ప్రపంచంలోని కరోనా కేసుల్లో సగం మన దగ్గరే..

ప్రపంచంలోని కరోనా కేసుల్లో సగం మన దగ్గరే..
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వీక్లీ రిపోర్టు 
  • దేశంలో ఒక్కరోజే 3.82 లక్షల కేసులు
  • 24 గంటల్లో 3,780 మంది మృతి
  • ఉత్తరాఖండ్‌లో ఆక్సిజన్‌ అందక ఐదుగురు మృతి

న్యూఢిల్లీ: కరోనా సెకండ్‌‌‌‌ వేవ్‌‌‌‌తో ఇండియా కుదేలవుతోంది. రోజూ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. గత వారం రోజులుగా ప్రపంచవ్యాప్తంగా నమోదైన కొత్త కేసుల్లో 50 శాతం ఇండియావేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. వారంలో నమోదైన మరణాల్లో 25 శాతం భారత్‌‌‌‌లోనే చనిపోయారని, ప్రతి నలుగురిలో ఒకరు ఇండియాలోనే మరణిస్తున్నారని తెలిపింది. ఆసియాలో రికార్డవుతున్న కేసుల్లో 90 శాతం ఇండియాలోనే నమోదవుతున్నాయంది. ఇందుకు సంబంధించి గతం వారం నివేదికను విడుదల చేసింది. 
మహారాష్ట్రలో ఒక్కరోజే 891 మంది మృతి
దేశంలో రెండు వారాలుగా రోజుకు 3 లక్షలపైనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే 3.82 లక్షల మంది వైరస్‌‌‌‌ బారిన పడ్డారు. ఇందులో మహారాష్ట్రలో 51,880, కర్నాటకలో 44,631, కేరళలో 37,190, ఉత్తరప్రదేశ్‌‌‌‌లో 25,770 కేసులు రికార్డయ్యాయి. 5 రాష్ట్రాల్లోనే దాదాపు 50 శాతం కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కేసులు 2.06 కోట్లు దాటాయి. ప్రస్తుతం యాక్టివ్‌‌‌‌ కేసులు 34.87 లక్షలున్నాయి. 12 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్‌‌‌‌ కేసులు నమోదయ్యాయి. కరోనాతో గత 24 గంటల్లో 3,780 మంది చనిపోయారు. ఇందులో మహారాష్ట్రలో 891, ఉత్తరప్రదేశ్‌‌‌‌లో 351 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాలు 2.26 లక్షలయ్యాయి. ఇప్పటివరకు 1.69 కోట్ల మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 3.38 లక్షల మంది రికవర్‌‌‌‌ అయ్యారు.
ఆక్సిజన్‌‌‌‌ అందక ఐదుగురు మృతి
ఆక్సిజన్ కొరతతో ఉత్తరాఖండ్‌‌‌‌ రూర్కీలోని ఓ ప్రైవే టు ఆస్పత్రిలో ఐదుగురు కరోనా రోగులు బుధవారం మరణించారు. అర్ధరాత్రి  సిలిండర్లు అయిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. దీనిపై హరిద్వార్ జిల్లా మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. 
లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ పెట్టాలి: ప్రతిపక్షాలు
దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో చాలా హాస్పిటళ్లలో బెడ్లు, ఆక్సిజన్‌‌‌‌ దొరకట్లేదు. చాలా మంది పేషెంట్లు ఆక్సిజన్‌‌‌‌ కోసం వెయిట్‌‌‌‌ చేస్తూ అంబులెన్సులు, కార్ పార్కింగ్‌‌‌‌లలోనే చనిపోతున్నారు. శ్మశానాల్లో హౌస్‌‌‌‌ఫుల్‌‌‌‌ బోర్డులు పెడుతున్నారు. కరోనా సెకండ్‌‌‌‌ వేవ్‌‌‌‌ కట్టడికి మోడీ సర్కారు సరైన చర్యలు తీసుకోలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ పెట్టాలని డిమాండ్‌‌‌‌ చేశాయి. ప్రభుత్వం మాత్రం ఎకానమీ దెబ్బతింటుందని భయపడుతోందని విమర్శించాయి. దేశంలో ప్రాణ వాయువు కరువైందని, సర్కారు పట్టించుకోవట్లేదని, మోడీ దిగిపోవాలని రైటర్‌‌‌‌ అరుంధతి రాయ్‌‌‌‌ విమర్శించారు. కేసులు పెరుగుతుండటంతో అప్పులు తీసుకున్న వాళ్లకు కట్టడానికి కొంత టైమివ్వాలని ఆర్బీఐ బుధవారం బ్యాంకులను కోరింది. దేశంలో కేసులు, మరణాలు అధికారిక లెక్కల కన్నా 10 రెట్లు ఎక్కువుంటాయని ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ చెబుతున్నారు. ఇండియాలో ఇప్పట్లో హెర్డ్‌‌‌‌ ఇమ్యూనిటీ వచ్చే అవకాశంలేదని, అయితే మరో 6 నుంచి 9 నెలల్లో హాస్పిటళ్లపై ఒత్తిడితో పాటు, మరణాలు తగ్గుతాయని చెప్పారు.
హిమాచల్​లో లాక్​డౌన్
కరోనా కట్టడికి హిమాచల్​ప్రదేశ్​లో లాక్​డౌన్​ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం నుంచి ఈ నెల 16 వరకు అంటే పదిరోజుల పాటు లాక్​డౌన్​ అమలులో ఉంటుందని ప్రకటించింది. బుధవారం సీఎం జైరామ్​ ఠాకూర్​ అధ్యక్షత జరిగిన రాష్ట్ర కేబినెట్​ మీటింగ్​లో ఈ నిర్ణయం తీసుకున్నారు. 
మంత్రులు జిల్లాల్లోనే ఉండాలె: కర్నాటక సీఎం
కర్నాటకలో కరోనా కేసులు భీకరంగా పెరుగుతుండటంతో మంత్రులంతా జిల్లాల్లోనే ఉండి స్థానికంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర సీఎం యడియూరప్ప ఆదేశించారు. ప్రధాని మోడీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని బుధవారం మీడియాతో అన్నారు.