టీకాను ఎదుర్కొనే వేరియంట్ పుట్టలె

టీకాను ఎదుర్కొనే వేరియంట్ పుట్టలె
  • డబ్ల్యూహెచ్‌‌‌‌వో చీఫ్ టెడ్రోస్

జెనీవా: కరోనాకు అందుబాటులోకి వచ్చిన టీకాలను ఎదుర్కొనే వైరస్ వేరియంట్ ఇప్పటి వరకు పుట్టలేదని డబ్ల్యూహెచ్ వో చీఫ్​ టెడ్రోస్ అథనామ్ ఘెబ్రియాస్ తెలిపారు. అయితే భవిష్యత్తుల్లో అలాంటి రకాలు వెలుగుచూడవని కచ్చితంగా చెప్పలేమన్నారు. వైరస్ ఎప్పటికప్పుడు కొత్తరూపు సంతరించుకుంటోందని పేర్కొన్నారు. అన్ని దేశాలు వ్యాక్సినేషన్​ను స్పీడప్ చేయాలని ఆయన సూచించారు. సెప్టెంబర్ నాటికి ప్రతి దేశం తమ జనాభాలో కనీసం 10% మందికి, ఈ ఏడాది చివరి వరకు 30% మందికి వ్యాక్సిన్ వేయడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. వ్యాక్సిన్ల పంపిణీలో ఇప్పటికీ అసమానతలు కొనసాగుతున్నాయని టెడ్రోస్ ఆందోళన వ్యక్తంచేశారు. తాము చెప్పినట్లు ప్రాధాన్య క్రమంలో టీకాలు అందించి ఉంటే.. ముందుండి పోరాడుతున్న అన్ని వర్గాలకు ఇప్పటిదాకా పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందేదన్నారు. 

కొన్ని దేశాల దగ్గరే ఎక్కువ టీకాలు..
కొన్ని దేశాలే అత్యధిక టీకాలను కొనుగోలు చేశాయని టెడ్రోస్ చెప్పారు. ఆయా దేశాలు చిన్నారులు, వైరస్ ముప్పు తక్కువున్న వర్గాలకూ వ్యాక్సిన్లు వేస్తున్నాయని తెలిపారు. దీంతో ఇతర దేశాల్లో వైరస్ సోకే ప్రమాదం ఎక్కువున్న వర్గాలకు టీకాలు అందడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా విషయంలో మెరుగైన స్థితిలో ఉన్న దేశాలు చిన్నారులకు వ్యాక్సిన్లు వేయడం ఆపేసి, వాటిని వైరస్ తో కొట్టుమిట్టాడుతున్న దేశాలకు పంపాలని కోరారు. డబ్ల్యూహెచ్ వో ఆధ్వర్యంలో వ్యాక్సిన్ల పంపిణీ కోసం ఏర్పాటు  చేసిన కొవాక్స్ ద్వారా ఇప్పటి వరకు 124 దేశాలకు 7 కోట్ల డోసులు అందజేసినట్లు వెల్లడించారు. అయితే అవి ఆయా దేశాల్లోని మొత్తం జనాభాలో 0.5% మందికే  సరిపోతాయన్నారు.