
- పార్టీలో ప్రాధాన్యం తగ్గడంతో మాట్లాడుతున్నరు: విప్ బీర్ల అయిలయ్య
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం 50 రోజులు సమ్మె చేసి, ఏకంగా 30 మంది కార్మికులు చనిపోతే ఎమ్మెల్సీ కవిత అప్పుడు ఎందుకు స్పందించలేదని విప్ బీర్ల అయిలయ్య ప్రశ్నించారు. శుక్రవారం సీఎల్పీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మేడే రోజున కవిత కొన్ని నిజాలు చెప్పారన్నారు. కులగణన సర్వేలో మీ నాన్న, అన్న ఎందుకు పాల్గొనలేదో సామాజిక తెలంగాణ గురించి మాట్లాడుతున్న కవిత చెప్పాలని నిలదీశారు.
కల్వకుంట్ల కుటుంబంలో తగాదాలు వచ్చి ప్రాధాన్యత తగ్గిపోవడంతోనే ఆమె ఇప్పుడు ఇలా మాట్లాడుతురని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కవిత ఇలా మాట్లాడి ఉంటే, అప్పుడే కేసీఆర్ ను ప్రశ్నించి ఉంటే రాష్ట్రంలో పరిస్థితి మరోలా ఉండేదని అన్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో జరిగిన తప్పులను కవిత బయటపెట్టి తెలంగాణ ప్రజల రుణం తీర్చుకోవాలని కోరారు.