సీఎంకు వీడియోలు ఎవరిచ్చారు..రోహిత్‌‌రెడ్డిని ప్రశ్నించిన హైకోర్టు

సీఎంకు వీడియోలు ఎవరిచ్చారు..రోహిత్‌‌రెడ్డిని ప్రశ్నించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీఎం మీడియా సమావేశంలో చూపిన వీడియోలను తాను ఇవ్వలేదని హైకోర్టుకు ఎమ్మెల్యే రోహిత్‌‌రెడ్డి చెప్పారు. దర్యాప్తుకు చెందిన వీడియోలను తనకు కేసు దర్యాప్తు ఆఫీసర్లు కూడా ఇవ్వలేదన్నారు. ఈ మేరకు ఆయన తరపు లాయర్‌‌ ప్రభాకర్‌‌ శుక్రవారం హైకోర్టుకు వెల్లడించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి బదిలీ చేయాలని బీజేపీ స్టేట్‌‌ జనరల్‌‌ సెక్రటరీ ప్రేమేందర్‌‌రెడ్డి, నిందితులు రామచంద్ర భారతి, తుషార్, శ్రీనివాస్, నందకుమార్, సింహయాజి వేసిన రిట్‌‌ పిటిషన్లలో అనుబంధ పిటిషన్లపై (ఐఏ) వాదనలు ముగిశాయి. ఐఏలపై తీర్పును తర్వాత చెబుతామని జస్టిస్‌‌ విజయ్‌‌సేన్‌‌ రెడ్డి తెలిపారు. మీడియా సమావేశంలో సీఎం వెల్లడించిన వీడియోలంటూ వాళ్లు వేసిన ఐఏలను పరిగణనలోకి తీసుకోరాదని ప్రభుత్వ అడ్వకేట్  కోరారు. ఐటీ యాక్ట్‌‌లోని రూల్‌‌ 65 బీ ప్రకారం పిటిషనర్లు అఫిడవిట్‌‌ వేయాలన్నారు. అఫిడవిట్‌‌ వేసేందుకు పిటిషనర్లకు శుక్రవారం సాయంత్రం వరకు హైకోర్టు సమయం ఇచ్చింది. శ్రీనివాస్, తుషార్‌‌ వేర్వేరుగా అఫిడవిట్లు వేశాక తిరిగి విచారణ జరిగింది. ఈ సందర్భంగా జడ్జి స్పందిస్తూ.. మీడియాలో సీఎం వీడియోలు చూపినవి ఎవరిచ్చారని, దర్యాప్తు అధికారి ఏమైనా ఫిర్యాదుదారుకు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఐఏలపై తీర్పును హైకోర్టు రిజర్వులో పెట్టింది.

సిట్​కు హైకోర్టు నోటీసులు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముందస్తు బెయిల్‌‌ మంజూరు చేయాలని కేరళ డాక్టర్‌‌ జగ్గు కొట్టిలిల్‌‌ (జగ్గుస్వామి) సోదరుడు మణిలాల్‌‌ వేసిన పిటిషన్‌‌లో సిట్‌‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్‌‌ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌‌ ఇచ్చిన 41ఏ సీఆర్‌‌పీసీ నోటీసుల్లో అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని మణిలాల్‌‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జడ్జి జస్టిస్‌‌ చిల్లకూరు సుమలత శుక్రవారం విచారణ జరిపారు. విచారణను 23కి వాయిదా వేశారు.

నందకుమార్​పై చీటింగ్ కేసు

ఖైరతాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడుగా ఉన్న నందకుమార్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. సికింద్రాబాద్​కు చెందిన శ్రీనివాస్ అనే ఇంటీరియర్ డిజైనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. నందకుమార్​తో రూ.25 లక్షలకు తాను చేసుకున్న ఒప్పందం ప్రకారం డెక్కన్ కిచెన్ కు ఇంటీరియర్ పనులు పూర్తి చేశానని, కానీ, నందకుమార్ రూ.10 లక్షలు ఇచ్చి మిగతావి ఇవ్వట్లేదని శ్రీనివాస్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు వివరించారు. దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా, భూమి విషయంలో డబ్బులు తీసుకుని మోసం చేశాడంటూ నందకుమార్​పై సిండేకర్ సతీష్ అనే వ్యక్తి గతంలో కేసు పెట్టాడు. ఈ కేసులో విచారణ కోసం నందకుమార్​ను కోర్టు రెండ్రోజుల కస్టడీకి అప్పగించింది. ఈ మేరకు నంద కుమార్​ను విచారించేందుకు శనివారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్​కు తీసుకురానున్నారు.