
హైదరాబాద్ సిటీలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల వేడి మొదలైంది. ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం 9 డివిజన్లు ఉన్నాయి. బోరబండ, రెహ్మత్ నగర్, యూసుఫ్ గూడ, షేక్ పేట్, వెంగళరావు నగర్, ఎర్రగడ్డ ప్రాంతాలు జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోనివే. వీటితో పాటు శ్రీనగర్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, సోమాజీగూడలోని కొన్ని కాలనీలు, బస్తీలు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. శ్రీనగర్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, సోమాజీగూడలోని మెజార్టీ కాలనీలు ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. 2009 నియోజకవర్గాల పునర్విభజనతో ఖైరతాబాద్నుంచి వేరుపడి ఏర్పడ్డ కొత్త నియోజకవర్గం జూబ్లీహిల్స్. మూడో వంతు ముస్లిం ఓటర్లతో ఉండే అర్బన్స్థానమిది.
2009 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ నాయకుడు పి. జనార్దన్‌రెడ్డి ఆకస్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికలో ఆయన తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున గెలిచారు. 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో తెలుగుదేశం పార్టీ తరఫున నెగ్గిన మాగంటి గోపీనాథ్ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి మారి 2018, 2023 వరుస ఎన్నికల్లో గెలిచారు. ఈ అసెంబ్లీ స్థానం సికింద్రాబాద్లోక్సభ స్థానం పరిధిలోనిది. అధికంగా ముస్లిం ఓట్లున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో జరిగే ముక్కోణపు పోటీని పాలకపక్షం తనకు అనుకూలంగా మలచుకునే అవకాశాలు ఉంటాయన్నది ఒక అభిప్రాయం. ‘కులగణన’తో పాటు, ‘సామాజిక న్యాయం’ ప్రచారం కాంగ్రెస్కు లాభించవచ్చు. యూసుఫ్ గూడకు చెందిన నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత పోటీలో నిలిచారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం తుది ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారి, బీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఇప్పటికే విడుదల చేశారు. మొత్తం 3 లక్షల 98 వేల 982 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుష ఓటర్లు 2,07,367 మంది, మహిళా ఓటర్లు 1.91,590 మంది ఉన్నారు. అలాగే ఇతరులు 25 మంది ఉన్నారని ప్రకటించారు. నియోజకవర్గం ఓటర్లలో 80 ఏండ్లకు పైబడిన వృద్ధుల్లో పురుషులు 3,280 మంది, మహిళలు 2,772 మంది ఉన్నారు. ఇక ఎన్ఆర్ఐ ఓటర్లు 95 మంది కాగా, సర్వీస్ ఎలక్టోరల్స్ 18, పీడబ్ల్యూడీ ఓటర్లు 1,891 మంది నమోదయ్యారు.
నియోజకవర్గంలో 407 పోలింగ్ స్టేషన్లుండగా.. ఒక్కో పోలింగ్స్టేషన్లో యావరేజ్గా 980 మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలకు ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఎవరికి వారు ఈ స్థానం కైవసం చేసుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాలతో తలమునకలయ్యారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్
- అక్టోబర్ 13 న నోటిఫికేషన్
- అక్టోబర్ 13న నామినేషన్ల స్వీకరణ
- అక్టోబర్ 21న నామినేషన్లకు చివరి తేది
- అక్టోబర్ 22న నామినేషన్ల పరిశీలన
- అక్టోబర్ 24న నామినేషన్ల విత్ డ్రా
- నవంబర్ 11న పోలింగ్
- నవంబర్ 14న కౌంటింగ్