స్వామినాథన్ వ్యవసాయంలో చేసిన అద్భుతం ఇదీ.. కోట్ల మంది ప్రాణాలు కాపాడారు..!

స్వామినాథన్ వ్యవసాయంలో చేసిన అద్భుతం ఇదీ.. కోట్ల మంది ప్రాణాలు కాపాడారు..!

అవి స్వాతంత్య్రం వచ్చిన రోజులు. దేశంలో ఆహార కొరత ఉంది. ఆకలితో కోట్ల మంది చనిపోతున్నారు. విదేశాల నుంచి ఆహార ధాన్యాలు తెచ్చుకోవాలంటే దేశం దగ్గర డబ్బులు లేవు.. దేశంలో కావాల్సినంత భూమి.. రైతుల్లో సత్తా ఉంది.. కాకపోతే మార్గ నిర్దేశం లేదు. ఇలాంటి సమయంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు అవసరం అని భావించారు స్వామినాథన్. అప్పటికే వ్యవసాయ రంగంపై విదేశాల్లోనూ పరిశోధనలు చేసిన అనుభవం ఉండటంతో.. అప్పటి కేంద్ర ప్రభుత్వాలు స్వామినాథన్ కు బాధ్యతలు అప్పగించాయి. 

దేశంలో ఆకలి చావులు ఉండకూడదు అంటే వెంటనే తక్కువ సమయంలో.. తక్కువ విస్తీర్ణంలో.. ఎక్కువ పంటలు పండే విత్తనాలు కావాలని భావించారు. ఈ క్రమంలోనే మొదటగా నాలుగు ఆహార పంటలపై దృష్టి పెట్టారు. వరి, గోధుమ, ఆలు గడ్డ, జనుము పంటల సాగును ప్రోత్సహించారు. ఎక్కువ పంట దిగుబడి ద్వారా రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా కొత్త విత్తనాలను తయారు చేశారు. దీని వల్ల  ఐదేళ్లలోనే అంటే 1957 నుంచి 1965వ సంవత్సరం నాటికి.. అంటే ఏడేళ్లలోనే భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ప్రతి ఒక్కరికీ బియ్యం, గోధుమలతోపాటు కనీస కూరగాయ అయిన ఆలు గడ్డలు అందుబాటులోకి వచ్చాయి. తద్వారా ఆకలి చావులు తగ్గాయి. 

ఏదో ఒక పంట అని కాకుండా.. జనం బతకటానికి కావాల్సిన కనీస ఆహార పంటల్లో వరి, గోధుమ, ఆలు గడ్డలో ఆయన చేసిన ప్రయోగాలు విజయవంతం అయ్యాయి. అప్పటి వరకు ఆరు నెలలుగా ఉన్న వరి పంట.. స్వామినాథన్ ప్రయోగాలతో 90 రోజులకు తగ్గింది. దీంతో రెండు పంటల వైపు రైతులు మళ్లారు. దిగుబడులు పెరిగాయి.. అందరికీ ఆహారం అందుబాటులోకి వచ్చింది. ఎండ, వానలకు తట్టుకుని నిలబడే సరికొత్త వంగడాలను సృష్టించారు. అదే విధంగా తక్కువ నీళ్లు ఉన్నా.. పంట దిగుబడికి ఢోకా లేని గోధుమ వంగడాలపై విస్తృతమైన ప్రయోగాలు చేశారు. ఎకరా భూమిలో 30, 40 బస్తాల ధాన్యం వచ్చే వంగడాల సృష్టికి సైతం ఆద్యుడు స్వామినాథన్. 

ALSO READ: హరిత విప్లవ పితామహుడు.. ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత

ఆ తర్వాత ఈ ప్రయోగాలను అక్కడితో నిలిపివేయకుండా.. మిగతా అన్ని పంటలకు విస్తరించారు. తద్వారా అప్పటి వరకు ప్రపంచ దేశాల్లో మన వ్యవసాయ రంగంపై ఉన్న చులకన భావన పోయింది. అప్పట్లో స్వామినాథన్ ఆలోచనే.. ఇప్పటికీ దేశం ఆచరిస్తుంది.. ఆచరణలో పెడుతుంది అంటే.. స్వామినాథన్ ముందు చూపు.. దార్శినికత, వ్యవసాయంపై.. రైతులపై ఆయనకు ఉన్న మక్కువను తెలియజేస్తుంది. భారత రత్న తప్పితే.. మిగతా అన్ని పురస్కారాలు ఆయనకు దక్కాయి.