
- కెపాసిటీకి మించి ప్యాసిం జర్లను ఎక్కించిన పోలీసులు
- పండుగ పూట ప్రయాణానికి జగిత్యాలలో బస్సులు కరువు
ఏ చిన్న ట్రాఫిక్ రూల్ పాటించకపోయినా ట్రాఫిక్ పోలీసులు వెంబడించి మరీ వాహనాలను అడ్డుకుంటారు. బైక్ మీద ట్రిపుల్ రైడింగ్, ఆటోలు ఓవర్ లోడింగ్ తో వెళ్లినా ఇక చెప్పనక్కర్లేదు. భారీగా పెనాల్టీలు కట్టాల్సిందే. కానీ అదే ట్రాఫిక్ పోలీసులు దగ్గరుండి మరీ కెపాసిటీకి మించి ఆర్టీసీ బస్సులో ప్యాసింజర్లను ఎక్కించి పంపించారు. శుక్రవారం జగిత్యాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. దసరా సెలవులు రావడంతో శుక్రవారం జగిత్యాల పాత బస్టాండ్ కిక్కిరిసిపోయింది. ఒకే బస్సు ఉన్న మద్దునూర్ రూట్లో వెళ్లేందుకు 200 మందికి పైగా వేచిఉన్నారు. బస్సు రాగానే వారంతా ఎక్కడంతో కొందరు స్టూడెంట్లు ఇంతమందితో బస్సు నడపవద్దంటూ గొడవకు దిగారు. డ్రైవర్ పద్మాకర్ అందించిన సమాచారం మేరకు ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని మరో బస్సు ఏర్పాటు చేయించారు. 50 సీట్ల కెపాసిటీ ఉన్న ఒక్కో బస్సులో 80 మందికి పైగా ప్రయాణికులను ఎక్కించి పంపించారు. తాము రూల్స్ బ్రేక్ చేస్తే మాత్రం భారీ పెనాల్టీలు వేస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. దగ్గరుండి మరీ రూల్స్ కు విరుద్ధంగా అంతమందిని ఒకే బస్సులో ఎలా ఎక్కిస్తారంటూ మండిపడుతున్నారు. ఒక్కో బస్సులో వంద మందిని ఎక్కించిన ట్రాఫిక్ పోలీసులకు, బస్సు నడిపించిన ఆర్టీసీకి ఫైన్ వేయాలంటున్నారు.