బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం . ..... ఉత్తర వాయవ్య దిశగా బంగ్లాదేశ్ తీరం వైపు పయనం

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం .  ..... ఉత్తర వాయవ్య దిశగా బంగ్లాదేశ్ తీరం వైపు పయనం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఈ తీవ్ర వాయుగుండం మరింత శక్తిని పుంజుకుని తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. వాయుగుండం తుఫాన్‌గా మారి... ఉత్తర వాయవ్య దిశలో బంగ్లాదేశ్ తీరం వైపు పయనిస్తుందని తెలిపింది. ఈ నెల 25 సాయంత్రం బంగ్లాదేశ్ తీరంలో ఖేపుపారా-చిట్టగాంగ్ ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశముందని ఐఎండీ వివరించింది. కాగా, విశాఖ వాతావరణ కేంద్రం కూడా దీనిపై అప్ డేట్ అందించింది. కోస్తాంధ్రలో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గంటకు 13కిలోమీటర్ల వేగంతో కదులుతూ వాయుగుండం బలపడుతుంది. ఈ వాయుగుండం పారాదీప్ కు దక్షిణంగా 360 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. తుఫాన్ గా మారిన తరువాత “హమున్” దిశ మార్చుకోనుంది. ఉత్తర కోస్తా, ఒడిషా తీరాలను అనుకుని బంగ్లాదేశ్ వైపు పయనించనుంది. సముద్రంలోనే బలహీనపడి  బంగ్లాదేశ్ లోని చిట్టిగాంగ్ సమీపంలో తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉంది. దీంతో తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్రలో మేఘావృతంగా ఉంది. తీవ్ర వాయుగుండం కారణంగా శ్రీకాకుళం జిల్లాలో చెదురు మదురు వర్షాలు పడనున్నాయి. అంతేకాకుండా.. కేరళ, తమిళనాడుతో పాటు ఏపీ కోస్తా తీర ప్రాంతంలోనూ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అంతేకాకుండా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

ALSO READ ;- పులిగోరు లాకెట్ .. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అరెస్ట్