గోవింద, సునీత మధ్య విబేధాలు.. విడాకులకు దారితీసిన కారణాలు ఇవేనా?

గోవింద, సునీత మధ్య విబేధాలు..  విడాకులకు దారితీసిన కారణాలు ఇవేనా?

బాలీవుడ్ స్టార్ హీరో గోవింద, ఆయన భార్య సునీతా అహుజా విడాకుల వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది.  తమ 38 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ ఆయన సతీమణి సునీత అహుజా విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ వార్త బాలీవుడ్‌లో, గోవింద అభిమానులలో కలకలం సృష్టిస్తోంది. ఇటీవల సునీత అహుజా ఓ వీడియోలో తమ వైవాహిక జీవితం గురించి మాట్లాడిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు.
సునీత అహుజా 2024 డిసెంబర్ 5న బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. హిందూ వివాహ చట్టం, 1955లోని సెక్షన్ 13 (1) (i), (ia), (ib) కింద ఆమె ఈ కేసు దాఖలు చేశారు.  అక్రమ సంబంధాలు, వేధింపులు, మోసం,  నిర్లక్ష్యం వంటి కారణాలను ఆమె పేర్కొన్నారు.   గతంలో సునీత మాట్లాడుతూ, గత 12 సంవత్సరాలుగా తన పుట్టినరోజు ఒంటరిగా జరుపుకుంటున్నానని, గోవింద పని కారణంగా, అతని వాగుడు స్వభావం వల్ల ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని చెప్పారు. 

గోవిందకు సమన్లు.. 
ఈ విడాకుల పిటిషన్‌పై విచారణకు హాజరు కావాల్సిందిగా మే 25న కోర్టు గోవిందకు సమన్లు జారీ చేసింది. అయితే, గోవింద ఇప్పటివరకు ఏ ఒక్క విచారణకు కూడా వ్యక్తిగతంగా హాజరు కాలేదని సమాచారం. ఈ కారణంతో కోర్టు అతనికి షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. మరోవైపు సునీత మాత్రం జూన్ 2025 నుంచి కోర్టు విచారణలకు, కౌన్సెలింగ్ సెషన్స్‌కు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. ఒకప్పుడు బాలీవుడ్‌లో తిరుగులేని కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్న గోవింద వ్యక్తిగత జీవితంలో ఇటువంటి సంక్షోభం ఎదుర్కోవడం అందరినీ నివ్వెరపరిచింది. అతని గైర్హాజరు చూస్తుంటే, సునీత ఆరోపణలు నిజమేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వివాదంపై  గోవింద న్యాయవాది లలిత్ బింద్రాను స్పందించారు.  ఎలాంటి కేసు లేదు, అంతా పరిష్కారమైంది. ప్రజలు పాత విషయాలను బయటకు తీస్తున్నారు అని బదులిచ్చారు. అంతేకాకుండా వచ్చే గణేష్ చతుర్థికి మీరంతా వారిని కలిసి చూస్తారు అని చెప్పారు.

పాత రూమర్స్‌కు బలం
గోవింద, సునీత అహుజాల మధ్య మనస్పర్ధలు ఉన్నాయనే వార్తలు గతంలో చాలాసార్లు వచ్చాయి. ముఖ్యంగా, సహ నటి నీలం కొఠారీతో గోవిందకు అఫైర్ ఉందనే వార్త అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత రాణి ముఖర్జీతోనూ గోవింద సంబంధం పెట్టుకున్నారనే పుకార్లు షికారు చేశాయి. అయితే, గోవింద, సునీత వాటిని ఖండించేవారు. ఇప్పుడు సునీత అహుజా స్వయంగా విడాకుల పిటిషన్ వేయడంతో ఆ పాత రూమర్స్‌కు బలం చేకూరింది. గోవింద ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారో, ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.