
మెదడు పోస్తది ప్రేమకు పురుడు
క్రష్‌తో మొదలై ప్రేమ దాకా ఎదుగుతుంది
అంతా ఈ క్రమంలో పుట్టే హార్మోన్ల మహిమే
ప్రేమకు డోపమైన్, అడ్రినలిన్, ఆక్సిటోసిన్ల బాండ్
‘అరె బై.. ఆ పిల్లను సూడంగనే లబ్‌డబ్ లబ్‌డబ్ అని కొట్టుకోవాల్సిన గుండె.. లవ్డబ్ అని కొట్టుకుంటాందిరా’..
ఓ అబ్బాయి. ‘ఏమున్నడే గాడు.. అచ్చం మహేశ్‌బాబు లెక్క. వాడేనే నా లైఫ్‌ల హీరో’.. పెద్దపెద్ద కండ్లు చేసుకుని ఫ్రెండ్‌తో చెప్పింది అమ్మాయి.
అమ్మాయి అయితేంది.. అబ్బాయి అయితేందీ.. ప్రేమకు సింబల్ హార్ట్. ప్రేమికులంతా గుండె మొత్తాన్ని గిఫ్ట్లెక్క ప్యాక్ చేసేసి ఒకరికొకలు ఎక్స్చేంజ్ చేసుకుంటుంటరు. ప్రేమకు గుండెతోనే మూడుముళ్లేసేస్తరు. మరి, నిజంగా ప్రేమ పుట్టేది గుండెల్నేనా? ఎహె కాదు.. అంటోంది సైన్స్. ప్రేమకు పురుడు పోసేది మెదడంట. అమ్మాయి/అబ్బాయిని లేదా ఏదైనా వస్తువును చూసినప్పటి దగ్గర్నుంచి బుర్రల ఏమేం జరుగుతదో సైంటిస్టులు అరటిపండొలిచి నోట్ల పెట్టినట్టు వివరంగా చెప్పుకొచ్చిన్రు. అరె, అట్లెట్లా ఇప్పటిదాకా గుండెల పుడతదనుకుంటిమి కదా.. మెదడ్ల పుడ్తదా.. అదెట్లా అని కళ్లల్ల లైట్లు ఎలుగుతున్నయా..? అయితే, ఈ మెదడు లవ్ స్టోరీని చదివేయాల్సిందే మరి.
క్రష్‌తో స్టార్ట్
మనం ఏ పన్జేయాలనుకున్న మెదడుతోనే మొదలైతదన్న సంగతి తెలుసుకదా. ఇదీ అట్లనే. మెదడ్ల వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా (వీటీఏ) అనేది ఉంటది. మనల్ని మస్త్ ఖుషీగుంచే డోపమైన్ అనే న్యూరోట్రాన్స్‌మిట్టర్ అక్కడ్నే పుడ్తది. ఏదైనా మస్తు మస్తు వస్తువో, మనిషో మన కళ్లల్ల పడ్డంక, వెంటనే ఈ డోపమైన్ పుట్టుకొస్తుంటది. నాడీ నుంచి నాడీకి జంప్ కొడుతూ మెదడ్ల న్యూక్లియస్ అకంబెన్స్లో ఒక్క స్పార్క్‌ను ఇస్తది. అంతే.. క్రష్ మొదలైతది మన లోపల. ఆనందం రంకెలేస్తది. మొహం ఎలిగిపోతది. మనసుల కోరిక బలంగ నాట్కపోతది. అదొక్కటే కాదు.. కదలాలన్నా, మనలో స్ఫూర్తి రగలాలన్నా, మైండ్ ఫోకస్‌తో ఉండాలన్నా, అమ్మ పాలు తయారు కావాలన్నా అంతా ఈ డోపమైన్తోనే. అది గానీ ఎక్కువైతే దేనికైనా బానిసైపోతం. అయన్నీ పక్కకునెట్టేస్తే మనిషి జీవితంల ఇంకో ముఖ్యమైన విషయం ‘రొమాన్స్’ను పుట్టించెడిది కూడా ఈ డోపమైనే. ఇప్పటి నుంచి కాదు.. గప్పుడెప్పుడో 200 కోట్ల ఏండ్ల కిందట జీవి పుట్టినప్పుడు మొదాలు.. అన్ని జీవులల్ల ఈ డోపమైన్ నెట్వర్క్ ఉండేదట. డోపమైన్ ఎంతెక్కువ పుడితే, అంతెక్కువ కోరిక, ఆరాటం, ఆపేక్ష పెరిగిపోతయి. చివరాఖరికి ఎడిక్షన్‌లా మారిపోతది.
తర్వాతేమైతది?
ప్రేమ పిచ్చి ఎక్కువయ్యాక, పోరాడు లేదా పారిపో అనేటట్టు చేసే అడ్రినలిన్ అనే హార్మోన్‌ను తయార్జేసే అడ్రినల్ అనే గ్రంథికి మెదడు సిగ్నల్ పంపుతది. ఇగ ఇక్కడ్నుంచే మొదలైతయట.. గుండెల్లో గుబులు, తిండి సైసకపోవడం, చేతులు చెమటతో పచ్చిగైపోవడం వంటివి. ఈ టైంలనే కొన్నికొన్నిసార్లు గలత్ సోచాయిస్తమట. మన మెదడ్ల ప్రేమ పుట్టంగనే భయం, కోపం, బాధను కంట్రోల్లపెట్టే అమైగ్డలా అనే మెదడు భాగం పనిచేయడం ఆగిపోతది. ఇక్కడి దాకా మంచిగనే ఉంటది. అయితే, స్పష్టంగా సోచాయించుకునేందుకు పనికొచ్చే మెదడు ముందు భాగం పనిచేయడమూ ఆగిపోతది. మనం చూసిన వస్తువు లేదా మనిషి ఎట్లాంటిదో కూడా తెలసుకోకుండానే జడ్జ్ చేయడం ఆపేస్తం. ఎంటనే చూసినోళ్లతో బంధం ముడులేసుకుంటది. డోపమైన్, అడ్రినలిన్‌ను పుట్టించి మనలోపల ప్రేమకు బేస్ ఏస్తే.. ఫైనల్ స్టేజ్‌ల లవ్హార్మోన్ (ఆక్సిటోసిన్) అనే సిమెంట్‌తో ఆ బంధాన్ని మరింత గట్టిగయ్యేట్టు చేస్తది మెదడు. మెదడును అంటిపెట్టుకుని ఉండే హైపోథాలమస్‌లో పుట్టి, పిట్యూటరీ గ్రంథి నుంచి బయటకొస్తదది. ప్రేమపక్షులను మరింత దగ్గర చేసి, స్ట్రాంగ్ బాండ్ వేసేస్తది. ఇదీ, మెదడు చెబుతున్న లవ్‌స్టోరీ. మొత్తంగా ప్రేమల ఎమోషన్స్‌తో పాటు కెమికల్స్ మహిమ కూడా మస్తుమస్త్గా ఉంటదని సైన్స్ ప్రూవ్ చేసింది మరి.