కివీస్‌ను ఆలౌట్ చేసేందుకు టైమ్ లేదు

కివీస్‌ను ఆలౌట్ చేసేందుకు టైమ్ లేదు

సౌతాంప్టన్: దేశం తరఫున ఆడటాన్ని గొప్పగా భావిస్తానని టీమిండియా ఏస్ పేసర్ మహ్మద్ షమి అన్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో పదునైన బంతులతో షమి ఆకట్టుకుంటున్నాడు. దూకుడైన పేస్, అద్భుతమైన స్వింగ్‌తో కివీస్ బ్యాట్స్‌మెన్‌కు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన షమి.. రెండో ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఈ సందర్భంగా షమి మాట్లాడుతూ దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని అద‌ృష్టంగా భావిస్తానని చెప్పాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రాణించడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. 

‘నాపై అంచనాలు పెరిగిన ప్రతిసారి వాటిని అందుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తా. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కెప్టెన్ నా నుంచి ఏం కోరుకుంటాడో అది ఇవ్వడానికే యత్నిస్తా. సారథి నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే నా విధి. అతడి సూచనలను పాటిస్తా. వికెట్ల కోసం యత్నిస్తూ అటాకింగ్ బౌలింగ్ చేయడమే టీమ్‌లో నా రోల్. ఈ మ్యాచ్ విషయానికొస్తే.. రెండో ఇన్నింగ్స్‌లో సాధ్యమైనన్ని ఎక్కువ రన్స్ చేయడం పైనే దృష్టి సారిస్తాం. ఆ తర్వాత కివీస్‌ను ఆలౌట్ చేయడంపై ఫోకస్ పెడతాం. అయితే అందుకు ఎక్కువ టైమ్ లేదు. 10 వికెట్లు తీసేందుకు, ప్లాన్స్ రెడీ చేసుకునేందుకు చాలా సమయం కావాలి’ అని షమీ పేర్కొన్నాడు.