ఎల్‌‌ నినో తో కరువొస్తే కాంగ్రెస్ ఎట్ల కారణం? : విప్ వేముల వీరేశం

ఎల్‌‌ నినో తో కరువొస్తే కాంగ్రెస్ ఎట్ల కారణం? : విప్ వేముల వీరేశం
  • విప్ వేముల వీరేశం కామెంట్ 

హైదరాబాద్, వెలుగు: కరోనా మహమ్మారి వ్యాప్తికి అప్పట్లో సీఎంగా ఉన్న కేసీఆర్ కారణమని తాము ఎప్పుడైనా బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశామా అని ప్రభుత్వ విప్ వేముల వీరేశం ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్‌‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడితే, దానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా కారణమవుతుందని నిలదీశారు. ఈ మేరకు గురువారం సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ సింగరేణి టూర్ ఒక సినిమా ప్రమోషన్‌‌లా సాగిందని ఎద్దేవా చేశారు. 

సీఎం రేవంత్ రెడ్డిలా గడ్డం, మీసం పెంచాలని కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని, అయితే అలా పెంచిన వారంతా అధికారంలోకి రాలేరని, కేవలం ప్రజల ఆదరణ ఉంటేనే అధికారంలోకి వస్తారని స్పష్టం చేశారు. కేటీఆర్ మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్లే కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సింగరేణి సంస్థ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని వీరేశం గుర్తుచేశారు. రామగుండం సభలో ఆ సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడకుండా, కేవలం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేశారని ఆయన మండిపడ్డారు.