మధ్య ప్రాచ్యం ప్రాంతంలో ఒకనాటి ‘పర్షియా’ను 1935 నుంచి ‘ఇరాన్’ (ఆర్య భూమి) అని పిలుస్తున్నాం. ఇస్లామిక్ దేశమైన ఇరాన్ రాజధాని టెహరాన్ నగరం. పార్షియన్ అధికార భాషగా సాగుతున్న ఇరాన్‌కు ప్రత్యేకం అక్కడి పర్షియన్ సాహిత్యం, తత్వశాస్త్రం, వైద్యం, కళల వికాసం. నాటి మహమ్మద్ రెజా షా పహ్లవి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా 1979లో ఇస్లామిక్ విప్లవం రావడం, తదుపరి అయతుల్లా ఖొమైనీ, అయతొల్లా అలీ ఖుమైనీ సుప్రీం లీడర్లుగా పాలన సాగించడంతో జనజీవితాలు ఛాందసవాద సంకెళ్లలో చిక్కిపోయాయి.
1989 నుంచి కొనసాగుతున్న అలీ ఖుమైనీ పాలనలో ఇరాన్‌లో ప్రస్తుత జనాభా 9.2 కోట్ల ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయి. ఇరాన్ దేశవ్యాప్తంగా ప్రస్తుత ప్రభుత్వ పనితీరుకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనల మార్గం పట్టారు. నేడు ఇరాన్‌లో అంతర్గత సంక్షోభం కొనసాగుతోంది. ఇరాన్‌లోని 180కి పైగా నగరాల్లో ప్రజల నిరసనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఖుమేనీ పాలనకు వ్యతిరేకంగా నిరసన సెగలు పెరగడంతో ఆందోళనకారులను అదుపుచేసే మిషతో సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. కాల్పులు జరపడంతో 648కి పైగా ప్రాణాలు గాల్లో కలిసాయని బీబీసీ వెల్లడించింది. దాదాపు 550 మందికి పైగా నిరసనకారులు, 60 మందికి పైగా భద్రతా సిబ్బంది మరణించగా, దాదాపు 11,000 మంది అరెస్టు అయ్యారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవసరమైతే ఇరాన్‌పై సైనిక చర్యకు వెనకాడమని హెచ్చరికలు చేస్తున్నారు. నిరసనకారులపై సైనిక చర్యలు కొనసాగిస్తే ఇరాన్‌పై యుద్ధానికి దిగాల్సి వస్తుందని ట్రంప్ అంటున్నారు.
కొనసాగుతున్న అంతర్గత పోరు
ఇరాన్ అంతర్గత సంక్షోభానికి ప్రధాన కారణం విపరీతంగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు అని గమనించాలి. గత రెండు వారాలుగా కొనసాగుతున్న ఆందోళనలను ప్రభుత్వం అణచివేయడం, ఆందోళనకారులపై సైన్యం జరుపుతున్న కాల్పుల్లో దాదాపు 650 మందికి పైగా సామాన్య ప్రజలు చనిపోవడం జరిగింది. ఈ మారణహోమం ఇంకా కొనసాగడం చూస్తున్నాం. ఇరాన్‌లో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తీవ్రరూపం దాల్చడం, సైనికుల కాల్పుల్లో ప్రజలు మరణించడాన్ని తీవ్రంగా తీసుకున్న అమెరికా తాము జోక్యం చేసుకుంటామని తెలిపింది. అవసరమైతే ఇరాన్‌పై యుద్ధం కూడా చేయడానికి వెనకాడమని ప్రకటించింది. దీంతో ఇరాన్ ప్రభుత్వం కూడా తాము అమెరికాతో యుద్ధానికి సిద్ధమని తెలిపింది.
శాంతి పావురం రక్తసిక్తం
నేడు ఇరాన్‌లో దాదాపు 11,000 మంది ప్రవాసీ భారతీయులు ఉన్నారు. వారి భద్రత నిమిత్తం మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అమెరికాతో యుద్ధానికైనా, చర్చలకైనా తాము సిద్ధం అంటూ అగ్రరాజ్యాన్ని ఎదిరించే సత్తాలేని ఇరాన్ సవాలు విసురుతున్నది. అమెరికాతో యుద్ధమే జరిగితే ఒకవైపు ఇజ్రాయెల్, మరోవైపు అమెరికా ధాటికి ఇరాన్ నేల మట్టం కావడం, అక్కడి ప్రభుత్వం తలవంచడం తప్పకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏదీ ఏమైనా ప్రపంచ శాంతి ప్రశ్నార్థకం అయ్యింది. నేడు కొనసాగుతున్న ఇజ్రాయెల్– -పాలస్తీనా, రష్యా-– ఉక్రెయిన్ యుద్ధాలతోపాటు వెనెజువెలా అధ్యక్షుడిని అరెస్టు చేసి తానే అధ్యక్షుడిని అంటున్న ట్రంప్ వ్యాఖ్యలు ప్రపంచ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గ్రీన్‌ల్యాండ్‌ను కొంటానంటున్న అమెరికా,... ఇరాన్‌లో నేడు జరుగుతున్న అంతర్గత పోరులాంటి విధ్వంసాలతో ప్రపంచ శాంతి పావురం రక్తసిక్తం అవుతున్నది. అమెరికా తీసుకుంటున్న అసాధారణ చర్యలకు ప్రపంచం విలవిల్లాడుతోంది. ఈ దుస్థితులకు సత్వరమే పరిష్కారాలు దొరకాలని, ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొనాలని కోరుకుందాం.
చుక్కలనంటిన ధరలు
ఇరాన్ కరెన్సీ కుప్పకూలిపోయింది. నిత్యావసర సరుకుల ధరలు చుక్కలను తాకుతున్నాయి. బస్తాల కొద్దీ డబ్బు (రియాల్స్) తీసుకెళితే దోసెడు సరుకులు కూడా రావడం లేదు. అక్కడి ప్రభుత్వం సబ్సిడీలకు బదులు ప్రజల చేతికి డబ్బులు (ప్రతి నెల తలసరి 10 మిలియన్ రియాల్స్, అనగా
7 డాలర్లు) పంచుతున్నారు. ఉత్పత్తులు అడుగంటాయి, ఆహార ధరలు భగ్గుమంటున్నాయి. 1979లో డాలరుకు 70 రియాల్స్ ఉన్నప్పటికీ నేడు ఒక్క డాలర్‌కు 14.2 లక్షల రియాల్స్‌కు పతనం అయ్యింది. ఈ నిరసనలతో ధరలు 50 నుంచి 100 శాతం వరకు పెరిగాయి. నేడు 42 శాతం ద్రవ్యోల్బణంతో ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా జనులు వీధుల్లో కదం తొక్కుతున్నారు. ఇలాంటి ఆర్థిక సంక్షోభం నెలకొన్న ఇరాన్‌లో ప్రజలు మరో మార్గం లేక ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలకు పూనుకున్నారు. ఇజ్రాయెల్‌తో ఇరాన్ చేస్తున్న యుద్ధంతోపాటు అమెరికా విధించిన ఆంక్షలతో ఇరాన్ నేడు ఆర్థిక ఊబిలోకి దిగజారిపోతున్నది. ఒక ట్రే గుడ్ల ధర 35 లక్షల రియాల్స్, లీటరు వంట నూనె ధర 18 లక్షల రియాల్స్‌కు చేరడం అక్కడి ప్రజల దుస్థితిని సూచిస్తున్నది. ప్రజల కొనుగోలు సామర్థ్యం క్షీణించింది.
- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
