కొత్త మండలాలకు పైసలేవీ?

కొత్త మండలాలకు పైసలేవీ?

నాలుగేండ్లు గా 467 ఉమ్మడి ఎంఆర్సీలకే నిధులు

124 కొత్త మండలాలకు పైసా ఇవ్వని సర్కార్
నిర్వహణ కష్టమంటున్న ఎంఈవోలు
హైదరాబాద్​, వెలుగు: రాష్ర్టంలో కొత్త మండలాలు ఏర్పడి నాలుగేండ్లు దాటినా.. స్కూల్​ ఎడ్యుకేషన్​కు పాత మండలాల ప్రకారమే సర్కార్​ నిధులను కేటాయిస్తోంది. కొత్తమండలాల ప్రకారమే పనులు చేయిస్తున్నా.. వాటికి ఇప్పటిదాకా ఒక్క పైసా ఇచ్చింది లేదు. కొత్త మండలాలకు యూడైస్​ కోడ్​తో పాటు ట్రెజరీ డీడీవో కోడ్​లూ వచ్చాయి. కానీ, నిధులు మాత్రం ఉమ్మడి మండలానికే స్కూల్​ ఎడ్యుకేషన్​ అధికారులు కేటాయిస్తున్నారు. దీంతో ఆ నిధులు సరిపోక ఎంఈవోలు సొంత డబ్బులను ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ర్టం 2016లో జిల్లాలు, డివిజన్లతో పాటు మండలాలనూ విభజించింది. అప్పుడు 467గా ఉన్న మండలాలు 591కి పెరిగాయి. కానీ కొత్త మండలాలకు ఇప్పటికీ మండల ఎడ్యుకేషన్​ ఆఫీసర్ల (ఎంఈవో)ను నియమించలేదు. గతంలో కొత్త మండలాలకు 85 ఎంఈవో పోస్టులను శాంక్షన్​ చేసినా ఇంకా భర్తీ చేయలేదు. పాత మండలాల ఎంఈవోలకే కొత్త మండలాల బాధ్యతలిచ్చారు.

కొత్త మండలాలకు ఎట్ల..?

రాష్ర్టంలో 40 వేలకుపైగా స్కూళ్లున్నాయి. వీటిని మండలస్థాయిలో ఎంఈవోలే పర్యవేక్షిస్తుంటారు. ఇటీవల మండల రీసోర్స్​ సెంటర్లు (ఎంఆర్సీ), స్కూల్​ కాంప్లెక్స్​లకు ప్రభుత్వం గ్రాంట్స్​ ఇచ్చింది. ఒక్కో ఎంఆర్సీకి రూ.లక్షా ఇరవై వేలు, స్కూల్​ కాంప్లెక్స్​లకు రూ. 43 వేలు ఇస్తామని ప్రకటించిన సర్కార్​.. తొలి విడుతలో సగం నిధులు ఇచ్చింది. అయితే, ఎంఆర్సీ గ్రాంట్స్​ను ఉమ్మడి ఎంఆర్సీ పేరుతోనే ఇస్తోంది. ఒక్కో ఉమ్మడి మండలంలో రెండు, మూడు చొప్పున కొత్త మండలాలు ఏర్పడినా వాటికి స్పెషల్​గా నిధులు కేటాయించట్లేదు. ఎంఈవో ఆఫీస్​ నిర్వహణ, కరెంట్​ బిల్లులు ఒక్కటే ఉన్నా స్కూల్​ మేనేజ్​మెంట్​ కమిటీల మీటింగ్​లు, మండల స్థాయి ఇతర సమావేశాలు, పోటీల నిర్వహణ, స్టేషనరీ, ట్రావెలింగ్, ఇతర నిర్వహణ ఖర్చులు వేర్వేరుగానే ఉంటున్నాయి. దీంతో ఉమ్మడి మండలాల చొప్పున ఇస్తున్న నిధులు కేవలం ఒక్క మండలానికే సరిపోతున్నాయని ఎంఈవోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన మండలాలకు, వాటి నుంచి కొన్ని ఖర్చు చేస్తున్నా, చాలావరకూ సొంతంగా ఖర్చు చేయాల్సి వస్తోందని చెప్తున్నారు. ఎంఆర్సీ కేంద్రాల్లో పనిచేసే ఎంఐఎస్​ కోఆర్డినేటర్లు, కంప్యూటర్​ ఆపరేటర్ల నియామకం కోసం ఎగ్జామ్​​పెట్టి ఏడాది కావొస్తున్నా, ఇప్పటికీ ప్రభుత్వం ఆ పోస్టులను భర్తీ చేయలేదు. పని మాత్రం రెండు, మూడు మండలాలవీ వారే చేస్తున్నారు. అయినా వారికి స్పెషల్​ అలవెన్స్​లూ ఇవ్వకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ప్రభుత్వం కొత్తమండలాలకు నిధులు కేటాయించి, సిబ్బందినీ నియమించాలని ఎంఈవోలు, టీచర్లు కోరుతున్నారు.