లంకలో సంకీర్ణ కూటమికి మిత్ర పక్షాలు గుడ్​బై

లంకలో సంకీర్ణ కూటమికి మిత్ర పక్షాలు గుడ్​బై
  • రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ 
  •   కూటమి నుంచి 41 మంది ఎంపీలు బయటికి  
  •  మైనారిటీలో పడ్డ సర్కారు.. రాజకీయ సంక్షోభం 
  •  పార్లమెంటు డిప్యూటీ స్పీకర్, కొత్త ఆర్థిక మంత్రి రాజీనామా

కొలంబో: నాడు కుబేరుడు ఏలిన లంక.. నేడు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. దినదిన గండంగా కాలం వెళ్లదీస్తోంది. దీనికి ఇప్పుడు రాజకీయ సంక్షోభం కూడా తోడైంది. రాజపక్స సోదరుల కుటుంబ పాలనపై ప్రజలు, ప్రతిపక్ష నేతలు తిరుగుబాటు చేయగా.. తాజాగా మిత్రపక్ష నేతలు కూడా వారితో జతకలిశారు. ప్రెసిడెంట్ గోటబయ రాజపక్స తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలతో గొంతుకలిపారు. మంగళవారం గోటబయ ప్రభుత్వానికి దాదాపు 41 మంది మిత్ర పక్ష ఎంపీలు మద్దతు ఉపసంహరించుకున్నారు. దీంతో శ్రీలంకలోని సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. నేడో, రేపో కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. కానీ తమకు కావాల్సినంత మెజారిటీ ఉందని కూటమి నేతలు ధీమాగా చెబుతున్నారు.

బయటికొచ్చిన సిరిసేన

ప్రభుత్వంలో చేరాలంటూ సోమవారం దేశ అధ్యక్షుడు గోటబయ చేసిన ప్రతిపాదనను ప్రతిపక్షాలు తిరస్కరించాయి. ఆయనవి అర్థంలేని ప్రతిపాదనలని, ఆహారం, ఇంధనం, మందుల కొరతకు బాధ్యతకు వహిస్తూ ప్రెసిడెంట్ పదవికి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఇదే సమయంలో రాజపక్స బ్రదర్స్ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి మిత్రపక్షాలు బయటికి వచ్చాయి. శ్రీలంక పొదుజన పెరమున (ఎస్‌‌ఎల్‌‌పీపీ) కూటమిలో భాగ–స్వామిగా ఉన్న.. శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ (ఎస్ఎల్‌‌ఎఫ్‌‌పీ) నేత, మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తమ మద్దతును ఉపసంహరించుకున్నారు. దీంతో మంగళవారం  దాదాపు 41 మంది ఎంపీలు ప్రభుత్వానికి తమ సపోర్ట్ విత్‌‌ డ్రా చేసుకున్నారు. కాగా, ఆర్థిక మంత్రిగా సోమవారం బాధ్యతలు చేపట్టిన అలీ సబ్రీ.. ఒక్కరోజులోనే తప్పుకున్నారు. మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు  డిప్యూటీ స్పీకర్ రంజిత్ కూడా పదవికి రాజీనామా చేశారు.

కుటుంబపాలనపై వ్యతిరేకత 

రాజపక్స ఫ్యామిలీలోని చాలా మంది ప్రస్తుత ప్రభుత్వంలో కీలక పోర్ట్‌‌ఫోలియోలు దక్కించుకున్నారు. గోటబయ రాజపక్స ప్రెసిడెంట్‌‌గా, ఆయన సోదరుడు, మాజీ ప్రెసిడెంట్ మహింద రాజపక్స ఇప్పుడు ప్రధాన మంత్రిగా ఉన్నారు. మరో సోదరుడు బాసిల్ మొన్నటి దాకా ఆర్థిక మంత్రిగా ఉన్నారు. మహింద కొడుకు నమల్.. స్పోర్ట్స్ మంత్రిగా పని చేశారు. మరికొందరు కూడా ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే రాజపక్స ఫ్యామిలీ మొత్తం పాలిటిక్స్ నుంచి దిగిపోవాలన్న డిమాండ్లు వస్తున్నాయి. 

ఎవరి బలమెంత? 

2020 ఎన్నికల్లో 150కి పైగా సీట్లు సాధించి.. గోటబయ రాజపక్స ఆధ్వర్యంలో ఎస్‌‌ఎల్‌‌పీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. తాజాగా 41 మంది ఎంపీలు ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకున్నారు. 225 మంది సభ్యులున్న పార్లమెంటులో మెజారిటీ నిరూపించుకోవాలంటే.. మేజిక్ ఫిగర్ 113 కాగా, ప్రభుత్వానికి 109 మంది ఎంపీల మద్దతు మాత్రమే ఉంది. అంటే మెజారిటీకి నలుగురు సభ్యులు తక్కువయ్యారు. దీంతో ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. కనీసం 50 నుంలచి 60 మంది సభ్యుల మద్దతు తగ్గొచ్చని అసమ్మతి ఎంపీ ఉదయ గమ్మన్పిల చెప్పారు. కానీ తమకు మెజారిటీ ఉందని ప్రభుత్వం చెబుతోంది. 138 మంది సభ్యుల మద్దతు తమకు ఉందని ఎస్‌‌ఎల్‌‌పీపీ నేతలు చెబుతున్నారు.