జేఎల్ రిజల్ట్స్ ఎప్పుడు?.. కాల్ సెంటర్ కు ఫోన్ చేసినా నో రెస్పాన్స్

జేఎల్ రిజల్ట్స్ ఎప్పుడు?.. కాల్ సెంటర్ కు ఫోన్ చేసినా నో రెస్పాన్స్
  •     ఎగ్జామ్ జరిగి ఐదున్నర నెలలు 
  •     ఇప్పటికీ ఫైనల్ కీ ఇవ్వని టీఎస్​పీఎస్సీ  
  •     అభ్యర్థులకు తప్పని ఎదురుచూపులు 
  •     కాల్ సెంటర్ కు ఫోన్ చేసినా నో రెస్పాన్స్
  •     ఫలితాలు త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: టీఎస్​పీఎస్సీ నిర్వహించిన పలు పరీక్షల రిక్రూట్మెంట్  ప్రక్రియ వేగవంతం అవుతున్నది. ఇప్పటికే దాదాపుగా అన్ని పరీక్షల ఫలితాలు ప్రకటించారు. కానీ, ఐదున్నర నెలల క్రితం నిర్వహించిన జూనియర్   లెక్చరర్  పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలు మాత్రం ఇంత వరకూ విడుదల చేయలేదు. కనీసం ఫైనల్ కీ కూడా రిలీజ్  చేయలేదు. దీంతో పరీక్ష రాసిన అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. రాష్ట్రంలోని సర్కారు జూనియర్  కాలేజీల్లో ఖాళీగా ఉన్న 1,392 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ లో టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్  జారీ చేసింది. వాటిలో మల్టీ జోన్ 1లో 724 పోస్టులు, మల్టీజోన్ 2లో 668 పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టుల భర్తీ కోసం నిరుడు సెప్టెంబర్  12 నుంచి అక్టోబర్ 3 వరకూ ఆన్​లైన్​లో పరీక్షలు నిర్వహించారు. తర్వాత వారం రోజులకు ప్రిలిమినరీ కీ రిలీజ్  చేశారు. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. 

అయితే, ఇప్పటి వరకూ ఫైనల్  కీ గానీ, ఫలితాలను గానీ టీఎస్​పీఎస్సీ విడుదల చేయలేదు. నెల రోజుల క్రితం సర్కారు కొత్త కమిషన్​ను నియమించింది. ఆగిపోయిన వివిధ రిక్రూట్మెంట్  ప్రక్రియలను కమిషన్  పూర్తిచేస్తోంది. కానీ, జేఎల్ పోస్టుల అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. టీఎస్​పీఎస్సీ కి కాల్  చేసినా సమాధానం రావడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. ఇప్పటికే గురుకుల రిక్రూట్మెంట్  బోర్డు పలు పోస్టుల ఫలితాలు రిలీజ్  చేసింది. గురుకులాల్లో పోస్టులు పొందిన కొందరు అభ్యర్థులకు జేఎల్ పోస్టులు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే, టీఎస్​పీఎస్సీ జేఎల్  ఫలితాలు ప్రకటిస్తేనే.. ఏ పోస్టును వదులుకోవాలనే అంశంపై ఆ అభ్యర్థులకు స్పష్టత వస్తుంది. అందుకే టీఎస్ పీఎస్సీ అధికారులు ఇప్పటికైనా ఫైనల్ కీతో పాటు ఫలితాలు ప్రకటించాలని పరీక్ష రాసిన అభ్యర్థులు కోరుతున్నారు.