AUS vs SA: ముగ్గురు సెంచరీల మోత.. సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా విశ్వరూపం

AUS vs SA: ముగ్గురు సెంచరీల మోత.. సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా విశ్వరూపం

సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరి వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో విధ్వంసం సృష్టించింది. తొలి రెండు వన్డేలు ఓడి సిరీస్ కోల్పోయిన కంగారూలు మూడో వన్డేలో మాత్రమే రెచ్చిపోయి ఆడింది. ఆదివారం (ఆగస్టు 24) మెకే వేదికగా గ్రేట్ బారియర్ రీఫ్ అరీనాలో జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 431 పరుగులు చేసింది. జట్టులో ఏకంగా ముగ్గురు సెంచరీలు కొట్టడం విశేషం. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (140), మిచెల్ మార్ష్(100) సెంచరీలతో విజృంభిస్తే.. ఆ  తర్వాత కెమరూన్ గ్రీన్ (118) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

చివరి మ్యాచ్ లో మొదటగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ఒక వైపు నిలకడగా ఆడుతూనే మరోవైపు వేగంగా పరుగులు రాబట్టారు. వీరిద్దరి జోరుతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. తొలి వికెట్ కు ఏకంగా 34 ఓవర్లలోనే 250 పరుగులు జోడించి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. మార్ష్ జాగ్రత్తగా ఆడితే.. హెడ్ అదే పనిగా చెలరేగాడు. ఈ క్రమంలో ఇద్దరూ తమ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. హెడ్ 103 బంతుల్లోనే 17 ఫోర్లు, 5 సిక్సర్లతో 140 పరుగులు చేశాడు. మరోవైపు మార్ష్ 106 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. 

Also read:-ఓపిక నశించింది: నయా వాల్ పుజారా రిటైర్మెంట్‪కు కారణాలు ఇవే!

సెంచరీలు చేసిన తర్వాత ఇద్దరూ స్వల్ప వ్యవధిలో ఔటైనా ఆ తర్వాత గ్రీన్, క్యారీ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. ఒకవైపు గ్రీన్ అదేపనిగా రెచ్చిపోతే అతనికి వికెట్ కీపర్ క్యారీ మంచి సహకారాన్ని అందించాడు. పవర్ హిట్టింగ్ తో దుమ్ములేపిన గ్రీన్ కేవలం 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్యారీ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు అజేయంగా 164 పరుగులు జోడించడం విశేషం. లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా ప్రస్తుతం 17 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసి ఓటమి దిశగా కొనసాగుతోంది. ఆస్ట్రేలియా వన్డే చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోర్ కావడం విశేషం.