బీఆర్ఎస్కు రూ. 28.75 కోట్లు ఇచ్చిన అజ్ఞాత దాత

బీఆర్ఎస్కు రూ. 28.75 కోట్లు ఇచ్చిన అజ్ఞాత దాత
  • 195 కోట్లు ఇచ్చిన మేఘా
  • ఫార్మా కంపెనీల వాటాయే అధికం
  • ఆ తర్వాతి స్థానంలో రియల్ ఎస్టేట్ సంస్థలు
  •  క్విడ్ ప్రోకో పైనా అనుమానాలు


హైదరాబాద్: ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో దాతల పేర్లు బయటికి వచ్చాయి. బీఆర్ఎస్ కు మొత్తం రూ. 1,322 కోట్లు బాండ్ల రూపంలో వచ్చాయి. బీఆర్ఎస్ కు డొనేషన్లు ఇచ్చన వారిలో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ కంపెనీ రెండు దఫాలుగా 195 కోట్ల రూపాయలను విరాళంగా అందించింది. ఓ అనౌన్ డోనర్ 28.75 కోట్ల రూపాయలను బీఆర్ఎస్ కు అందించడం చర్చనీయాంశంగా మారింది. జాబితాలో అందరి పేర్లు కనిపిస్తున్నారు.. ఏడో నంబర్ గడిలో అనౌన్ డోనర్.. బ్రాకెట్లో నాట్ అవైలబుల్ అని ఉంది.  ఇంతకూ ఎవరా అనౌన్ డోనర్ అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ హయాంలో నిర్మితమైన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు కాంట్రాక్టుల్లో మేఘా సంస్థ పనులు చేసింది. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు పనులు సైతం మేఘా కంపెనీకే దక్కడం గమనార్హం. ఈ సంస్థ 195 కోట్ల సమర్పించుకోవడం విశేషం.  ఆ తర్వాత స్థానంలో ఫార్మా కంపెనీలు నిలిచాయి. హెటిరో డ్రగ్స్ నుంచి రెండు దఫాలుగా యాభై కోట్ల రూపాయలు విరాళంగా వచ్చాయి. 

అయితే ఈ సంస్థ ఎండీకి రాజ్యసభ ఎంపీ పదవి దక్కడం గమనార్హం. మూడో స్థానంలో రియల్ ఎస్టేట్ సంస్థలు ముందున్నాయి. ఇందులో ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి సమీప బంధువుకు సంబంధించిన రాజ్ పుష్ప ప్రాపర్టీస్  ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. ఈ సంస్థ  బీఆర్ఎస్ పార్టీకి రూ. 20  కోట్లు బాండ్ల రూపంలో  సమర్పించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు మూడు దఫాలుగా బీఆర్ఎస్ పార్టీకి వెయ్యి కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో రావడం విశేషం. కరోనా కష్టసమయంలో రెట్టింపు ధరలకు మందులు, ఇంజక్షన్లు అమ్ముకున్న సంస్థలన్నీ అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీకి నిధుల వరద పారించినట్టు తెలుస్తోంది.  ప్రతి ఉప ఎన్నికకు ముందు గులాబీ పార్టీకి  విరాళాల రూపంలో భారీగా నిధులు వచ్చాయి. 2021లో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందు రూ.85 కోట్లు బాండ్లుగా వచ్చాయి. 2022లో మునుగోడు ఉప ఎన్నికలకు ముందు 92 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒకే రోజు 663 కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో రావడం గమనార్హం. 

క్విడ్ ప్రోకో జరిగిందా..?

ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో భారీగా డబ్బును విరాళంగా ఇచ్చిన సంస్థలకు గులాబీ పార్టీ ఎలాంటి మేలు చేసి ఉంటుంది..? సదరు సంస్థ వ్యాపారాలేంటి..? అన్న అంశాలు చర్చకు వస్తున్నాయి. విరాళాలు అందించి తమ పనులను చేయించుకున్నారా..? అన్నది హాట్ టాపిక్ గా మారింది.  కాళేశ్వరం  ప్రాజెక్టు నిర్మాణంలో కీలక భాగస్వామిగా ఉన్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్టక్చర్ కంపెనీ రెండు దఫాలుగా 195 కోట్ల రూపాయలను బాండ్ల రూపంలో ఇవ్వడం గమనార్హం. కరోనా కష్టకాలంలో ప్రజలపై పెనుభారం మోపుతూ ఇష్టం వచ్చిన ధరలకు రెమిడెసివిర్ ఇంజక్షన్లు అమ్మకున్న సంస్థలు కూడా అప్పటి అధికార పార్టీకి భారీగానే విరాళాలు అందించాయని తెలుస్తోంది. జవహర్ లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు ను 30  సంవత్సరాలపాటు లీజుకు తీసుకున్న ఆర్బీఐ ఇన్ ఫ్రా కంపెనీ రూ. 25 కోట్ల రూపాయలను విరాళంగా అందించింది. ఇవన్నీ చూస్తుంటే భారీ ఎత్తున క్విడ్ ప్రోకో జరిగిందా..? అన్నది హాట్ టాపిక్ గా మారింది. 

ఎన్నికల వేళ డబ్బుల వరద

ప్రతి ఎన్నికల సమయంలో గులాబీ పార్టీకి నిధులు వరదలా వచ్చాయి. ఇవన్నీ బాండ్ల రూపంలో వచ్చినవే. 2018 నుంచి 2023 వరకు మూడు ఉప ఎన్నికలు జరిగాయి. 2021లో దుబ్బాక ఎమ్మెల్యే  సోలిపేట రాంలింగారెడ్డి మరణంలో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. అదే  ఏడాది ఈటల రాజీనామాతో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక జరిగింది ఈ రెండు ఉప ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 85 కోట్ల రూపాయలు రావడం గమనార్హం. 2022లో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ కూడా ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీకి రూ. 92 కోట్లు విరాళంగా వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 881 కోట్ల రూపాయలు అధికార పార్టీకి విరాళంగా వచ్చాయి.

Also Read :కేజ్రీవాల్ కింగ్ పిన్.. 28 పేజీల రిమాండ్ రిపోర్ట్