Cheteshwar Pujara: ఓపిక నశించింది: నయా వాల్ పుజారా రిటైర్మెంట్‪కు కారణాలు ఇవే!

Cheteshwar Pujara: ఓపిక నశించింది: నయా వాల్ పుజారా రిటైర్మెంట్‪కు కారణాలు ఇవే!

టీమిండియా నయా వాల్, టెస్ట్ స్పెషలిస్ట్ చటేశ్వర్ పుజారా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు ఆదివారం (ఆగస్టు 24) రిటైర్మెంట్ ప్రకటించాడు. దశాబ్దకాలంగా భారత టెస్ట్ జట్టులో కీలక పాత్ర పోషించిన అతను ద్రవిడ్ వారసుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి దేశాలలో భారత్ సాధించిన విజయాల్లో పుజారా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మూడో స్థానంలో పుజారా అడ్డుగోడలా నిలబడుతూ  నిలకడగా రాణించాడు. బాగా ఆడుతూ టెస్టుల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. మరొకొన్ని సంవత్సరాలు టెస్ట్ క్రికెట్ లో కొనసాగుతాడని భావించినా అనూహ్యంగా గుడ్ బై చెప్పాడు.

కుర్రాళ్లకు అవకాశం ఇవ్వడానికే:

టీమిండియాలో చోటు కోల్పోయిన పుజారా ఆ తర్వాత దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణించాడు. రంజీ ట్రోఫీలో సెంచరీలతో పాటు డబుల్ సెంచరీలు చేసి జట్టులో స్థానం సంపాదించాలని తీవ్రంగా పోరాడాడు. అయితే బీసీసీఐ మాత్రం కుర్రాళ్ల వైపు చూసింది. పుజారా ఫామ్ లేని సమయంలో కుర్రాళ్లకు అవకాశం కల్పించాలని చూసింది. భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ఈ నయా వాల్ ను సైడ్ చేశారు. ఇటీవలే ఇంగ్లాండ్ తో జరిగిన ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్ కు చటేశ్వర్ పుజారాకు స్థానం దక్కించుకోలేకపోయాడు. ఈ సిరీస్ కు ముందు కోహ్లీ, రోహిత్ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. మొత్తం యంగ్ జట్టునే ఇంగ్లాండ్ సిరీస్ కు సెలక్ట్ చేసి 37 ఏళ్ళ పుజారాకు స్థానం లేదని సెలక్టర్లు చెప్పకనే చెప్పారు. 

నాలుగేళ్లుగా నిలకడ లేదు:

2023 దక్షిణాఫ్రికా టూర్‌ లో భాగంగా ఈ సీనియర్ ప్లేయర్ ను సెలక్టర్లు తప్పించిన సంగతి తెలిసిందే. 2020 నుండి పుజారా ఫామ్ దిగజారుతూ వస్తుంది. గత నాలుగేళ్లలో పుజారా భారత్ తరపున 28 టెస్టు మ్యాచ్ లాడితే యావరేజ్ 30 కంటే తక్కువగానే ఉంది. కేవలం ఒకసారి మాత్రమే మూడంకెల స్కోర్ ను చేరుకోగలిగాడు. నిలకడగా రాణించలేకపోవడం పుజారాకు మైనస్ గా మారింది. మూడో స్థానంలో పుజారాను భర్తీ చేసే ఆటగాడు దొరకకపోవడంతో పుజారాకు టెస్ట్ జట్టులో కష్టంగానే కొనసాగించాల్సి వచ్చింది. శుభమాన్ గిల్ మూడో స్థానంలో పాతుకుపోవడంతో పుజారా దారులు పూర్తిగా మూసుకుపోయాయి. 

ఇండియా తరపున 103 టెస్ట్ మ్యాచ్ లాడిన పుజారా 43 యావరేజ్ తో 7195 పరుగులు చేశాడు. 19 సెంచరీలు చేసిన పుజారా.. టెస్టుల్లో స్పెషలిస్టుగా పేరుపొందాడు. ఆస్ట్రేలియాపై 2023లో డబ్ల్యూటీసి ఫైనల్ లో పుజారా తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. పుజారా కేరీర్ లో చిరస్మరణీయంగా మిగిలిన టెస్టు 2018-19 లో ఆడిన ఆస్ట్రేలియా టెస్టు. ఈ టెస్టులో మొత్తం 1258 బాల్స్ ఫేస్ చేసిన పుజారా.. 521 రన్స్ చేసి అదరగొట్టాడు. పన్నెండు వందలకు పైగా బాల్స్ ఫేస్ చేసి ఆస్ట్రేలియాకు వికెట్ దొరకకుండా చుక్కలు చూపించాడు. ఇందులో మూడు సెంచరీలు కూడా చేయడం దిగ్గజాలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.