సారంగదరియా పాట ఎవరిది?

సారంగదరియా పాట ఎవరిది?

ఇటీవల విపరీతమైన ఆదరణ పొందుతున్న ‘సారంగదరియా’ పాటపై జానపద గాయని కోమలి కొన్ని అభ్యంతరాలను లేవనెత్తింది. దర్శకుడు శేఖర్ కమ్ముల తీస్తున్న లవ్స్టోరీ సినిమాలో సాయి పల్లవి స్టెప్స్ను జోడించిన పాట సారంగదరియా. అయితే పాటను పూర్తిగా తీసుకోకుండా కేవలం నాలుగు చరణాలు మాత్రమే తీసుకున్నారు. ఈ పాటకు రచయితగా సుద్దాల అశోక్ తేజ పేరు ప్రకటించినా.. దాని మీద అభ్యంతరం రాలేదు. కాకపోతే, ఆయన మీద ఆరోపణ మాత్రం ఉంది. సినిమాకు జానపద పాటలకు మధ్య ఎప్పటి నుంచో రాపిడితో వచ్చిన మంట ఉన్నది.

ఇది మొదటి పాట కాదు..
జానపదాల నుంచి అనేక సినిమా పాటలు వచ్చా యి. జానపదం ప్రజలందరిదీ కనుక, ఇదివరకు ఎవరూ ఇంత తీవ్రస్థాయిలో పశ్నించలేదు. దీనిపై ఏ ఒక్కరికి హక్కు లేదు అనే విషయం వాస్తవమే అయినా సినిమా ఒక పాటను తమ పేటెంటెడ్ వ్యాపారంలో వాడుకోవడం ఎవరూ ప్రశ్నించలేదు. కానీ ఇక్కడే ఒక మౌలిక ప్రశ్న ఎదురవుతున్నది. సినిమా ఒక వ్యాపారం. సినిమాలో ఉన్న ప్రతి అంశం మీద చట్టం కల్పించిన హక్కులు ఉంటాయి. ఉండడంలో తప్పు లేదు. అయితే జనానికి చెందిన ఒక ఆస్తి ఈ పేటెంటెడ్ వ్యాపారంలో భాగం అయినప్పుడు ప్రశ్నలు రావడంలో తప్పులేదు. ప్రజలందరి ఆస్తిని కొందరు మాత్రమే సొంతం చేసుకున్నప్పుడు ఈ ప్రశ్న కచ్చితంగా వస్తుంది. ఆధునిక కాలంలో జానపద కళాకారుల జీవనోపాధులు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాయి. వారికి ప్రభుత్వం, సమాజం ఆలంబనగా ఉండాలి. జానపద కళలో పుట్టిన ఒక పాటను సేకరించి, కాపాడుతూ, మనకు నిరంతరం అందుబాటులో ఉంచుతున్న జానపద కళాకారులు డబ్బు సంపాదనలో బాగా వెనుకబడి ఉన్నారు. అటువంటి వారి జీవనోపాధికి ఆలవాలమైన పాట ఒక కమర్షియల్ సినిమాలో వాడుకున్నప్పుడు ఆ పాటను, ఆ కళను సజీవంగా ఉంచుతున్న కళాకారులకు గుర్తింపు ఇవ్వాలి. అది విపరీత ప్రజాదరణ పొందినప్పుడు, కాసులు కురిపించినప్పుడు అందులో కూడా ఆ యాజానపద కళాకారులకు భాగస్వామ్యం ఉండాలి.

ప్రజల సొత్తు వాడుకున్నప్పుడు వాటా ఇవ్వాలి..
సాంప్రదాయ కళలు అంతరించి పోతున్నప్పుడు అందుబాటులో ఉన్న వనరులతో వాటికి ఆదరణ పెంచే ప్రయత్నం జరగాలి. కోమలి సారంగదరియా పాటను సేకరించి ప్రాచుర్యం లోకి తీసుకు వచ్చింది. దీన్ని అందరూ అంగీకరిస్తున్నారు. కేవలం సేకరణ చేసింది కాబట్టి ఆమెకు ఎట్లాంటి హక్కులు లేవని అనడం ఎంతవరకు న్యాయం? ఇది వరకు వంగపండు రాసిన పాటను ఒక ప్రముఖ సినీ నిర్మాత వాడుకున్న సందర్భంలో కూడా వివాదం చెలరేగింది. గిరిజనులు అడవి నుంచి తేనె సేకరిస్తే, దానికి అత్యల్ప విలువ కట్టి దళారులు మార్కెట్లు ఎక్కువ రేటుకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. కేవలం సేకరించారు కాబట్టి గిరిజనులకు రావాల్సిన విలువలో ఎక్కువ అడిగే హక్కు లేదనగలమా? సేకరించే గిరిజనులే ఆ తేనె నిరంతర ఉత్పత్తిని కాపాడగలుగుతారు. వారికి కావాల్సిన విలువ ఇవ్వకపోవడం వల్లనే అడవి నాశనం అయ్యింది. చేనేత డిజైన్ను కాపీ కొట్టి బోటిక్ దుకాణాల్లో కోట్ల రూపాయలలో వ్యాపారం చేసి సొమ్ము చేసుకుంటున్నారు. చేనేత కళను అత్యంత దుర్భర పరిస్థితుల్లో కాపాడుతున్న కుటుంబాలకు మాత్రం ఈ రకం వ్యాపారం నుంచి ఎలాంటి ప్రయోజనం కలగట్లేదు. ఫలితంగా చేనేత కళ అంతరించిపోతున్నది. సంప్రదాయ కళ అంతరించిపోతున్న పరిస్థితులలో దాని నుంచి ఫలితం పొంది తిరిగి ఆ కళ మీద పెట్టుబడి పెట్టకపోవడం అనైతికం, అసమంజసం,అవివేకం.

జానపద కళాకారులకూ గుర్తింపు ఇవ్వాలి..
జానపద కళారూపాల మీద ఆధారపడిన వ్యాపారానికి, ఆ కళలు అంతరించిపోతే అటువంటి గని మళ్లీ దొరకదన్న స్పృహ లేకపోవడం శోచనీయం. ఇది తాను కూర్చున్న కొమ్మని నరుక్కోవడమే.బంగారం గుడ్డు పెట్టే బాతును చంపేస్తే మళ్లీ గుడ్లు రావు అనే జ్ఞానం ఎందుకు లేదు. తెలంగాణ సర్కారు, టీఆర్ఎస్ పార్టీ, సినీ నిర్మాతలు కూడా తెలంగాణ జానపద కళల వల్ల లబ్ధి పొంది, వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. జానపద కళలు కొనసాగాలి అనే లక్ష్యం ఉంటే వాటి నుంచి పొందిన లబ్ధితో జానపద కళాకారుల జీవనోపాధి సుస్థిరతకు దోహదపడే చర్యలు చేపట్టాలి. శేఖర్ కమ్ముల గానీ, సుద్దాల అశోక తేజ కానీ కోమలికి తగిన గుర్తింపు ఇవ్వాలి. పాట నుంచి వచ్చిన కీర్తి, కాసులలో వాటా ఇవ్వాలి. తెలంగాణ జానపద ట్రస్టు ఏర్పాటు చేసి జానపద కళాకారుల సంక్షేమానికి కార్యక్రమాలు చేపట్టాలి. అలా చేయడం సామాజిక బాధ్యత కూడా. అవి పొందడం కోమలి లాంటి కళాకారుల నైతిక హక్కు. - దొంతి నరసింహారెడ్డి, ఎనలిస్ట్