
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న అమ్మాయి చేతిలో ఓడిపోయినా ఇంకా సిగ్గు రాలేదా అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారని ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలకు శనివారం (ఫిబ్రవరి 15) ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు చిలక జ్యోతిష్యం చెపుతున్నాడని ఎద్దేవా చేశారు. ఎర్రబెల్లికి అంతగా జ్యోతిష్యం తెలిస్తే ఫాంహౌస్లో పడుకున్న కేసీఆర్ ఎప్పుడు లేస్తాడో.. అలాగే ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ఎప్పుడు జైలుకు పోతాడో చెప్పాలని సెటైర్ వేశారు.
నలభై ఏళ్లు రాజకీయాల్లో ఉండి చిన్న అమ్మాయి చేతిలో చిత్తు గా ఓడిపోయినా సిగ్గు రాలేదా..? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్లో ఉన్న ఎర్రబెల్లికి కాంగ్రెస్ విషయాలు ఎలా తెలుస్తున్నాయని ప్రశ్నించారు. మా ఎమ్మెల్యేలు గురించి ఎర్రబెల్లి ఆలోచించాల్సిన అవసరం లేదని.. ఇప్పటికే మీ వాళ్లు10 మంది పోయారు. మిగిలిన వారినైనా కాపాడుకోవాలని కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనను ఓర్వలేకనే ఎర్రబెల్లి విమర్శలు చేస్తున్నారని.. మా ప్రభుత్వంలో ఎలాంటి సమస్యలు లేవని.. రేవంత్ రెడ్డి నాయకత్వంలో స్థిరంగా ఉందన్నారు.
కులగణన, ఎస్సీ వర్గీకరణ ఒకే సారి చేసిన ఘనత మా ప్రభుత్వానిదేనని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి హోదాలో ఉండి రాహుల్ గాంధీ పైన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడా చులకన గా మాట్లాడలేదని.. సీఎం వ్యాఖ్యలను బండి సంజయ్ వక్రీకరించి మాట్లాడుతున్నాడని అన్నారు.