
బుధవారం ( మే 21 ) ఛత్తీస్ ఘడ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో 26 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే.. ఈ కాల్పుల్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబుపై అలిపిరి దాడి ప్రధాన సూత్రధారి నంబాల కేశవరావు హతమైనట్లు తెలుస్తోంది. అలిపిరిలో చంద్రబాబు నాయుడు మీద జరిగిన క్లైమోర్ మైన్స్ దాడిలో ప్రధాన సూత్రధారిగా ఉన్నారు నంబాల కేశవరావు. 2010లో CRPF జవాన్ల పై జరిగిన దాడి వెనక మాస్టర్ మైండ్ కేశవరావు అని సమాచారం.ఈ దాడిలో 72మంది జవాన్లు అసువులు బాసారు.
వరంగల్ REC లో ఎమ్.టెక్ చదివే సమయంలో అప్పటి నక్సల్‌బరి ఉద్యమానికి ఆకర్షితులై ఆ పార్టీలో చేరిన నంబాల గెరిల్లా యుద్ధ వ్యవహా రాల్లో నిపుణుడిగా ఎదిగాడు. కాగా.. ఇవాళ ఉదయం ఛత్తీస్ ఘడ్ అడవులు తుపాకుల మోతతో అడవులు ఉలిక్కిపడ్డాయి. మావోయిస్టుల ఏరివేతకు చేపట్టిన ఆపరేషన్ లో భాగంగా బుధవారం గాలింపు ముమ్మరం చేశాయి భద్రతా దళాలు. ఈ క్రమంలో నారాయణపూర్ జిల్లాలో భద్రతా దళాలకు ఎదురుపడ్డారు మావోయిస్టులు.
దీంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు హతమైనట్లు సమాచారం. మృతి చెందిన మావోయిస్టుల్లో అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా మృతి చెందినట్లు సమాచారం. మరికొంతమందికి గాయాలయ్యాయి.
మాధ్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్లో బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ డీఆర్జీ బలగాలు పాల్గొన్నట్లు సమాచారం. బుధవారం ఉదయం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.