
- ఉత్తమ టీచర్ల సన్మాన కార్యక్రమంలో ఆది శ్రీనివాస్
రాజన్నసిరిసిల్ల, వెలుగు: అంకితభావంతో పనిచేసే టీచర్లకు సమాజంలో గుర్తింపు ఉంటుందని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం సిరిసిల్ల కలెక్టరేట్‌లో టీచర్స్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఉత్తమ టీచర్లుగా ఎంపికైన 17 మందిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఇప్పటికే 11వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామని, ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్స్ కల్పించామన్నారు.
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తోందన్నారు. మారుతున్న కాలానికనుగుణంగా టీచర్లు సాంకేతిక, నైపుణ్యతను అందిపుచ్చుకొని, విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, లైబ్రరీ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల, వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్లు స్వరూపరెడ్డి, రాజు, డీఈవో వినోద్ కుమార్, సంక్షేమ అధికారి లక్ష్మీరాజం పాల్గొన్నారు.