టీమ్ ఇండియా మరో వాల్.. టెస్ట్ స్పెషలిస్ట్ ఛటేశ్వర్ పుజారా.. అన్ని ఫార్మాట్లకూ రిటైర్మెంట్..

టీమ్ ఇండియా మరో వాల్.. టెస్ట్ స్పెషలిస్ట్ ఛటేశ్వర్ పుజారా.. అన్ని ఫార్మాట్లకూ రిటైర్మెంట్..

రాహుల్ ద్రవిడ్ తర్వాత టెస్టు క్రికెట్లో మరో వాల్ గా పిలుచుకునే ఛటేశ్వర్ పుజారా టెస్టుతో పాటు మిగతా క్రికెట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. తన సేవలు వినియోగించుకోవడం లేదని గత కొంతకాలగా అసంతృప్తితో ఉన్న పుజారా.. ఆదివారం (ఆగస్టు 24) క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. 

పుజారా టెస్టు క్రికెట్లో తనదైన స్థానం సంపాదించాడు. ఇండియాలో అత్యధిక పరుగులు చేసిన టెస్టు బ్యాటర్లలో.. 43.06 యావరేజ్ తో 7,195 రన్స్ సాధించి ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు. మొత్తం 103 మ్యాచుల్లో 19 సెంచరీలు చేసిన పుజారా.. టెస్టుల్లో స్పెషలిస్టుగా పేరుపొందాడు. ఆస్ట్రేలియాపై 2023లో ఆడిన ఓవల్ టెస్టు పుజారా చివరిగా ఆడిన టెస్టు మ్యాచ్.

గుజరాత్ రాజ్ కోట్ లో జన్మించిన పుజారా.. క్లాసికల్ టెక్నిక్స్ తో టెస్టుల్లో తనదైన ముద్ర వేశాడు. నెంబర్ త్రీ (3) ప్లేస్ లో టీమిండియాకు వాల్ గా ఉంటూ వికెట్లు కాపాడుతూ అండగా నిలిచిన సందర్భాలెన్నో ఉన్నాయి. టీమ్ పైన ప్రెజర్ ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ఆడుతూ పరుగుల వరద కురిపించడం ఇతడి స్పెషల్. డిఫెన్స్ లో రాహుల్ ద్రవిడ్ ను గుర్తు చేసేలా ఆట ఉంటుందని సీనియర్స్ ప్రశంసించడం విశేషం. 

రిటైర్మెంట్ పై పుజారా ఏమన్నాడు:

ఇండియన్ జెర్సీ ధరించి.. జాతీయ గీతం పాడుతూ.. ప్రతి సారీ టీమ్ కోసం నా వంతుగా నేను కంట్రిబ్యూట్ చేయడం నా అదృష్టం. ఇప్పటి వరకు నాకు మద్ధతిస్తూ వస్తున్న అందరికీ ధన్యవాదాలు. రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు పుజారా. 

Also read:-ముగ్గురు సెంచరీల మోత.. సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా విశ్వరూపం

2025 ఆస్ట్రేలియా టెస్టు సీరీస్ కు పుజారాను ఎన్నుకుంటారనే ఊహాగానాలు నడిచాయి. కానీ కొత్తవాళ్లతోని.. తక్కువ అనుభవం ఉన్న ప్లేయర్లతోనే బీసీసీఐ ముందుకు వెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు పుజారా. మరోవైపు కోహ్లీ, రోహిత్, అశ్విన్ వంటి సీనియర్ ప్లేయర్లు టెస్టుకు గుడ్ చెప్పడంతో.. ఇక తను కూడా వైదొలగాల్సిన సమయం వచ్చిందని భావించి రిటైర్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

చిరస్మరణీయంగా మిగిలిన ఆస్ట్రేలియా టెస్టు:

పుజారా కేరీర్ లో చిరస్మరణీయంగా మిగిలిన టెస్టు 2018-19 లో ఆడిన ఆస్ట్రేలియా టెస్టు. ఈ టెస్టులో మొత్తం 1258 బాల్స్ ఫేస్ చేసిన పుజారా.. 521 రన్స్ చేసి వాహ్వా అనిపించాడు. పన్నెండు వందలకు పైగా బాల్స్ ఫేస్ చేసి ఆస్ట్రేలియాకు వికెట్ దొరకకుండా చుక్కలు చూపించాడు. ఇందులో మూడు సెంచరీలు కూడా చేయడం దిగ్గజాలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. 

ఈ టెస్టులో పుజారా పర్ఫార్మెన్స్ ను.. 1970-71 లో సునీల్ గవాస్కర్ ఆడిన మ్యాచ్ తో పోల్చారు. వెస్ట్ ఇండీస్ పై 771 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు గవాస్కర్. పుజారా ఇన్నింగ్స్ కూడా గవాస్కర్ ఇన్నింగ్స్ కు ఎక్కడా తీసిపోదని అప్పట్లో సీనియర్లు కొనియాడారు.