పీఆర్సీ, డీఏ, లోన్లు ఇంకెప్పుడిస్తరు? : ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ను ప్రశ్నించిన కార్మికులు    

పీఆర్సీ, డీఏ, లోన్లు ఇంకెప్పుడిస్తరు? : ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ను ప్రశ్నించిన కార్మికులు    
  • ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ను ప్రశ్నించిన కార్మికులు    
  • ఆర్టీసీ కళాభవన్​లో స్టేట్ వెల్ఫేర్ కమిటీ మీటింగ్

హైదరాబాద్, వెలుగు: పెండింగ్​లో ఉన్న రెండు పీఆర్సీలు, రెండు డీఏలు వెంటనే ఇవ్వాలని ఆర్టీసీ కార్మికులు ఎండీ సజ్జనార్​ను కోరారు. సీసీఎస్ లోన్లు కూడా ఇవ్వట్లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జీతాలకు సంబంధించిన బాండ్లు క్లియర్ చేయలేదని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆర్టీసీ కళాభవన్​లో జరిగిన ఆర్టీసీ స్టేట్ వెల్ఫేర్ కమిటీ మీటింగ్​కు అన్ని డిపోలు, వర్క్​షాప్​ల నుంచి 200 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న సజ్జనార్​కు వారంతా సమస్యలు వివరించారు. యూనియన్ల రద్దు తర్వాత మేనేజ్  మెంట్ ఒక్కో డిపోకు ఇద్దరు చొప్పున వేల్పేర్ కమిటీ ప్రతినిధులను నియమించింది. మూడేండ్ల తర్వాత తొలిసారి ఈ కమిటీ మీటింగ్​ను నిర్వహించారు.

వచ్చే నెల జీతంలో డీఏ చెల్లిస్తం: సజ్జనార్

పీఆర్సీ, డీఏలు, లోన్లు తదితర సమస్యలన్నీ ప్రభుత్వం, ఆర్టీసీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లామని, త్వరలో పరిష్కరిస్తామని సజ్జనార్​ కార్మికులకు వివరించారు. పెండింగ్​లో ఉన్న ఒక డీఏను వచ్చే నెల జీతంతో చెల్లిస్తామని చెప్పారు. త్వరలోనే ప్రయాణికులకు స్మార్ట్‌‌‌‌‌‌‌‌ కార్డు సదుపాయాన్ని కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా వెల్ఫేర్ కమిటీలో 3 జోన్ల నుంచి రీజియ‌‌‌‌‌‌‌‌న్​కు ఇద్దరి చొప్పున మొత్తం 22 మంది స‌‌‌‌‌‌‌‌భ్యుల‌‌‌‌‌‌‌‌ను అధికారులు సన్మానించారు. ప్యాసింజర్లు పోగొట్టుకున్న వస్తువులను వారికి చేర్చడం, జర్నీలో హెల్త్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్యాసింజర్లను ఆస్పత్రికి చేర్పించడం వంటి సేవలందించిన 12 మంది డ్రైవర్లు, కండక్టర్లు, ఏడీసీలను సజ్జనార్​ సత్కరించారు. 

పీఆర్సీపై సీఎంతో మాట్లాడ్త: చైర్మన్ బాజిరెడ్డి

పీఆర్సీ, యూనియన్ల పునరుద్ధరణపై సీఎం కేసీఆర్​తో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకునేలా చొరవ చూపుతానని చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆర్టీసీ టీఎంయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏఆర్ రెడ్డి, థామస్ రెడ్డి, కమలాకర్ గౌడ్.. చైర్మన్ ను బుధవారం కలిసి సమస్యలపై వినతిపత్రం అందచేశారు.

స్లీపర్ బస్సులు ప్రారంభం

శేరిలింగంపల్లి, వెలుగు: లహరి పేరుతో ఆర్టీసీ నాన్ ఏసీ స్లీపర్ బస్సులను లాంచ్ చేసింది. బుధవారం హైదరాబాద్​లోని కేపీహెచ్​బీ బస్టాప్ లో 10 బస్సులను చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, ఎండీ సజ్జనార్ జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. వీటిని హైదరాబాద్ నుంచి కాకినాడ, విజయవాడలకు అద్దె ప్రాతిపదికన నడపనున్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని సీఎం కేసీఆర్ లాభాల్లోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారని గాంధీ అన్నారు. ఆర్టీసీ అంటేనే సేఫ్ జర్నీ అని ఆయన గుర్తు చేశారు. తొలిసారిగా స్లీపర్ బస్సులను ప్రారంభించటం మంచి పరిణామమన్నారు.