
వాషింగ్టన్ డీసీ: రష్యా– ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలువరించేందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయా దేశాధినేతలు పుతిన్, జెలెన్ స్కీలతో ట్రంప్ విడివిడిగా భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. యుద్ధాన్ని ఆపేయాలని రెండు దేశాలు బలంగా కోరుకుంటున్నాయని ట్రంప్ చెప్పారు. త్వరలో పుతిన్, జెలెన్ స్కీ ఇరువురి మధ్య భేటీ ఏర్పాటు చేస్తానని వివరించారు. ఈమేరకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీతో భేటీ తర్వాత ట్రంప్ మీడియాతో మాట్లాడారు. త్రైపాక్షిక భేటీకి ముందు రష్యా, ఉక్రెయిన్ దేశాధినేతలు సమావేశం అవుతారని, అందుకోసం తాను ఏర్పాట్లు చేస్తున్నానని వివరించారు. జెలెన్ స్కీతో భేటీ తర్వాత పుతిన్ తో తాను ఫోన్లో మాట్లాడానని చెప్పారు. జెలెన్ స్కీతో ద్వైపాక్షిక భేటీకి పుతిన్ ఓకే చెప్పారని తెలిపారు. వారి మధ్య త్వరలోనే ద్వైపాక్షిక భేటీ జరగుతుందని, దాని ఫలితాన్ని బట్టి త్రైపాక్షిక సమావేశం ఎప్పుడు ఎక్కడ నిర్వహించాలనేది ప్లాన్ చేస్తామని పేర్కొన్నారు.
సాదాసీదాగా స్వాగతం..
పుతిన్‌కు అట్టహాసంగా వెల్కమ్ చెప్పిన ట్రంప్.. జెలెన్ స్కీని మాత్రం ఎలాంటి ఆర్భాటానికి పోకుండా సాదాసీదాగా స్వాగతించారు. వైట్‌హౌస్ ముందు జెలెన్ స్కీతో చేతులు కలిపారు. అనంతరం ఇరువురు నేతలు ఫొటోగ్రాఫర్లకు ఫోజులిచ్చారు. శనివారం అలాస్కాలో జరిగిన భేటీ సందర్భంగా పుతిన్‌కు రెడ్ కార్పెట్, స్టెల్త్ బాంబర్లతో విన్యాసాలతో ట్రంప్ స్వాగతం పలికారు.