బడిబాటలో చేరిన 14 వేల మంది ఎక్కడ ?

బడిబాటలో చేరిన 14 వేల మంది ఎక్కడ ?
  • ఏడాదిలో 10 వేల మంది ప్రైవేట్​ స్కూళ్లకు 
  • కొవిడ్  సమయంలో ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు
  • మళ్లీ ప్రైవేట్  బడులకు పోతున్న విద్యార్థులు 

ఖమ్మం, వెలుగు: జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లలో స్టూడెంట్స్​ సంఖ్య తగ్గుతోంది. కొవిడ్ సమయంలో స్టూడెంట్స్ ను ప్రైవేట్ స్కూళ్ల నుంచి తీసుకువచ్చి ప్రభుత్వ బడుల్లో చేర్చిన పేరెంట్స్, మళ్లీ ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. రెండేళ్ల క్రితం కొవిడ్ కారణంగా స్కూళ్లు మూతబడడంతో పాటు గతేడాది ఆలస్యంగా విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఆ సమయంలో జిల్లాలో దాదాపు 17 వేల మంది స్టూడెంట్స్​ ప్రైవేట్ స్కూళ్ల నుంచి వచ్చి, ప్రభుత్వ స్కూళ్లలో చేరారు. ప్రైవేట్ స్కూల్ ఫీజులు కట్టలేక కొందరు, ఆన్ లైన్​ క్లాసులు వినలేక ఇంకొందరు తమ పిల్లలను గవర్నమెంట్ స్కూళ్లలో జాయిన్​ చేశారు. ఈ ఏడాది కొవిడ్  ముందు ఉన్న తరహాలోనే అన్ని స్కూళ్లు ఓపెన్​ కాగా, గతేడాది కంటే 10 వేల మంది స్టూడెంట్స్​ ప్రభుత్వ స్కూళ్లలో తగ్గారు. విద్యాశాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో ఇంగ్లిష్, తెలుగు మీడియం విద్యార్థులు కలిపి గతేడాది 98,514 మంది ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 88,248కు చేరింది. 

భరోసా కల్పిస్తలేరు..

విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు స్కూళ్లకు పూర్తి స్థాయిలో పుస్తకాలు రాలేదు. జిల్లాకు 6,60,880 పుస్తకాలు అవసరం కాగా, ఇప్పటి వరకు 4,68,250 పుస్తకాలు వచ్చాయి. వాటిలో 3,70,021 పుస్తకాలను స్టూడెంట్స్​కు అందించారు. ఇంకా 98 వేల బుక్స్ అందించాల్సి ఉంది. ఇక యూనిఫామ్​ కోసం అవసరమైన క్లాత్ వచ్చినా, ఇంకా ఇవ్వలేదు. ఇటీవల కల్లూరు మండలంలో ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్​ వీపీ గౌతమ్​ సందర్శించిన సమయంలో స్టూడెంట్స్​ కు యూనిఫామ్​ లేని విషయాన్ని గుర్తించి సీరియస్​ అయ్యారు. క్లాత్ వచ్చినా ఎందుకు కుట్టించలేదని ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లిష్  మీడియం బోధనపై పేరెంట్స్​కు భరోసా కల్పించలేక పోతున్నారని అంటున్నారు. ఇలా వేర్వేరు కారణాలతో ప్రైవేట్ స్కూళ్లకు పేరెంట్స్ మొగ్గు చూపిస్తున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి.

బడిబాటలో చేరిన 14 వేల మంది ఎక్కడ ?

ప్రైవేట్ స్కూళ్లలో జాయిన్​ అయ్యేందుకు కొంత మంది స్టూడెంట్స్​ టీసీలు తీసుకుని వెళ్తున్న మాట వాస్తవమేనని అంగీకరిస్తూనే, గురుకులాల్లో చేరేందుకు కూడా కొందరు స్టూడెంట్స్ వెళ్లారని చెబుతున్నారు. ఈ ఏడాది బడిబాట ద్వారా ఏకంగా 14 వేల మంది స్టూడెంట్స్ ను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించినట్టు ఆఫీసర్లు చెప్పారు. వీరిలో 5 వేల మంది ప్రైవేట్ స్కూళ్ల నుంచి గవర్నమెంట్ స్కూళ్లలో జాయిన్​ అయ్యారని ప్రకటించారు. కానీ ఈ లెక్కలు తప్పనే విషయం స్పష్టమవుతోంది. దీనిపై అధికారులు స్పందించేందుకు ఆసక్తి చూపించడం లేదు. మరోవైపు జిల్లాలో 21 మండలాలు ఉండగా, ఇద్దరు మాత్రమే రెగ్యులర్​ ఎంఈవోలు ఉన్నారు. 10 మంది హెచ్ఎంలు ఇన్​చార్జి ఎంఈవోలుగా వ్యవహరిస్తున్నారు. వీరిలో ఒక్కొక్కరికి రెండు, మూడు మండలాల బాధ్యతలు అప్పగించారు. 

సర్కారు స్కూళ్లలో సమస్యలతోనే ఈ పరిస్థితి

ప్రభుత్వ స్కూళ్లల్లో ఉన్న సమస్యలతోనే స్టూడెంట్స్​ ప్రైవేట్​ కు వెళ్తున్నారు. రెండు నెలలవుతున్నా బుక్స్​ ఇవ్వలేదు. చాలా స్కూళ్లలో పూర్తి స్థాయిలో టీచర్లు లేరు. స్కూళ్లలో పరిస్థితులు పరిశీలించి సమస్యలు పరిష్కరించేందుకు ఎంఈవోలు లేరు. దీంతో ప్రభుత్వ స్కూళ్ల కంటే ప్రైవేట్  స్కూళ్లపై పేరెంట్స్ నమ్మకం పెట్టుకుంటున్నారు. 

-వెంకటేశ్, పీడీఎస్​యూ జిల్లా ప్రధాన కార్యదర్శి

కారేపల్లి మండలంలో ఏడు జిల్లా పరిషత్ హైస్కూళ్లలో 676 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గేట్ కారేపల్లి హైస్కూల్ లో 53 మంది విద్యార్థులకు ఏడుగురు టీచర్లు ఉన్నారు. మాణిక్యారంలో 56 మందికి ఏడుగురు టీచర్లు, విశ్వనాథపల్లిలో 58 మందికి 8 మంది, పేరుపల్లిలో 90 మందికి 9 మంది టీచర్లు, కారేపల్లిలో 241 మందికి 12 మంది టీచర్లు, కోమట్లగూడెంలో 83 మందికి 8 మంది టీచర్లు ఉన్నారు. బాజుమల్లాయిగూడెంలో 95 మంది విద్యార్థులకు ఏడుగురు టీచర్లు ఉన్నారు. కారేపల్లి మినహా మిగతా అన్ని స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. ఇటీవల కలెక్టర్ వీపీ గౌతమ్​ పేరుపల్లి హైస్కూల్ ను సందర్శించిన సమయంలో టీచర్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. టీచర్లు సరిపడా ఉండి విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటం, పిల్లలంతా ప్రైవేట్ స్కూళ్లకు వెళ్తుండడంపై లోపం ఎక్కడ జరుగుతోందనే విషయం తెలుసుకొనేందుకు గ్రామస్తులతో మాట్లాడారు. ఇంగ్లిష్  మీడియం బోధనపై భరోసా కల్పించడంలో టీచర్లు విఫలమవుతున్నారని కలెక్టర్  వ్యాఖ్యానించారు. పేరెంట్స్​కు ఇంగ్లిష్  మీడియంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత టీచర్లు, ఎస్ఎంఎస్ కమిటీలపై ఉందని చెప్పారు.