
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ శివారులో ఓ ఫ్యాక్టరీలో డ్రగ్స్‌ను ముంబై పోలీసులు పట్టుకుంటే.. దానిపై కూడా బీఆర్ఎస్ లీడర్లు కేటీఆర్, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ విమర్శలు చేస్తున్నారని విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. సోమవారం సీఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా కేటీఆర్, ఆర్‌ఎస్‌ల విమర్శలు ఉన్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఈర్ష్య, ద్వేషం, కళ్ల మంటతోనే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
డ్రగ్స్, గంజాయిరహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు రేవంత్ నిరంతరం కృషి చేస్తుంటే.. కేటీఆర్, ఆర్ఎస్లు సోయి లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే ఈగల్ టీంలతో డ్రగ్స్, గంజాయిపై సీఎం ఉక్కుపాదం మోపారని గుర్తుచేశారు. తప్పుడు ప్రచారంతో జనాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయకూడదని కేటీఆర్, ఆర్ఎస్ కు ఆయన హితవు పలికారు.