రైతులకు అండగా ఉంటాం

రైతులకు అండగా ఉంటాం

పినపాక, వెలుగు: రాజ్యసభ సభ్యుడు​బండి పార్థసారథిరెడ్డి అందించిన రూ.కోటి విరాళంతో పినపాక నియోజకవర్గంలో గోదావరి వరద ముంపునకు గురైన 13 వేల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించనున్నట్లు విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు. సోమవారం పినపాక మండలం సింగిరెడ్డిపల్లి, వెంకట్రావుపేట, చింతల బయ్యారం గ్రామాల్లో సరుకులను పంపిణీ చేశారు. సింగిరెడ్డిపల్లిలో ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించారు. రైతులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. 

సేవాభారతి ఆధ్వర్యంలో..

పినపాక మండలం వెంకట్రావుపేట గ్రామంలో గోదావరి ముంపు బాధితులకు సేవాభారతి అధ్వర్యంలో వంట సామాగ్రి, చీరలు, చిన్నారులకు బట్టలు అందజేశారు. మానుకోట సభ్యులు కిరణ్, సుబ్రహ్మణ్యం, ధర్మజాగరణ జిల్లా అధ్యక్షుడు వల్లభనేని నాగేశ్వరరావు, బీజేపీ జిల్లా కార్యదర్శి దంతులూరి రామచంద్ర రాజు, మండల అధ్యక్షుడు ధూళిపూడి శివప్రసాద్, పోన్నగంటి రామకృష్ణ పాల్గొన్నారు.

ప్రతీ కుటుంబానికి పరిహారం ఇవ్వాలి

భద్రాచలం: గోదావరి వరదలతో నష్టపోయిన ప్రతీ కుటుంబానికి నష్ట పరిహారం ఇవ్వాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్​ చేశారు. టీఎస్​యూటీఎఫ్​ ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలో వంద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, దుస్తులు పంపిణీ చేశారు. అందరికీ పరిహారం అందేలా కలెక్టర్​ చొరవ చూపాలని కోరారు. రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జంగయ్య, చావా రవి పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థుల సాయం

పాల్వంచ: పట్టణంలోని బొల్లోరుగూడెం హైస్కూల్ లో 1983–84 టెన్త్​ బ్యాచ్​ స్టూడెంట్స్​ యూనియన్​ ఆధ్వర్యంలో సారపాక, బూర్గంపాడులోని బాధితులకు దుప్పట్లు, చీరలు, టవల్స్, లుంగీలు అందజేశారు. బండ యాదగిరి, జరబన సుధాకర్, సత్యనారాయణ, రవి, శేషాచలం, ఏపూరి రవిచంద్ర, భాస్కర్, శశికుమార్, శంకరన్న, మహమూద్, మహిపతి రమేశ్​ పాల్గొన్నారు.

ఆదుకోవాలని వరద బాధితుల వినతి

భద్రాద్రికొత్తగూడెం: వరదలతో నష్టపోయిన తమను ఆదుకోవాలని కోరుతూ కలెక్టర్​ అనుదీప్​కు బాధితులు విజ్ఞప్తి చేశారు. గ్రీవెన్స్​లో తమ సమస్యలను కలెక్టర్​కు వివరించారు. బూర్గంపహడ్​ మండలం భాస్కర్​నగర్​ గ్రామానికి చెందిన డబుల్​ బెడ్రూం ఇండ్లు మునిగిపోయాయని, వస్తువులన్నీ కొట్టుకుపోయాయని చెప్పారు. తమను ఆదుకోవాలని వినతులు అందించారు. 

రూ. 25వేలు విరాళం 

గోదావరి వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకునేందుకు దివ్యాంగులు ముందుకు వచ్చారు. తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెం కలెక్టరేట్​లో సోమవారం జరిగిన ప్రోగ్రాంలో కలెక్టర్​కు రూ. 25వేల చెక్కును అందజేశారు. దివ్యాంగులు విరాళాలు సేకరించి వరద బాధితులకు అండగా నిలవడం అభినందనీయమన్నారు. సంఘం అధ్యక్షుడు గుండపనేని సతీశ్, కాటి నాగేశ్వరరావు, ప్రవీణ్, సాయిబాబు, చాంద్​పాషా, హుస్సేన్, నరసయ్య, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.