సంక్రాంతి పండుగ వచ్చిందంటే సిటీ జనాలు ఊళ్ల బాట పడతారు. 24 గంటలు రద్దీగా ఉండే పట్టణాలు ఒక్కసారిగా వెలవెలబోయి సిటీల్లో మార్పు కనిపిస్తుంది. ఒక్క సిటీలోనే కాదు సంక్రాంతి పండుగ సమయంలో ప్రకృతిలో కూడా మార్పులొస్తాయి.
సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన సమయం ఆధారంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. ఆ రోజుకు ముందు రోజు భోగి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. కాని ఈ ఏడాది భోగి రోజు ( జనవరి 14)కు చాలా విశిష్టత ఉందని పండితులు చెబుతున్నారు. మళ్లీ ఇలాంటి రోజు 2040 వరకు రాదని చెబుతున్నారు. ఈ ఏడాది భోగి రోజుకు ఉన్న విశిష్టత గురించి తెలుసుకుందాం...!
సంక్రాంతి పండుగ కాలంలో సూర్యుడు దక్షిణయానం నుంచి ఉత్తరాయానంలోకి ప్రవేశిస్తాడు. ఈ మార్పుతో పాటు వాతావరణంలో చలి తీవ్రత పెరుగుతుంది. చలిని ఎదుర్కొనే సంప్రదాయంగా భోగి మంటలు వేయడం ద్వారా సంక్రాంతి ఉత్సవాలు మొదలవుతాయి. ఈ రోజునే భోగి పండుగగా జరుపుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ ఆచారం ఎక్కువగా కనిపిస్తుంది. చలి తగ్గాలని కోరుకోవడం మాత్రమే కాకుండా పాతవి వదిలి కొత్త జీవితానికి స్వాగతం పలకడం అనే భావన కూడా ఈ మంటల వెనుక ఉంది.
2026 సంవత్సరంలో భోగి పండుగకు మరింత ప్రత్యేకత ఏర్పడింది. ఈ ఏడాది భోగి రోజునే పుష్య మాసం కృష్ణ పక్షం ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. జనవరి 13 సాయంత్రం 3 గంటల 18 నిమిషాల నుంచి ఈ ఏకాదశి తిథి ప్రారంభమై జనవరి 14 సాయంత్రం 5 గంటల 53 నిమిషాల వరకు కొనసాగుతుంది. ఈ ఏకాదశిని షట్తిల ఏకాదశిగా పిలుస్తారు. భోగి పండుగ మరియు ఏకాదశి ఒకే రోజున కలసి రావడం చాలా అరుదైన సంఘటనగా పండితులు చెబుతున్నారు..
భోగి రోజే షట్తిల ఏకాదశి
భోగి రోజున కొన్ని నియమాలు పాటించడం ఆనవాయితీ. కానీ ఈసారి ఏకాదశి కూడా కలసి రావడంతో ఈ దినానికి మరింత ఆధ్యాత్మిక విలువ ఏర్పడింది. ఉపవాసం ఉండడం, విష్ణు పూజ చేయడం వంటి ఆచారాలు ఈ రోజున చేయడం శుభప్రదంగా భావిస్తారు.
తులసి వనంలో గోదాదేవి..
భోగి పండుగకు గోదాదేవి చరిత్ర కూడా బలంగా ముడిపడి ఉంది. సూర్యుడు ధనుర్మాసంలో ప్రవేశించిన రోజునే తులసి వనంలో గోదాదేవి అవతరించినట్లు పురాణ కథనం. ఆమె బాల్యంలోనే విష్ణుమూర్తి పట్ల భక్తి పెంచుకుని, పెద్దయ్యాక ఆయనను తప్ప మరెవ్వరినీ వివాహం చేసుకోనని నిర్ణయించుకుంది. పెద్దలు ఆమె సంకల్పాన్ని గౌరవించి విష్ణుమూర్తికే వివాహం చేయాలని నిర్ణయించారు.
గోదాదేవి తన కోరిక నెరవేరాలనే భావంతో ధనుర్మాసం మొత్తం 30 రోజుల పాటు ప్రతిరోజూ పాశురాలు పాడుతూ, పొంగలి మాత్రమే నైవేద్యంగా స్వీకరిస్తూ తపస్సు చేసినట్లు చెబుతారు. ఈ విధంగా 30 రోజులు గడిచిన తరువాత రంగనాథుడు ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకుంటానని వరమిచ్చాడు. పెద్దల సమ్మతితో రంగనాథపురంలో రంగనాథుడు ... గోదాదేవిల వివాహం ఘనంగా జరిగిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ సంఘటన భోగి పండుగ రోజున జరిగినట్లు సంప్రదాయం చెబుతుంది. అందుకే భోగి రోజున అనేక ఆలయాల్లో గోదా కళ్యాణం నిర్వహిస్తారు.
ఉపవాస నియమం..
ఈ ఏడాది ( 2026) భోగి రోజునే షట్తిల ఏకాదశి రావడంతో కొన్ని ప్రత్యేక ఆచారాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ రోజున ఉపవాస నియమం పాటించడం ఎంతో శుభప్రదమని చెబుతారు. అలాగే నువ్వుల పిండి లేదా నువ్వుల నూనెను శరీరానికి పూసుకుని స్నానం చేయడం, స్నాన జలంలో నల్ల నువ్వులు కలపడం మంచి ఫలితాలు కలుగుతాయని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల జాతకంలోని దోషాలు తొలగి అంతా శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
భోగి మంటలకు..
ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే భోగి మంటలకు ప్రత్యేక అర్థం ఉందని పండితులు చెబుతారు. దక్షిణయాన కాలంలో ఎదురైన కష్టాలు తొలగి, ఉత్తరాయాణంలో మంచి రోజులు ప్రారంభమవాలని కోరుకుంటూ ఈ మంటలు వేస్తారని విశ్వాసం. అందుకే భోగి పండుగను కేవలం ఆచారంగా కాకుండా ఆత్మశుద్ధి దినంగా కూడా భావిస్తారు.
►ALSO READ | Sankranti 2026: సంక్రాంతి పండుగ రోజు.. ఏం చేయాలి.. ఏం చేయకూడదు..!
షట్తిల ఏకాదశి రోజున నువ్వులను ఏదో ఒక రూపంలో ఆహారంగా తీసుకోవడం ప్రత్యేకంగా చెప్పబడింది. అలాగే నువ్వులను దానం చేయడం కూడా ఈ రోజున విశిష్టంగా భావిస్తారు. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, విష్ణుమూర్తిని స్మరించడం ఈ ఏకాదశి రోజున మరింత పుణ్యదాయకమని పండితులు సూచిస్తున్నారు.
వామన అవతారంలో..
భోగి మంటల వెనుక పురాణ గాథ కూడా ప్రసిద్ధి చెందింది. వామన అవతారంలో వచ్చిన శ్రీమహావిష్ణువు బలి చక్రవర్తిని పాతాళానికి పంపిన తరువాత అతనికి ఒక వరం ఇచ్చినట్లు పురాణాలు చెబుతాయి. ఆ వరం ప్రకారం బలి చక్రవర్తి పాతాళానికి రాజుగా ఉండాలి. అలాగే ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు ముందు అంటే భోగి రోజున భూలోకానికి వచ్చి ప్రజలను దర్శించి ఆశీర్వదించాలి అని విష్ణువు అనుగ్రహించినట్లు కథనం. అందుకే సంక్రాంతికి ముందు రోజు భోగి మంటలు వేసి బలి చక్రవర్తిని ఆహ్వానించే సంప్రదాయం ఏర్పడిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. . !
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
