బానోత్ సుజాత నాయక్ ఎక్కడ ? వెతికి పెట్టండి.. పీఎస్‌‌లో కంప్లైంట్

బానోత్ సుజాత నాయక్  ఎక్కడ ? వెతికి పెట్టండి.. పీఎస్‌‌లో కంప్లైంట్

ఎల్బీ నగర్ : ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్న హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్ కనిపించకుండా పోయిందని, పని చేసిన బీజేపీ క్యాడర్ కు నమ్మి ఓట్లు వేసిన జనాలకు బయటకు వచ్చి సమాధానం చెప్పాల్సిన బాధ్యత పార్టీ మారిన ఆమెపై ఉందని రంగారెడ్డి బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డిలు అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆమె కనిపించకుండా స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దాచారని ఆరోపిస్తూ ఎన్నో ఇబ్బందులు పడి గెలిపించుకున్న పార్టీ క్యాడర్, ఓట్లు వేసిన జనానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.పార్టీ మారిన తర్వాత కూడా బయటకు వచ్చి ఓట్లు వేసిన ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

తమ సమస్యలు పరిష్కరిస్తారని బీజేపీ పార్టీని నమ్మి సుజాత నాయక్ కు ప్రజలు అధికారం కట్టబెట్టారని కానీ ఆమె నమ్మి ఓటేసిన జనాల మనోభావాలను కుదవబెట్టి తన స్వలాభం కోసం అధికార పార్టీ ఎమ్మెల్యే తో కలిసి టీఆర్ఎస్ లో చేరిందని అన్నారు. పార్టీ మారిన కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నట్టుగా వ్యవహరిస్తూ డివిజన్ లో కనిపించకుండాపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగట్లో వస్తువులు కొన్నట్లుగా ఇతర పార్టీ నాయకులను టీఆర్ఎస్ కొంటోందని ఆమెకు డబ్బు ఆశ చూపి బెదిరింపులకు దిగి స్థానిక ఎమ్మెల్యే తమ పార్టీలోకి చేర్పించుకున్నారని అన్నారు. ఎమ్మెల్యే ఇలాంటి కుటిల రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. గత నెల 30నుండి తమ డివిజన్ కార్పొరేటర్ బానోత్ సుజాత నాయక్ కనిపించకుండా పోయిందని వేతికి పెట్టాలని కోరుతూ బీజేపీ హస్తినాపురం ప్రెసిడెంట్ నరేష్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత ఐదు రోజులుగా పాలనా పరమైన సమస్యలు ఎదురవుతున్నాయని, వర్షాలు పడుతున్నాయని ఓట్లేసిన జనం ఆందోళనలో ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.