తప్పు ఎవరిది? శిక్ష ఎవరికి?

తప్పు ఎవరిది? శిక్ష ఎవరికి?

లెటర్​ టు ఎడిటర్​: రా ష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఎస్ఎస్సీ  పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజీ, మాల్ ప్రాక్టీస్​ల పేరుతో దుమారం చెలరేగి గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎస్ఎస్సీ పరీక్షలు రాజకీయ రంగు పులుముకున్నాయి.  ఈ అల్ప సంఘటన రాజకీయ సుడిగుండంగా మారి రాష్ట్రాన్ని కుదిపివేసింది.  ఇక్కడ జరిగిన సంఘటనల పరంపరను గమనిస్తే అధికారుల నిర్లిప్తత, బాధ్యతా రాహిత్యం, నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.

వీటిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి సరిదిద్దకపోతే భవిష్యత్తులోనూ ఈ లోపాలు పునరావృతమై విద్యార్థుల భవిష్యత్తు  గొడ్డలిపెట్టుగా మారుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సజావుగా పరీక్షల నిర్వహణకు ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్ ను నియమిస్తారు. ఆయన పరీక్షా కేంద్రం నిర్వహణ తీరుకు బాధ్యత వహిస్తారు. ఆయనకు తోడుగా  డిపార్ట్మెంటల్ అధికారిని సైతం నియమిస్తారు.

ఈయన పరీక్షా కేంద్రానికి సప్లై చేయబడిన ప్రశ్న పత్రాలను లెక్కించి సమయం ప్రకారం వాటిని ఇన్విజిలేటర్లకు అందించి మిగిలిన వాటిని భద్రపరుస్తారు. పరీక్ష హాలులో నియామకమైన ఇన్విజిలేటర్లు గదిలో కాపీ జరగకుండా చూస్తూ ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్ష రాసుకునే విధంగా చర్యలు చేపడతారు. సిబ్బంది నియామకంలో అక్రమాలు జరిగాయని తద్వారా ఈ అవకతవకలకు ఆస్కారం ఏర్పడిందని పలువురు భావిస్తున్నారు.  

ఇష్టం వచ్చినట్టుగా  అడ్డదిడ్డమైన రీతిలో సిబ్బంది నియామకాలు జరిగినట్టు తెలుస్తోంది. కొందరు ఉపాధ్యాయులను మౌఖిక ఆదేశాలతో పరీక్షా కేంద్రాల్లో నియమించడం విచిత్రం.  ఇలాంటి అస్తవ్యస్త నిర్వహణ ఫలితంగానే  కమలాపూర్ పరీక్ష కేంద్రాల్లో  సంఘటన జరిగి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొందరు అధికారుల ఇష్టారీతి వల్ల ఉపాధ్యాయులు బలి కావల్సివస్తుందని  చెప్పొచ్చు.
- రావుల రాజేశం, కరీంనగర్​