తమిళిసైపై తమిళచ్చి పోటీ.. ఇంతకీ ఎవరీమె?

తమిళిసైపై తమిళచ్చి పోటీ.. ఇంతకీ ఎవరీమె?

తెలంగాణ గవర్నర్ పదవికి  రాజీనామా చేసిన తమిళిసై సౌందరరాజన్  పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడులోని సౌత్ చెన్నై నుంచి ఆమె బరలోకి దిగుతున్నారు. ఈమెకు పోటీకి  డీఎంకే పార్టీ తమిళచ్చి తంగపాండియన్‌ బరిలోకి దింపింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. 

ఎవరీ తమిళచ్చి తంగపాండియన్‌ ?   

అధికార డీఎంకే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న తమిళచ్చి తంగపాండియన్‌... సౌత్ చెన్నై నుంచి సిట్టింగ్ ఎంపీ.  అంతేకాకుండా స్టాలిన్ కేబినేట్ లో మంత్రిగా ఉన్న  తంగం తెన్నరసుకు సోదరి కావడం విశేషం.  గత పార్లమెంట్ ఎన్నికల్లో సుమారు 1.40 లక్షల ఓట్ల ఆధిక్యతతో ఆమె గెలిచారు.  రాజకీయాల్లోకి రాకముందు ఆమె చెన్నైలోని క్వీన్ మేరీస్ కాలేజీలో ఆంగ్లంలో లెక్చరర్‌గా పనిచేశారు. ఈమె మంచి రచయిత కూడా.  పారిస్ ప్యారిస్ చిత్రానికి తంగపాండియన్ డైలాగులు రాశారు.  మరోసారి డీఎంకే పార్టీ కూడా ఈమెకే టికెట్ ఇచ్చింది. అధికార పార్టీ కావడం,  డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఎండీఎంకే, మక్కళ్‌ నీది మయ్యం వంటి పార్టీలు ఉండటం ఆమెకు కలిసోచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు.  

తమిళిసైకి గట్టి పోటీ

 బీజేపీ తరుపున  చెన్నై సౌత్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న తమిళిసై సౌందరరాజన్ కు ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఉందనే చెప్పాలి.  అధికార డీఎంకే నుంచి  తమిళచ్చి  పోటీలో ఉండగా..  అన్నాడీఎంకే  పార్టీ నుంచి  జయవర్థన్‌ ఇదే నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు.  2014లో ఆయన ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు.  2019 ఎన్నికల్లో ఓడిపోయారు.  వృత్తిరీత్యా వైద్యుడైన జయవర్థన్‌ అన్నాడీఎంకే సీనియర్‌ నేత, మాజీ మంత్రి జయకుమార్‌ తనయుడిగా గుర్తింపు కూడా ఉంది. దీంతో ఇద్దరు బలమైన ప్రత్యర్థులతో  తమిళిసైకి ఇక్కడ గట్టి పోటీ ఉందనే చెప్పాలి. ఈ ముగ్గురిలో ఎవరు విజయం సాధిస్తారో తెలియాలంటే జూన్  4 వరకు ఆగాల్సిందే.