
- రూ.100 కోట్లు కాదు రూ. 600 కోట్ల కుంభకోణం
- కవిత వాంగ్మూలం తీసుకున్న తర్వాతే అరెస్ట్
- రూ. 45 కోట్ల హవాలా ద్వారా గోవాకు పంపారు
- వివరాలు రాబట్టేందుకు 10 రోజులు కస్టడీకి ఇవ్వండి
- రౌస్ అవెన్యూ కోర్టుకు ఈడీ విజ్ఞప్తి
ఢిల్లీ: లిక్కర్ స్కాం వ్యవహారంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కింగ్ పిన్ లా వ్యవహరించారని ఈడీ తెలిపింది. ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టుకు 28 పేజీల రిమాండ్ రిపోర్టును అందించింది. ఇది రూ. 100 కోట్ల కుంభకోణం కాదని, మొత్తం 600 కోట్లదని పేర్కొంది. కేజ్రీవాల్ పాత్రపై తమ కస్టడీలో ఉన్న తెలంగాణ ఎమ్మెల్సీ కవిత వాంగ్మూలాన్ని రికార్డు చేశామని రిపోర్టులో పేర్కొంది. రూ. 45 కోట్లను హవాలా ద్వారా గోవా కు పంపారని తెలిపింది. నాలుగు రూట్ల ద్వారా ఈ డబ్బులు గోవాకు చేరాయని వివరించింది. విజయ్ నాయర్ కంపెనీ నుంచి అన్ని ఆధారాలను సేకరించామని తెలిపింది. తమ దగ్గర ఇందుకు సంబంధించిన ఆధారాలున్నాయని వివరించింది. ఆప్ కు సౌత్ గ్రూప్ నకు మధ్యన విజయ్ నాయర్ వారధిగా ఉన్నారని పేర్కొన్నది.
కోర్టుకు కేజ్రీవాల్
నిన్న అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్ లోని స్పెషల్ సీబీఐ కోర్టు జడ్జి కావేరి బవేజా ఎదుట హాజరు పర్చారు ఈడీ అధికారులు. ఈడీ తరఫున జోహెబ్ హుస్సేన్, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కౌన్సిల్ గా ఉన్నారు. ,రమేష్ గుప్తా, విక్రమ్ చౌదరి కూడా కేజ్రీవాల్ తరఫున వాదనలు వివరిపించారు. నిన్న రాత్రి 9.05 గంటలకు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశామని, 24 గంటలలోపే కోర్టులో ప్రవేశపెట్టామని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టుకు తెలిపారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ లోని సెక్షన్ 19 ప్రకారం కేజ్రీవాల్ ను అరెస్టు చేసినట్టు బెంచ్ కు వివరించారు. అరెస్టు విషయాన్ని బంధువులకు తెలిపామని చెప్పారు. రిమాండ్ కాపీని కూడా అందించామని తెలిపారు.