొత్తం 1,64,369 కార్లను అమ్మినట్టు మారుతీ సుజుకి తన ప్రకటనలో పేర్కొంది. దేశీయ  విక్రయాలు అయితే ఏకంగా 36.3 శాతం కుదేలై 98,210 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో ఇవి 1,54,150 యూనిట్లుగా ఉండేవి. మినీ కార్లు ఆల్టో, వాగన్ ఆర్‌‌‌‌‌‌‌‌ అమ్మకాలు 11,577 యూనిట్లుగా ఉన్నాయి.

వీటి అమ్మకాలైతే  గతేడాదితో పోలిస్తే ఏకంగా 69.3 శాతం తగ్గిపోయాయి. కొత్త వాగన్ ఆర్‌‌‌‌‌‌‌‌, సిఫ్ట్, సెలిరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైన్ వంటి కాంపాక్ట్ సెగ్మెంట్ మోడల్స్ అమ్మకాలు 22.7 శాతం తగ్గిపోయి 57,512 యూనిట్లుగా రికార్డయ్యాయి. మిడ్ సైజ్ సెడాన్ సియాజ్ 2,397 యూనిట్లు అమ్ముడుపోయింది.  యుటిలిటీ వెహికిల్స్ విటారా బ్రెజా, ఎస్‌‌‌‌ క్రాస్, ఎర్టిగా వాహన విక్రయాలు 38.1 శాతం తగ్గిపోయి 15,178 యూనిట్లుగా ఉన్నట్టు మారుతీ సుజుకి తెలిపింది. ఇవి గతేడాది 24,505 యూనిట్లు అమ్ముడుపోయినట్టు పేర్కొంది. జూలైలో ఈ కారు తయారీదారు ఎగుమతులు కూడా 9.4 శాతం తగ్గి 9,258 యూనిట్లుగా నమోదయ్యాయి.

మారుతీ సుజుకి విక్రయాలు మాత్రమే కాక, అశోక్ లేల్యాండ్, హ్యుండై, మహింద్రా, ఎస్కార్ట్స్, బజాజ్ ఆటో వంటి కంపెనీల ఆటో అమ్మకాలు తగ్గిపోయాయి. హ్యుండై మోటార్ విక్రయాలు 3.8 శాతం తగ్గి 57,310 యూనిట్లుగా నమోదు కాగా, మహింద్రా అమ్మకాలు 15 శాతం పడిపోయి 40,142 యూనిట్లుగా ఉన్నాయి. హిందూజా గ్రూప్‌‌‌‌కు చెందిన అశోక్ లేల్యాండ్ విక్రయాలు 28 శాతం తగ్గుదలను నమోదు చేశాయి. జూలైలో అమ్మకాలు 10,927 యూనిట్లుగా ఉన్నాయి. మొత్తం ఆటో సెక్టార్ కుదేలై ఉన్న నేపథ్యంలో, కేవలం ఎంజీ మోటార్ మాత్రం తాను కొత్తగా తీసుకొచ్చిన ఎస్‌‌‌‌యూవీ హెక్టార్‌‌‌‌‌‌‌‌ కార్లను ఈ జూలైలో 1,508 యూనిట్లను అమ్మింది. దీనికి 28 వేల వరకు బుకింగ్స్‌‌‌‌ నమోదయ్యాయి. భారీగా డిమాండ్ రావడంతో ప్రస్తుతం ఎంజీ మోటార్ దీని బుకింగ్స్‌‌‌‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. రిటైల్ ఆటోమొబైల్‌‌‌‌ సేల్స్ కూడా వరుసగా ఎనిమిదో నెల పడిపోయాయి. బలహీనమైన రుతుపవనాలు, ఫైనాన్సింగ్ కఠినం కావడం ఆటో సేల్స్‌‌‌‌ను దెబ్బకొడుతున్నాయి.