కరోనాను ఎదుర్కోవడంలో ‘ధారావి’ భేష్: డబ్ల్యూహెచ్‌వో

కరోనాను ఎదుర్కోవడంలో ‘ధారావి’ భేష్: డబ్ల్యూహెచ్‌వో

న్యూఢిల్లీ: ఆసియాలోని అతి పెద్ద మురికివాడ అయిన ధారావి కరోనా వైరస్‌ను చాలా సమర్థంగా ఎదుర్కొందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మెచ్చుకుంది. దూకుడుగా, సమర్థంగా వ్యవహరించడం ద్వారా కరోనాను నిలువరించొచ్చని ఇటలీ, స్పెయిన్, సౌత్‌ కొరియా, ధారావిలు నిరూపించాయని డబ్ల్యూహెచ్‌వో చీఫ్​ ట్రెడోస్ అధనామ్ గెబ్రెసస్ చెప్పారు.

‘గత ఆరు వారాల్లో కరోనా కేసులు రెట్టింపయ్యాయి. అయితే వైరస్ వ్యాప్తి తీవ్రమైనా దాన్ని అంతే సమర్థంగా ఎదుర్కోవచ్చునని కొన్ని ఉదాహరణలు చెబుతున్నాయి. ఇప్పుడు కూడా పరిస్థితిని అదుపు చేయొచ్చు. నేను చెప్పిన ఎగ్జాంపుల్స్‌లో ఇటలీ, స్పెయిన్, సౌత్ కొరియాతోపాటు ధారావి కూడా ఉంది. ముంబైలో చాలా ఎక్కువ మంది ప్రజలతో నిండిన ఏరియా ఇది. టెస్టింగ్, ట్రేసింగ్, ఐసోలేషన్, ట్రీట్‌మెంట్ అందించడం, కమ్యూనిటీకి సోకకుండా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం ద్వారా వైరస్ సోకే అన్ని చైన్స్‌ను అక్కడ బ్రేక్ చేశారు’ అని ట్రెడోస్ పేర్కొన్నారు.

ధారావిలో ఏప్రిల్‌లో 491 కేసులు నమోదయ్యాయి. బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తగు జాగ్రత్త చర్యలను యుద్ధ ప్రాతిపదికన తీసుకోవడంతో పరిస్థితి వేగంగా అదుపులోకి వచ్చింది. మేలో 4.3 శాతం, జూన్‌లో 1.02 శాతం కేసులు తగ్గాయి. బస్తీలోని 47,500 మందికి డాక్టర్లు, ప్రైవేట్ క్లినిక్ సిబ్బంది స్క్రీనింగ్ నిర్వహించారు. 14,970 మందిని మొబైల్ వ్యాన్స్‌లో స్క్రీనింగ్ చేశారు. మొత్తం మీద 4,76,775 మంది ప్రజలను బీఎంసీ హెల్త్ వర్కర్స్ శ్రమతో కాపాడటం గమనార్హం.