చాన్సిస్తే రెండేండ్లలో దేశమంతా 24 గంటల కరెంట్‌‌

చాన్సిస్తే రెండేండ్లలో దేశమంతా 24 గంటల కరెంట్‌‌
  • ఇక దేశమంతా తెలంగాణ అద్భుతాలు
  • దేశ పరివర్తన కోసమే బీఆర్‌‌ఎస్‌‌: కేసీఆర్‌‌
  • ‘అబ్‌‌ కీ బార్‌‌ కిసాన్‌‌ సర్కార్‌‌’ నినాదంతో ముందుకు
  • ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండానే
  • చాన్సిస్తే రెండేండ్లలో దేశమంతా 24 గంటల కరెంట్‌‌
  • ఏటా 25 లక్షల మందికి దళితబంధు
  • కర్నాటకలో పోటీ చేస్తం.. కుమారస్వామిని సీఎం చేస్తం
  • 14న ఢిల్లీలో పార్టీ ఆఫీస్‌‌ ప్రారంభం..
  • అదే రోజు పార్టీ జాతీయ కార్యవర్గం ప్రకటిస్తం
  • తెలంగాణ భవన్‌‌లో బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో వెల్లడి


బీఆర్‌‌ఎస్‌‌.. వెలుగుదివ్వె. దేశం నలుమూలలా దాన్ని వ్యాపింపజేద్దాం. తెలంగాణ కీర్తి కిరీటాన్ని భరతమాత పాదాల ముందు పెట్టి దేశ ప్రతిష్టను పెంచుదాం. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాం కాబట్టే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోగలిగాం. తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నాం. ఈ వాస్తవాలను దేశ ప్రజల ముందుకు తీసుకుపోయి.. వారికి అర్థం చేయించగలిగితే ఢిల్లీ కోట మీద గులాబీ జెండా ఎగరడం ఖాయం. వెనుకబడిన తెలంగాణ ప్రాంతాన్నే ఇంత గొప్పగా అభివృద్ధి చేసుకున్నప్పుడు.. భారతదేశాన్ని ఇంకెంత గొప్పగా అభివృద్ధి చేసుకోగలం. దేశాన్ని మార్చాల్సిన అవసరం ఉన్నది. ఇది బీఆర్ఎస్ నుంచే ప్రారంభం కావాలె..
- సీఎం కేసీఆర్

హైదరాబాద్‌‌, వెలుగు:  దేశ పరివర్తన కోసమే భారత్‌‌ రాష్ట్ర సమితి (బీఆర్‌‌ఎస్‌‌)ని ఏర్పాటు చేస్తున్నామని.. సబ్బండ వర్గాల సౌభాగ్యం కోసం ‘అబ్‌‌ కీ బార్‌‌ కిసాన్‌‌ సర్కార్‌‌’ అనే నినాదంతో ముందుకు పోతామని సీఎం కేసీఆర్‌‌ అన్నారు. తెలంగాణ అద్భుతాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు. బీఆర్‌‌ఎస్‌‌కు ప్రజలు అవకాశమిస్తే రెండేండ్లలో దేశంలోని మారుమూల గ్రామాలకు కూడా 24 గంటల కరెంట్‌‌ అందిస్తామని చెప్పారు. ఏటా 25 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇస్తామని హామీ ఇచ్చారు. కొత్త ఒరవడితో దేశంలో వినూత్న ప్రగతి సృష్టించడానికి బీఆర్‌‌ఎస్‌‌ నడుం కట్టిందన్నారు. శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌‌లో  జరిగిన బీఆర్​ఎస్​ ఆవిర్భావ సభలో కేసీఆర్​ మాట్లాడారు. అంతకుముందు సీఈసీ నుంచి వచ్చిన లేఖకు సమాధానమిస్తూ రాసిన లేఖపై కేసీఆర్‌‌ సంతకం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. మంత్రులు, నేతలతో కలిసి తెలంగాణ భవన్‌‌లో త్రైలోక్య మోహన గౌరీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భారత్‌‌ రాష్ట్ర సమితి జెండాను ఎగురవేశారు. తర్వాత కేసీఆర్‌‌ మాట్లాడుతూ.. ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండానేనని తెలిపారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్‌‌ పోటీ చేస్తుందని, జేడీఎస్‌‌కు మద్దతిస్తుందని చెప్పారు. పార్టీ విధివిధానాల రూపకల్పన కోసం మాజీ జడ్జిలు, ప్రముఖ ఆర్థిక, సామాజికవేత్తలు, మేధావులతో కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు. ఈనెల 14న ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తామని, అదే రోజు పార్టీ జాతీయ కార్యవర్గం, అనుబంధ సంఘాలను ప్రకటిస్తామని వివరించారు.

కర్నాటకతోనే బీఆర్ఎస్ ప్రస్థానం షురూ

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ వెలుగుదివ్వె అని.. దేశం నలుమూలలా దాన్ని వ్యాపింపజేద్దామని కేసీఆర్ పిలుపునిచ్చారు. ‘‘వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాం కాబట్టే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోగలిగాం. అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నాం. ఈ వాస్తవాలను దేశ ప్రజల ముందుకు తీసుకుపోయి.. వారికి అర్థం చేయించగలిగితే ఢిల్లీ కోట మీద గులాబీ జెండా ఎగరడం ఖాయం’’ అన్నారు. ‘‘రాబోయే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం. జేడీఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతునిస్తూ ప్రచారంలో పాల్గొంటాం. మన రాష్ట్ర సరిహద్దులో ఉన్న ప్రాంతాల్లో ఆ పార్టీని గెలిపించి కుమారస్వామిని మరోసారి ముఖ్యమంత్రిని చేద్దాం. అందుకు తెలంగాణలో అమలవుతున్న విద్యుత్, వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం తదితర పథకాలను వారికి వివరిద్దాం. గతంలో కర్నాటక పోయినప్పుడు చెప్పినట్టే కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన మరోసారి సీఎం అవుతాడనే విశ్వాసం ఉంది. బీఆర్ఎస్ జాతీయ రాజకీయ ప్రస్థానం కర్నాటకతోనే ప్రారంభమైతది’’ అన్నారు. తెలంగాణ సాధన కోసం టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పేరుతో ప్రజల్లోకి పోయి రాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఇప్పుడు దేశ అభివృద్ధి, గుణాత్మక మార్పు లక్ష్యంగా భారత రాష్ట్ర సమితిగా పరిణామం చెందడం చారిత్రక అవసరమని కేసీఆర్ చెప్పారు. ‘‘ఈనెల 14న ఢిల్లీలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తాం. అదే రోజు నుంచి జాతీయ పార్టీ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. పార్టీ ముఖ్యులంతా 13వ తేదీనే ఢిల్లీకి చేరుకోవాలి. రెండు, మూడు నెలల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సొంత భవన నిర్మాణం పూర్తవుతుంది. అప్పుడు అక్కడి నుంచే కార్యకలాపాలు సాగుతాయి’’ అని వివరించారు.

కొత్త పాలసీలు రావాలి..

‘‘దేశంలో అదనపు నీటి వనరులున్నా నీళ్ల కోసం యుద్ధాలు జరగడం శోచనీయం. చెన్నై లాంటి మహానగరానికి బకెట్ నీళ్లు దొరకని దుస్థితి ఏమిటి? ఇదే సమస్యపై బాలచందర్ ‘తన్నీర్ తన్నీర్’ అనే సినిమా తీస్తే ప్రజలు దాన్ని సూపర్ హిట్ చేశారు. కావేరీ నదీ జలాల కోసం తమిళనాడు, కర్నాటక చేస్తున్న యుద్ధాలను చక్కదిద్దాల్సి ఉన్నది. దిక్కుమాలిన ట్రిబ్యునల్స్ పేరుతో నీటి యుద్ధాలను కొనసాగిస్తున్నరు. పరిస్థితిని బాగు చేయాల్సి ఉన్నది’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. పల్లెపల్లెకు కరెంట్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడానికి న్యూ పవర్‌‌‌‌‌‌‌‌ పాలసీ, రూపాయి విలువ పెంచేందుకు న్యూ ఎకనమిక్‌‌‌‌‌‌‌‌ పాలసీ, తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో దేశానికి న్యూ ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ పాలసీ, దేశంలోని ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సామాజిక, ఆర్థిక సాధికారత కోసం వీకర్‌‌‌‌‌‌‌‌ సెక్షన్ అప్‌‌‌‌‌‌‌‌లిఫ్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ పాలసీ, దేశ జనాభాలో 50 శాతం ఉన్న మహిళలను దేశ ప్రగతిలో మరింత భాగస్వాములు చేసేలా ఉమెన్‌‌‌‌‌‌‌‌ ఎంపవర్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ పాలసీ తేవాల్సి ఉందని చెప్పారు.

రైతులు ఇంకెంతకాలం ధర్నాలు చేయాలి? 

దేశంలో 40 కోట్ల ఎకరాల సాగుభూమి, 70 వేల టీఎంసీల నీళ్లు ఉన్నా రైతులు తమ హక్కుల కోసం ఇంకెంతకాలం ధర్నాలు చేయాలని కేసీఆర్ ప్రశ్నించారు. ‘‘రాజకీయాలంటే ఒక పార్టీ ఎన్నికల్లో గెలవడం, ఓడిపోవడం కాదు. ఎన్నికల్లో ప్రజలు గెలవాలె. ప్రజా ప్రతినిధులు గెలవాలె. సరిగ్గా ఇదే పరివర్తన కోసం ఏర్పాటైందే బీఆర్ఎస్ పార్టీ. ఎవరో ఒకరు చైతన్య దీపం వెలిగించకపోతే ఈ దేశంలో కారు చీకట్లు కొనసాగుతునే ఉంటయి. ఈ చీకట్లో వెలిగించిన చిరుదీపమే బీఆర్ఎస్ పార్టీ’’ అని తెలిపారు. సమావేశానికి కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి, మాజీ మంత్రి రేవన్న, సినీ నటుడు ప్రకాశ్‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌తో పాటు మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ నుంచి జాతీయ రైతు సంఘాల నాయకులు వచ్చారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌ ఆవరణలో అట్టహాసంగా సంబురాలు చేశారు. తర్వాత ఆహ్వానితులు, నేతలకు ప్రగతి భవన్‌‌‌‌‌‌‌‌లో కేసీఆర్ విందు ఇచ్చారు.

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లోకి మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి

ఆలంపూర్‌‌‌‌‌‌‌‌ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నాయకుడు చల్లా వెంకట్రామిరెడ్డి శుక్రవారం బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. ప్రగతి భవన్‌‌‌‌‌‌‌‌లో కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వెంకట్రామిరెడ్డి సేవలను బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పార్టీ కోసం జాతీయ స్థాయిలో వినియోగించుకుంటామని కేసీఆర్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. వెంకట్రామిరెడ్డి మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి మనవడు.

దేశ రాజకీయాల్లో కొత్త శకం: కవిత

దేశ రాజకీయాల్లో కొత్త శకం మొదలైందని ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌‌‌‌‌‌‌‌ చేశారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ను స్థాపించి దేశంలోని ప్రతి పౌరుడి వికాసమే లక్ష్యంగా.. సమైక్య, సంఘటిత, అభివృద్ధి రాజకీయాలకు శ్రీకారం చుట్టారన్నారు. ఎనిమిదేండ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌.. కలలుకనే ధైర్యాన్ని దేశంలోని పౌరులందరికీ ఇవ్వడానికి, ఆ కలలను నిజం చేయడానికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌లో జాతీయ పార్టీ ప్రకటన తర్వాత ప్రగతి భవన్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్న కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు కవిత మంగళహారతి ఇచ్చి, బొట్టుపెట్టి స్వాగతం పలికారు.

పిడికెడు మందితో మొదలైనం

తెలంగాణ సాధన కోసం ఆనాడు పిడికెడు మందితో మొదలై ఇప్పుడు దేశానికే మార్గదర్శనం చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. అభివృద్ధిలో తెలంగాణ అద్భుత ప్రగతితో ముందుకు పోతున్నదన్నారు. ‘‘వెనుకబడిన తెలంగాణ ప్రాంతాన్నే ఇంత గొప్పగా అభివృద్ధి చేసుకున్నపుడు.. దేశాన్ని ఇంకెంత గొప్పగా అభివృద్ధి చేసుకోగలం. అద్భుతమైన జల వనరులు, సాగు భూమి, వాతావరణం ఈ ప్రపంచంలో మరే దేశానికీ లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుడ్ చైన్ దేశంగా ఇండియా మారాల్సి ఉండె. కానీ మానవ వనరులను వాడుకోలేకపోతున్నం. యువ సంపత్తి నిర్వీర్యమైపోతున్నది. యువతను మతోన్మాదులుగా మార్చే కుట్రలు జరుగుతున్నయి. దీన్ని మార్చాల్సిన అవసరం ఉన్నది. ఇది బీఆర్ఎస్ నుంచే ప్రారంభం కావాలె.. ఇందులో భాగంగా దేశ ప్రజలను చైతన్యం చేయాల్సి ఉంది’’ అని అన్నారు.