ఖానాపూర్​లో 30 ఏండ్ల తర్వాత..ఆదివాసీ ఎమ్మెల్యేకు పట్టం

ఖానాపూర్​లో 30 ఏండ్ల తర్వాత..ఆదివాసీ ఎమ్మెల్యేకు పట్టం
  •     చరిత్ర సృష్టించిన వెడ్మ బొజ్జు పటేల్
  •     ఎస్టీ సెగ్మెంట్లలో కొనసాగిన సంప్రదాయం
  •     గత మూడు పర్యాయాలుగా బోథ్ లో లంబాడా, ఆసిఫాబాద్ ఆదివాసీలకే పట్టం

ఆదిలాబాద్, వెలుగు : ఖానాపూర్​లో వెడ్మ బొజ్జు పటేల్​ చరిత్ర సృష్టించాడు. లంబాడా నేతలు రాజ్యమేలిన ఖానాపూర్​నియోజకవర్గంలో సత్తా చాటాడు. 30 ఏండ్ల చరిత్రను తిరగరాస్తూ ఆదివాసీ నేత ఎమ్మెల్యేగా గెలుపొందాడు. లంబాడా సామాజికవర్గ అభ్యర్థిని కాదని, ఆదివాసీ నేతకు ఓటర్లు జైకొట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్​జిల్లాలోని ఎస్టీ నియోజకవర్గాలైన ఖానాపూర్​మినహా బోథ్, ఆసిఫాబాద్ ఓటర్లు తమ సాంప్రదాయాన్ని కొనసాగించారు. మూడోసారి అదే సామాజిక వర్గం లీడర్లకు పట్టం కట్టబెట్టారు.

ఉమ్మడి జిల్లాలో బీఆర్​ఎస్​గెలుపొందిన స్థానాలు కూడా ఈ రెండే కావడం విశేషం. బోథ్​లో లంబాడా అయిన అనిల్​జాదవ్​ను గెలిపించిన ఓటర్లు, ఆసిఫాబాద్​లో ఆదివాసీ కోవ లక్ష్మికి పట్టంకట్టారు. ఈ మూడు కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలే కాగా.. రెండు చోట్ల గెలిచిన ఈ పార్టీ ఖానాపూర్​లో ఓటమిపాలైంది.

30 ఏళ్ల చరిత్ర తిరగరాసిన వెడ్మ బొజ్జు

ఖానాపూర్ నియోజకవర్గంలో గత30 ఏండ్ల నుంచి లంబాడా సామాజికవర్గం నేతలే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వచ్చారు. చివరిసారిగా 1989 లో కాంగ్రెస్ నుంచి ఆదివాసీ సామాజికవర్గానికి చెందిన కోట్నక్ భీంరావు గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఇక్కడ ఒక్కసారి కూడా గెలువలేదు. లంబాడా వర్గానికి చెందిన అజ్మీరా గోవింద్​నాయక్, రమేశ్​రాథోడ్, సుమన్​రాథోడ్, రేఖా నాయక్ గెలుస్తూ వచ్చారు. అలాగే ఈ నియోజకవర్గంలో ఆదివాసీ లీడర్లకు సైతం ఓటమి తప్పలేదు. ఇలా రెండు అంశాల్లోనూ కాంగ్రెస్ పార్టీ, ఆదివాసీ నేతలు ఓటమిపాలు కాగా..

వెడ్మ బొజ్జు పటేల్ చరిత్రను తిరగరాశారు. బీఆర్ఎస్, బీజేపీ నుంచి బలమైన అభ్యర్థులపై పోటీ చేసిన సాదాసీదా వ్యక్తి అసాధారణ విజయం సాధించారు. ఈ విజయంతో 37 ఏండ్ల వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. టీపీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి కాబోతున్న రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా బొజ్జుకు మంచి గుర్తింపు ఉంది. 

అదే సామాజికవర్గానికి పట్టం

రాష్ట్రం ఏర్పాటు తర్వాత మూడు సార్లు జరిగిన ఎన్నికల్లో బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో ఒకే సామాజికవర్గానికి ఓటర్లు పట్టం కట్టారు. ఆసిఫాబాద్ నియోజకవర్గం 2009 నుంచి ఎస్టీ రిజర్వ్ చేశారు. అంతకుముందు ఎస్సీ నియోజకవర్గంగా ఉండేది. 2009లో కాంగ్రెస్ నుంచి ఆదివాసీ లీడర్ ఆత్రం సక్కు మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో అదే సామాజికవర్గానికి చెందిన కోవ లక్ష్మి బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆత్రం సక్కు బీఆర్ఎస్ లో చేరారు.

మళ్లీ 2023 లో సిట్టింగ్ సీటును జెడ్పీ చైర్ పర్సన్ గా ఉన్న కోవ లక్ష్మి కేటాయించగా లంబాడా వర్గానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి శ్యామ్ నాయక్ పై విజయం సాధించారు. ఇక బోథ్ నియోజకవర్గంలో 1983 నుంచి 2014 వరకు ఆదివాసీ సామాజికవర్గం లీడర్లు రాజ్యమేలారు. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారాయి. 2014 నుంచి 2023 వరకు వరుసగా మూడు పర్యాయాలు లంబాడా సామాజికవర్గానికి ఓటర్లు పట్టంకట్టారు.

ఈ నియోజకవర్గంలో ఆదివాసీ ఓటర్లు అధికంగా ఉంటారు. ఈసారి వీరంత బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు వైపు మొగ్గు చూపారనే ప్రచారం జరిగినప్పటికీ.. మిగతా సామాజికవర్గాలు బీఆర్ఎస్ కు మద్దతు తెలుపడంతోనే ఆ పార్టీ అభ్యర్థి అనిల్ జాదవ్ విజయం సాధించారు.